ltrScrptTheme3

Sharmilaతో తమకు సంబంధం లేదని సజ్జల అనడం దురదృష్టకరం: రఘురామ

Sep 27 2021 @ 15:50PM

న్యూఢిల్లీ: జగన్‌తో సమానంగా పాదయాత్ర చేసి, ప్రచారంలో పాల్గొని విజయానికి కారణమైన షర్మిలతో తమకు సంబంధంలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అనడం దురదృష్టకరమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సజ్జల కేవలం మౌత్ పీసని, సీఎం జగన్ చెప్పమన్నందుకే సజ్జల అలా చెప్పారని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. తన పార్లమెంటు నియోజవర్గం పరిధిలో షర్మిల నాలుగు చోట్ల ప్రచారం చేశారని, జనం కూడా బాగా వచ్చారన్నారు. పార్టీ కోసం, ఎన్నికల కోసం జగన్ కంటే ఎక్కువగా షర్మిల కష్ట పడ్డారన్నారు. అలాంటి ఆమెకు పార్టీలో సభత్వం లేదని షర్మిల  అనడం నిజంగా షాకింగ్ వార్త అన్నారు.  ఆమెకు అన్యాయం జరిగిందన్నారు.


సొంత చెల్లెమ్మలను కుడా పట్టించుకోకుండా మిగిలిన ఆడపడుచుల కోసం సీఎం జగన్ కష్ట పడుతున్నారని రఘురామ అన్నారు. జగన్, షర్మిల మధ్య ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయన్నారు. ఆస్తులు లాగానే రాజకీయాలను పంచుకున్నట్లు కనపడుతోందన్నారు. అన్నా చెల్లెలు మాట్లాడుకోవడం తప్పుకాదన్నారు. అయితే అక్రమాస్తుల కేసులో జగన్ కడిగిన ముత్యంలా బయటకురావాలనేది తన కోరిక అని అన్నారు. ఇదే ప్రశ్న షర్మిలను అడిగితే జగన్ జైలుకు  ఏందుకు వెళతారు.. కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మాత్రం చెప్పలేదన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చాలా వరకు నిజాలే చెప్పారన్నారు.


కుటుంబంలో విభేదాలకు ఆస్తులు ఒక కారణం కావచ్చునని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రజల్లో వైసీపీ గ్రాఫ్ తగ్గుతోందని, వాపు చూసి బలం అనుకోవద్దన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ 15 శాతం తగ్గిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినదానిని తాను పూర్తిగా సమర్ధిస్తానన్నారు. పవన్ కళ్యాణ్‌పై మంత్రుల వ్యాఖ్యలు చాలా దారుణమన్నారు. ‘మై సన్’ అన్నందుకు అయ్యన్న పాత్రుడుపై కేసు పెట్టారని, మరి ఇప్పుడు మంత్రి పేర్ని నాని మాట్లాడిన మాటలు మొత్తం కాపులను దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. డ్రగ్స్ మాఫియాలో మాచవరం సుధాకర్ కేవలం నామా మాత్రమేనని, వెనుక పెద్ద వ్యక్తులు, ముఖ్యులు ఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. రైతు చట్టాలపై వైఎస్ఆర్సీపీ ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనపడుతోందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.