నాపై అనర్హత వేటు ప్రశ్నే లేదు

ABN , First Publish Date - 2022-05-25T09:28:48+05:30 IST

‘నేను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఉల్లంఘించలేదు. అలాంటప్పుడు నా లోక్‌సభ సభ్యత్వంపై..

నాపై అనర్హత వేటు ప్రశ్నే లేదు

విలువల గురించి మాట్లాడే  నైతిక అర్హత మాపార్టీ నేతలకు లేదు

సభలో ఎన్నడూ వైసీపీ విప్‌ జారీ చేయలేదు

అప్పుడు విప్‌ ఉల్లంఘన ప్రశ్నే ఉత్పన్నం కాదు

సీఎంని, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నాకుంది

ఏజెన్సీలో ‘అనంత’ది వీరప్పన్‌ ఇమేజ్‌: రఘురామ


న్యూఢిల్లీ, మే 24(ఆంధ్రజ్యోతి): ‘‘నేను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఉల్లంఘించలేదు. అలాంటప్పుడు నా లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసే ప్రశ్నే తలెత్తదు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని మా పార్టీ నాయకత్వం చెప్పినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంకా మరేవిధంగా ప్రభావితం చేయాలని చూసిన నన్ను చేయగలిగిందేమీ లేదు. విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత మా పార్టీ నేతలకు, ఎంపీ మార్గాని భరత్‌కు ఉందా?’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు మా పార్టీ కండువా కప్పుకొని నిస్సిగ్గుగా తిరుగుతున్నా వారిపై అనర్హత వేటు ఎందుకు వేయడం లేదు? నేనేమీపార్టీ మారలేదు. పార్టీలోనే ఉంటూ ప్రశ్నిస్తుంటే నాపై వేటు వేయాలని కోరడం విడ్డూరంగా ఉంది. పార్లమెంటులో నేను విప్‌ ఉల్లంఘించినట్లు తప్పుడు మాటలు చెబుతున్నారు. అసలు ఇప్పటి వరకూ మా పార్టీ పార్లమెంటులో విప్‌నే జారీ చేయలేదు. విప్‌ జారీ చేయనప్పుడు దాన్ని ధిక్కరించానన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. రాజ్యాంగంలోని 350 ఏ అధికరణ ఏమి చెబుతుందో మా పార్టీ వారికి తెలియదు. ఆ అధికరణ ప్రకారం మాతృభాషను ప్రోత్సహించాలి. నేను అదే విషయాన్ని లోక్‌సభలో ప్రస్తావించాను. అక్కడ ఏ రకంగానూ నేను రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు. నా మాటలన్నీ సభ రికార్డుల్లో పదిలంగానే ఉన్నాయి’’ అని రఘురామ అన్నారు. బొచ్చులో నాయకత్వం అని తాను జగన్‌రెడ్డిని ఉద్దేశించి అనలేదని ఆయన వివరించారు.  ‘‘పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్‌ ఇచ్చిన హామీల మేరకు మేం అధికారంలోకి వచ్చాము. కానీ సీఎంగా ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. పోలీసుల దాష్టీకానికి భయపడి ప్రజలెవరూ మాట్లాడకపోయినా పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో నాలాంటి వారు మాట్లాడితే తప్పు పట్టడం ఏమిటి? సీఎం జగన్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నాకు ఉంది. ఒకవేళ పార్టీ అధ్యక్షుడినే విమర్శిస్తున్నానని, పార్టీ విధివిధానాలను ఉల్లంఘిస్తున్నానని అనుకుంటే నన్ను పార్టీ నుంచి బహిష్కరించవచ్చు’’ అని ఎంపీ స్పష్టం చేశారు. మరోవైపు, హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంతబాబు ఏజెన్సీ ప్రాం తాల్లో తన ఆగడాలతో వీరప్పన్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నారని ఎద్దేవా చేశారు.  అనంత బాబుకు ప్రాణహాని ఉన్నట్లు గా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అనంతబాబు ఆగడాలపై ఎన్‌ఐఏతో విచారణజరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇక ప్రజల సొమ్ముతో సీఎం జగన్‌ విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. 

Updated Date - 2022-05-25T09:28:48+05:30 IST