కాంట్రాక్టర్లు చిప్పతో ఆర్ధిస్తున్నారు: రాఘురామ

ABN , First Publish Date - 2021-10-08T20:51:08+05:30 IST

సీఎం జగన్ పాలనలో ఏపీ పరిస్థితి దిగజారిపోయిందని ఎంపీ రాఘురామ కృష్ణం రాజు విమర్శించారు.

కాంట్రాక్టర్లు చిప్పతో ఆర్ధిస్తున్నారు: రాఘురామ

న్యూఢిల్లీ: జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ పరిస్థితి దిగజారిపోయిందని, చేసిన పనికి డబ్బులు రాక కాంట్రాక్టర్లు రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మేము కాంట్రాక్టర్లం.. మా బిల్లులు చెల్లించండి, మా ప్రాణాలు కాపాడండి, ఆస్తులు కరిగాయి, అప్పులు పెరిగాయి’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, చిప్పతో ఆర్ధిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో కంపెన్సివ్  ఫైనాన్షియల్ మేనేజింగ్ సిస్టం ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు డబ్బులివ్వకుండా గత ప్రభుత్వం హాయంలో చేసిన పనులకు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నట్లు తెలిసిందన్నారు. రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇదే మాట అంటే పరిస్థితేంటని రఘురామ ప్రశ్నించారు.


ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రఘురామ ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగులంతా ఆందోళనకు దిగితే పరిస్థితి చేయిదాటిపోతుందన్నారు. కాలేజీలకు బకాయిలు చెల్లించలేదని, రేపో మాపో వారు కూడా నిరసనకు దిగే అవకాశముందన్నారు. రాష్ట్ర పరిస్థితి ఇలానే ఉంటే.. ఏపీ దివాళా తీస్తుందన్నారు. బిహార్, ఒరిస్సాలను చూసి పాలన నేర్చుకోవాల్సి ఉంటుందని రఘురామ వ్యాఖ్యానించారు.


అముల్ విషయంలో 12మంది పంచాయతీ కార్యదర్శకులకు నోటీసులిచ్చారని రఘురామ అన్నారు. అముల్‌పై తాను కూడా కోర్టులో కేసు వేశానన్నారు. ప్రభుత్వం చేపలు అమ్మితే.. మత్స్యకారులు ఏం చేయాలని ప్రశ్నించారు. దుర్గగుడిలో అన్యమత ప్రచారం వీడియోను ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులందరిని తొలగిస్తామంటున్నారని, సీఎం దగ్గర ఉన్న న్యాయశాఖను చదువుకున్నవారికి ఇవ్వాలని రఘురామ సూచించారు.

Updated Date - 2021-10-08T20:51:08+05:30 IST