రాహుల్ భావదారిద్ర్యం

ABN , First Publish Date - 2021-07-20T08:36:39+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరి చూస్తుంటే నృత్యం చేయలేని నర్తకి రంగస్థలాన్ని తప్పుపట్టినట్లు కనపడుతోంది. ఇటీవల పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో ఆయన...

రాహుల్ భావదారిద్ర్యం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైఖరి చూస్తుంటే నృత్యం చేయలేని నర్తకి రంగస్థలాన్ని తప్పుపట్టినట్లు కనపడుతోంది. ఇటీవల పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అంటే భయపడేవారు కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరాలని ఉచిత సలహా నిచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రాజకీయ పార్టీ కాదు. ఆర్‌ఎస్‌ఎస్ అనేది హిందూ సంస్కృతిని, సంప్రదాయాలను హిందూసమాజాన్ని పరిరక్షించాలని, ప్రధానంగా జాతి నిర్మాణాన్ని ఆకాంక్షిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమాత్రం కనీస జ్ఞానం లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడడం ఆయన భావదారిద్ర్యానికి, అవివేకానికి నిదర్శనం. 1934లో వార్ధాలో ఆర్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని సందర్శించిన జాతిపిత మహాత్మాగాంధీ నుంచి 2018లో నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు ఆ సంస్థను ఏ విధంగా అర్థం చేసుకున్నారో తెలుసుకుంటే రాహుల్ ఇలా మాట్లాడేవాడు కాదు. 


కాంగ్రెస్‌కు ఎలాంటి సైద్ధాంతిక భూమిక లేదు. అవసరార్థ రాజకీయాలను అది అవలంభిస్తుంది. అది ప్రజలను కులాలుగా, మతాలుగా విడదీస్తుంది. అరాచక, విచ్ఛిన్నకర శక్తులన్నిటితో చేతులు కలుపుతుంది. హిందూ ఓట్ల కోసం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శిలాన్యాస్‌ను అనుమతించిన తన తండ్రి రాజీవ్ గాంధీయే అయోధ్య నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం రాహుల్ గాంధీకి తెలియనిది కాదు. అదే రాజీవ్ గాంధీ ముస్లింలను బుజ్జగించేందుకు సుప్రీంకోర్టు తీర్పును పార్లమెంట్ ద్వారా బుట్టదాఖలు చేయించి ముస్లిం మహిళలకు అన్యాయం చేసిన విషయం కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. 2014లో విశ్వసనీయ నేతగా నరేంద్రమోదీ ఆవిర్భవించిన తర్వాత ప్రజలు భారతీయ జనతాపార్టీని అఖండమైన మెజారిటీతో ఆదరించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అంతిమ దశ ఆరంభమైంది. 2014లో 282 సీట్లు గెలుచుకున్న బిజెపి సంఖ్యాబలం 2019లో 303కి పెరిగింది.


నిజానికి బిజెపి ప్రాభవాన్ని కాంగ్రెస్ నేతలు 2013 నుంచే గమనించడం ప్రారంభించారు. బిజెపి ఘనవిజయం సాధించనున్నదని తెలిసిన కాంగ్రెస్ నేతలు బిజెపికి అప్పటి నుంచే వలస రావడం ప్రారంభించారు. యుపిఏ ప్రభుత్వంలో జౌళి మంత్రిగా ఉన్న రావు ఇంద్రజిత్ సింగ్, కాంగ్రెస్ లోక్‌సభ ఎంపి జగదంబికా పాల్ 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందే బిజెపిలో చేరారు. వారే కాదు, ఎందరో మాజీ కేంద్ర మంత్రులు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, కాంగ్రెస్ మాజీ పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు పెద్ద సంఖ్యలో బిజెపి పట్ల ఆకర్షితులయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ, నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో ఉన్న రావు బీరేంద్రసింగ్, మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉండి రాజ్యసభలో పార్టీ చీఫ్ విప్‌గా ఉన్న భువనేశ్వర్ కలితా, రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర కేబినెట్ మంత్రిగా, గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన వృద్ధనేత ఎన్‌డి తివారీ వరకు బిజెపిలో తమ భవిష్యత్‌ను చూసుకున్నారు. వీరే కాదు, యుపిసిసి అధ్యక్షురాలిగా ఉన్న రీటా బహుగుణ, ఉత్తరాఖండ్‌లో మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, మాజీ స్పీకర్ యశ్‌పాల్ ఆర్య, కేంద్రమంత్రి సత్పాల్ మహరాజ్, ఛత్తీస్‌గఢ్‌ పిసిసి అధ్యక్షుడు రాందాల్ ఉయికే, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బిరెన్‌సింగ్, అరుణాచల్‌ప్రదేశ్ మాజీ నేత ప్రేమాఖండు, అస్సాం మాజీ పీసీసీ నేత హిరణ్య భువన్, మాజీ కేంద్ర మంత్రి కృష్ణ తీరథ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్ఖాసింగ్, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్‌తో పాటు ఎందరో కాంగ్రెస్ ప్రముఖులు తమ పార్టీకి భవిష్యత్ లేదని తెలుసుకుని బిజెపిలో చేరారు. 


కొద్ది రోజుల క్రితం అస్సాం ముఖ్యమంత్రిగా ఎంపికైన హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్‌లో ఒకప్పుడు అత్యంతాదరణ గల యువ నాయకుడు. 80 ఏళ్లు దాటిన తరుణ్ గొగోయ్ కన్నా హిమంత బిశ్వ శర్మకు జనంలోనూ, మెజారిటీ ఎమ్మెల్యేలలోనూ ఆదరణ ఉన్నదని తెలిసినప్పటికీ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం అనేక సార్లు ఢిల్లీ పిలిచి అతడిని అవమానించింది. ఒక సందర్భంలో రాహుల్ గాంధీ అతడిని పిలిచి తన కుక్కతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ విస్మరించాడని, అయిదు నిమిషాల తర్వాత ‘నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో.. మళ్లీ నా దగ్గరికి రాకు’ అని చెప్పాడని ఢిల్లీ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ తన పుస్తకంలో రాశారు. ఆ తర్వాత హిమంత బిశ్వ శర్మ బిజెపిలో చేరి తన శక్తిని పూర్తిగా కేంద్రీకరించి పార్టీ కోసం పని చేసి రెండోసారి బిజెపి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయనకు బిజెపి అస్సాం ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.


రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని పార్టీలో ముఖ్యమైన నేతలు కూడా గ్రహించినందువల్లే జ్యోతిరాదిత్య, హిమంత బిశ్వ శర్మ లాంటి అనేకమంది బిజెపిలో చేరారు. ఈ విషయం రాహుల్‌కు ఇంకా అర్థం కావడం లేదు. తన అసమర్థ నాయకత్వం, ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులను గమనించకపోవడం, ప్రజల నిజమైన సమస్యలను తెలుసుకోలేకపోవడం, ఎందరో సమర్థులైన నాయకులున్నా, కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీ కావడం వల్లే ఇవాళ ఆ పార్టీని ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్న విషయం స్పష్టమవుతోంది. అందువల్ల రాహుల్‌ గాంధీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను నిందించడం పూర్తిగా అర్థరహితం.


విచిత్రమేమంటే ఇలాంటి అసమర్థ నేతను కాంగ్రెస్ పార్టీ వదుల్చుకోలేకపోతుంటే, నరేంద్రమోదీని ఎదుర్కోవడానికి ఏ విధంగా ప్రత్యామ్నాయం రూపొందించాలో పలు ప్రాంతీయ పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. రెండుసార్లు లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ కనీసం పది శాతం సీట్లు కూడా సాధించకుండా ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయిందని వారికి తెలిసినప్పటికీ నాయకత్వం మార్చుకొమ్మని వారు పుత్రప్రేమలో ఉన్న సోనియాగాంధీకి చెప్పలేకపోతున్నారు. 


మోదీ అధికారంలో వచ్చినప్పటి నుంచీ పార్లమెంట్ జరిగిన ప్రతిసారీ ప్రతిపక్షాలు సమావేశాలను అడ్డుకునేందుకు విశ్వయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాల మొదటి రోజు కొత్తగా పునర్వ్యవస్థీకరించిన మంత్రివర్గ సభ్యులను ప్రధానమంత్రి పరిచయం చేయకుండా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. అత్యధిక సంఖ్యలో తాను ఓబీసీలను, ఎస్‌సి, ఎస్‌టి, మహిళలను మంత్రివర్గంలో తీసుకుంటున్నానని ప్రధానమంత్రి చెబుతున్నా వారు వినిపించుకోలేదు. మంత్రివర్గ సభ్యుల పరిచయాన్ని కూడా అడ్డుకోవడం ఇది చరిత్రలో మొదటి సారి. అంతేకాదు ప్రతిపక్షాల వైఖరితో ఆయా వర్గాలపై వారికి ఎంత గౌరవం ఉన్నదో, మోదీ ఆయ వర్గాల అభిమానాన్ని చూరగొన్నందుకు వారికెంత అక్కసు ఉన్నదో అర్థమవుతోంది. మోదీ ప్రభుత్వానికి కావల్సింది భారతదేశ పునర్నిర్మాణం కోసం అవసరమైన చర్యలను పార్లమెంట్ ద్వారా చేపట్టడం. కాని ప్రతిపక్షాల లక్ష్యం పార్లమెంట్‌ను స్తంభింపచేసి మోదీ నిర్మాణాత్మక చర్యల్ని అడ్డుకోవడం.కాని అర్జునుడి గురి లక్ష్యం వైపే ఉన్నట్లుగా మోదీ ప్రభుత్వం తాము అనుకున్నవి సాధించేవరకూ, ప్రజలకు అభివృద్ధి ఫలితాలు అందేలా చేసేంతవరకూ విశ్రమించే ప్రసక్తి లేదు. 


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2021-07-20T08:36:39+05:30 IST