కౌన్సిల్‌లో రగడ!

ABN , First Publish Date - 2022-06-17T05:19:10+05:30 IST

మున్సిపల్‌ ఆస్తులను విద్యాశాఖకు విలీనం చేయడం కోసం మేయర్‌ గంగాడ సుజాత, కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై గురువారం ఒంగోలు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో దుమారం రేగింది. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని 21 పాఠశాలల ఆస్తులను విద్యాశాఖలో విలీనం చేసేందుకు ఇటీవలి కాలంలో మేయర్‌ గంగాడ సుజాత, కమిషనర్‌ వెంకటేశ్వరరావు అంగీకారాన్ని ప్రభుత్వానికి పంపారు.

కౌన్సిల్‌లో రగడ!
డీసెంట్‌ నోటీసు ఇస్తున్న టీడీపీ కార్పొరేటర్లను అడ్డుకుంటున్న వైసీపీ కార్పొరేటర్లు, వారిస్తున్న మేయర్‌ సుజాత

దాతలిచ్చిన  ఆస్తులుధారాదత్తమా?

అలా చేయడానికి వీల్లేదంటూ ధ్వజం

మునిసిపల్‌ ఆస్తులు విద్యాశాఖకు విలీనంపై దుమారం 

మేయర్‌, కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయాలపై మండిపాటు

తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లపై అధికార దౌర్జన్యం

సమావేశంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట

వాడివేడిగా ఒంగోలు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం 

నాలుగైదు అంశాల్లో ప్రతిపక్ష కార్పొరేటర్లకు వైసీపీ మద్దతు 

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 16: 

ఒంగోలు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆస్తుల రగడ నెలకొంది. అధికార పార్టీ అసంబద్ధ నిర్ణయాలపై ప్రతిపక్ష టీడీపీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు.   మునిసిపల్‌ స్కూళ్ల అభివృద్ధి కోసం దాతలు ఇచ్చిన రూ.600 కోట్లు విలువైన ఆస్తులను కౌన్సిల్‌ ఆమోదం లేదు. అయినా ప్రభుత్వానికి ఎలా అంగీకారం తెలియజేస్తారంటూ టీడీపీ కార్పొరేటర్లతోపాటు వైసీపీకి చెందిన డిప్యూటీ మేయర్‌ మేయర్‌ను నిలదీశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.  మేయర్‌ పోడియం వద్దకు వచ్చి ప్రతిపక్ష కార్పొరేటర్లు ప్రశ్నించడంతో కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. దౌర్జాన్యానికి తెగబడ్డారు. దీంతో గందరగోళం నెలకొంది. వాగ్వాదం, తోపులాటతోపాటు టీడీపీ కార్పొరేటర్లపై దౌర్జన్యానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. నగర అభివృద్ధిలో భాగంగా కౌన్సిల్‌లో చర్చించి ఆమోదించేందుకు 17 అంశాలను అజెండాలో పొందుపరచగా, 4వ అంశంపై దుమారం రేగింది.


మున్సిపల్‌ ఆస్తులను విద్యాశాఖకు విలీనం చేయడం కోసం మేయర్‌ గంగాడ సుజాత, కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై గురువారం ఒంగోలు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో దుమారం రేగింది. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని 21 పాఠశాలల ఆస్తులను విద్యాశాఖలో విలీనం చేసేందుకు ఇటీవలి కాలంలో మేయర్‌ గంగాడ సుజాత, కమిషనర్‌ వెంకటేశ్వరరావు అంగీకారాన్ని ప్రభుత్వానికి పంపారు. దీనిపై మొదటగా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, వేమూరి అశ్వని, తిప్పరమల్లి రవితేజ, అంబూరి శ్రీనివాసరావు, సండ్రపాటి వర్డ్స్‌వర్త్‌, గుట్లపల్లి మస్తానమ్మ అభ్యంతరం తెలియజేశారు. ఒంగోలులోని పిల్లల విద్య కోసం తమ విలువైన కోట్లాది రూపాయల ఆస్తులను ఉచితంగా అందిస్తే వాటిని ఇపుడు ప్రభుత్వానికి ఎలా కట్టబెడతారని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఉచితంగా ధారాదత్తం చేస్తే ఉపేక్షించేది లేదని అభ్యంతరం తెలియజేశారు. 

అధికార పార్టీ నుంచి నిలదీతలు

ఇదిలాఉండగా, మొదటగా ఇదే అంశంపై అధికారపార్టీకి చెందిన డిప్యూటీ మేయర్‌ వెలనాటి మాధవరావు అభ్యంతరం తెలియజేశారు. ఎవరిష్టమొచ్చినట్లు వారు దాతలు ఇచ్చిన ఆస్తులను ఎలా ఇతర శాఖకు కేటాయిస్తారని మేయర్‌ను ప్రశ్నించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పనులకు జనరల్‌ ఫండ్‌ నుంచి బిల్లులు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలుకావడానికి ఆరునెలలు సమయం పట్టిందని, అలాంటిది ఎంతో సున్నితమైన, విలువైన ఆస్తుల అంశం ఇప్పటికిప్పుడు ఎలా ఆమోదిస్తారని నిలదీశారు. దీంతో అటు అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు మేయర్‌ తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేషన్‌ స్కూళ్ల ఆస్తులను ప్రభుత్వానికి కట్టబెట్టకుండా పర్యవేక్షణకు మాత్రమే ఆమోదించాలని అధికారపక్షం కార్పొరేటర్లు సూచించగా, అదీ కూడా చేయడానికి వీలులేదని, ఆస్తులనుకార్పొరేషన్‌ వారే చూసుకోవాలని టీడీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. 


టీడీపీ కార్పొరేటర్లపై దౌర్జన్యం

మునిసిపల్‌ స్కూళ్లు విద్యాశాఖకు ఇస్తూ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌కు డీసెంట్‌ నోట్‌ ఇవ్వడానికి పోడియం వద్దకు వెళ్లగా కొందరు వైసీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో కౌన్సిల్‌ హాలులో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటచేసుకుంది. ఈ సమయంలో కొందరు వైసీపీ కార్పొరేటర్లు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరించారు. ప్రత్యేకంగా 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ అంబటి ప్రసాద్‌ ఓవరాక్షన్‌ అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. పరిధి దాటి ప్రవర్తనతోపాటు ఇదేం దౌర్జన్యం అని నిలదీస్తున్న 8వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ సండ్రపాటి వర్డ్స్‌వర్త్‌ను కిందకు తోసేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో టీడీపీ కార్పొరేటర్లు ఎదురుతిరిగారు. ఐదుగురే ఉన్నా వైసీపీ వారికి దీటుగా సమాధానమిచ్చారు. అరగంటపాటు జరిగిన తోపులాటతో ఏం జరుగుతుందోనన్న గందరగోళ పరిస్థితి నెలకొంది. పదిమంది వరకు అధికారపార్టీ కార్పొరేటర్లు అధికారుల ముందే దౌర్జన్యం చేయడం గమనార్హం. మేయర్‌ పోడియంపైకి ఎక్కి ఇష్టారీతిన దూషించడం, రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. వారి అతితో అక్కడ వాతావరణమంతా రసాభాసగా మారిపోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అధికారపార్టీ కార్పొరేటర్లనే అదుపుచేయాల్సి వచ్చింది. మేయర్‌ నోట్‌ స్వీకరించడంతో టీడీపీ వారు ఆందోళనను విరమించారు.


  అజెండాలోని అంశాలపై అసంతృప్తి

కౌన్సిల్‌ సమావేశంలో పొందుపరిచిన మూడు, నాలుగు అంశాలపై వైసీపీ కార్పొరేటర్లు కూడా తీవ్ర నిరసన తెలియజేశారు. ముఖ్యంగా కార్పొరేషన్‌ ఆస్తులను విద్యాశాఖలో విలీనం చేయడానికి వీలులేదని డిప్యూటీ మేయర్‌ వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు చింతపల్లి గోపి, ఇమ్రాన్‌ఖాన్‌, ఈదర వెంకటసురే్‌షబాబులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తులను కాపాడాల్సింది పోయి ఏకంగా ఇచ్చేయడమేమిటంటూ అభ్యంతరం తెలిపారు. కేవలం విద్యాశాఖ పర్యవేక్షణకు మాత్రమే అనుమతించాలని వారు కోరారు. దీంతో అజెండా అంశాల్లో తెలుగుదేశం పార్టీ లెవనెత్తిన పలు అభ్యంతరాలకు వైసీపీ కార్పొరేటర్లు కొంతమంది మద్దతు తెలియజేయడం విశేషం. దత్తాత్రేయ కాలనీ సమీపంలోని ఓ ప్రైవేటు భూమి ఇతరుల స్వాధీనంలో ఉండగా, ఆ స్థలానికి రోడ్డు వేయడాన్ని అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు వ్యతిరేకించారు. అలాగే 50వ డివిజన్‌లోని ఓ ప్రైవేటు స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మాణాన్ని కౌన్సిల్‌ సభ్యులు వ్యతిరేకించారు. 




Updated Date - 2022-06-17T05:19:10+05:30 IST