నా నియోజకవర్గానికి తప్పకుండా వస్తా.. ఏం జరుగుతుందో చూస్తా..: Raghurama

ABN , First Publish Date - 2022-06-23T16:27:25+05:30 IST

ఏపీలో పర్యటనకు తప్పకుండా వస్తానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.

నా నియోజకవర్గానికి తప్పకుండా వస్తా.. ఏం జరుగుతుందో చూస్తా..: Raghurama

Delhi: తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు తప్పకుండా వెళతానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama KrishnamrajU) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) తో మాట్లాడుతూ 5వ తేదీ తర్వాత తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా పరవాలేదని, న్యాయపోరాటం చేస్తానని చెప్పానన్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దామన్నారు. తానైతే నూటికి నూరు శాతం భీమవరం వస్తానని రఘురామ మరోసారి స్పష్టం చేశారు.


ఏపీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో తాను రాష్ట్రానికి వస్తే అరెస్టు చేయవలసి వస్తుందని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వడానికి భద్రత కావాలని రఘురామ కృష్ణంరాజు కేంద్ర హెంశాఖకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో పర్యటించేందుకు జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేయడానికి ఏపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. తన అరెస్టుకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నాయని రఘురామ వ్యాఖ్యానించారు. ఒక ప్రజాప్రతినిధిని అడ్డుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎంపీకే ఇలా జరిగితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని రఘురామ అన్నారు. 


నన్ను నియోజకవర్గానికి రానివ్వరా?

‘నా నియోజకవర్గానికి నేను వళ్తానంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వచ్చిన సమస్య ఏమిటో అర్థం కావడం లేదని’ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను రాష్ర్టానికి రావద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చెప్పినట్లు సహచర ఎంపీలు చెప్పారని.. రాష్ట్రం ఏమైనా నీ సొంతమా అని జగన్‌ను ప్రశ్నించారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారన్నారు. రఘురామ రాష్ర్టానికి వేస్తే, అరెస్టు చేయవలసి వస్తుందని ‘లా జస్టిస్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిటీ’ సభ్యులకు ఏపీ పోలీసులు చెప్పారని తెలిపారు. ‘లా జస్టిస్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ కమిటీ’ విశాఖలో సమావేశం కావాల్సి ఉందని, ఈ విషయాన్ని కమిటీ సభ్యులు రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్లగా... కమిటీలో రఘురామరాజు ఉంటే ఆ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని సూచించినట్లు తమ సభ్యులు చెప్పారన్నారు. ఆయన వస్తే అరెస్టు చేస్తామని, ఆ తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారన్నారు. ఒక ఎంపీ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్‌ చేశారు. తనను అడ్డుకోవడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతీసే బరితెగింపు చర్యలకు దిగొద్దని సీఎం జగన్‌ను హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని, తన గ్రామంలో, తన ఇంటి సమీపంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతుంటే, స్థానిక లోక్‌సభ సభ్యుడిగా తాను హాజరు కావడం ప్రోటోకాల్‌ అని, ముఖ్యమంత్రి హాజరైనా కాకపోయినా... తాను మాత్రం హాజరు కావాలన్నారు. 32 కేసుల్లో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం జగన్‌ విదేశాలకు వెళ్లొచ్చు కానీ.. తాను మాత్రం నియోజకవర్గానికి వెళ్లొద్దా? అని రఘురామ ప్రశ్నించారు.

Updated Date - 2022-06-23T16:27:25+05:30 IST