బోర్డు పరీక్షల రద్దుపై సీఎం నిర్ణయం తీసుకోవాలంటూ రఘురామ లేఖ

ABN , First Publish Date - 2021-06-24T20:24:06+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోణ్ రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ రాశారు.

బోర్డు పరీక్షల రద్దుపై సీఎం నిర్ణయం తీసుకోవాలంటూ రఘురామ లేఖ

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ రాశారు. సుప్రీంకోర్టు హితవుపలికిన నేపథ్యంలో బోర్డు పరీక్షల రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, పరీక్షలు రద్దు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.  పట్టుదల, పంతాలు, పట్టింపులు పక్కనపెట్టి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని కోరారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చిత్తశుద్ధిని సుప్రీంకోర్టు శంకించిందని, ఆ విషయాన్ని గుర్తెరగాలన్నారు. ప్రభుత్వ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అనేక అనుమానాలు లేవనెత్తిందన్నారు. కరోనా అనిశ్చితి వాతావరణం కొనసాగుతున్న తరుణంలో పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపటం బాధాకరమైన విషయమన్నారు.


డెల్టా వేరియంట్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పడం శోచనీయమని రఘురామ అన్నారు. పరీక్షలను నిర్వహించడం అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందన్నారు. పక్కా ప్రణాళిక లేకుండా మొండితనంతో పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం మంచిది కాదని సూచించారు. పరీక్షలు నిర్వహిస్తే.. జరగరాని నష్టం చోటు చేసుకుంటే.. సరిదిద్దుకోలేని తప్పు అవుతుందన్నారు.  సుప్రీం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని.. పరీక్షల నిర్వహణపై విజ్ఞతతో గౌరవ ప్రదమైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని రఘురామ ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-06-24T20:24:06+05:30 IST