
తాడిపత్రి: జేసీ బ్రదర్స్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు. అంత పాపులర్ లీడర్స్ అయిన ఈ అన్నదమ్ములు.. స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తూ ఉంటారు. వీరిద్దరూ ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద వార్తల్లో ఉంటూ అందరి దృష్టినీ తమవైపు తిప్పుకొంటుంటారు. సంతోషం వచ్చినా ఆవేశం వచ్చినా జేసీ బ్రదర్స్‌ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. తాడిపత్రితో పాటు అనంతపురం జిల్లా మొత్తం మీద వీరి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వైసీపీ ప్రభంజనంలో కూడా తాడిపత్రి మున్సిపల్ స్థానాన్ని టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. మీడియా సమావేశం.. బహిరంగ సభ.. వేదిక ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం వీరి ప్రత్యేకత.
మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డిపై.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకం శ్రీనివాస్‌రెడ్డిని టీడీపీ కార్యకర్తలకు ప్రభాకర్‌రెడ్డి పరిచయం చేశారు. ఈ పరిచయ కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ.. పల్లె రఘునాథ్‌రెడ్డిపై విమర్శలు కురిపించారు. శ్రీనివాస్‌రెడ్డి మచ్చలేని నాయకుడని కొనియాడారు. పల్లె రఘునాథ్‌రెడ్డికి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. ఆయనకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా టీడీపీ గెలుస్తుందని తెలిపారు. కొత్త ముఖాలకు టికెట్ కేటాయించాలన్నారు. తన కుమారుడి కంటే మంచివ్యక్తికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తానని జేసీ ప్రభాకర్ ప్రకటించారు.