ప్రశంసలు నాకేల?

ABN , First Publish Date - 2021-01-25T09:39:11+05:30 IST

ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్న సామెతకు అసలు సిసలు ఉదాహరణగా నిలుస్తాడు రాహుల్‌ ద్రవిడ్‌. తానాడిన రోజుల్లో అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాను అనేకసార్లు క్లిష్ట పరిస్థితులనుంచి గట్టెక్కించి...

ప్రశంసలు నాకేల?

  • అదంతా కుర్రాళ్ల ప్రతిభే

బెంగళూరు: ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్న సామెతకు అసలు సిసలు ఉదాహరణగా నిలుస్తాడు రాహుల్‌ ద్రవిడ్‌. తానాడిన రోజుల్లో అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాను అనేకసార్లు క్లిష్ట పరిస్థితులనుంచి గట్టెక్కించి ‘మిస్టర్‌ వాల్‌’గామన్ననలు అందుకున్నాడు. అయితే జట్టు సభ్యుడిగా అది తన కర్తవ్యంగా భావించాడేతప్ప తన ఇన్నింగ్స్‌ను ద్రవిడ్‌ ఎప్పుడూ ప్రత్యేకంగా భావించలేదు. అలాగే అండర్‌-19, భారత్‌ ‘ఎ’ జట్ల కోచ్‌గా యువ క్రికెటర్లను మెరికల్లా తీర్చిదిద్దడం ద్వారా తన బాధ్యతలను అంతే సమర్థంగా నిర్వర్తించాడు.

ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీ్‌సను భారత్‌ 2-1తో గెలుచుకున్నదంటే దానికి పరోక్ష కారణం ద్రవిడనే చెప్పాలి. ఎందుకంటే..యువ ఆటగాళ్లు రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, సిరాజ్‌, సుందర్‌, సైనీ, శార్దూల్‌..ద్రవిడ్‌ కోచింగ్‌లోనే రాటుదేలారు. కంగారూలతో టెస్ట్‌ల్లో ఈ క్రికెటర్లు ఏస్థాయిలో చెలరేగారో తెలిసిందే. దాంతో ఈ ఆటగాళ్ల ప్రతిభకు మెరుగులద్దిన ‘వాల్‌’పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆసీ్‌సపై చారిత్రక టెస్ట్‌ సిరీ్‌సను భారత్‌ చేజిక్కించుకుందంటే ఆ క్రెడిటంతా రాహుల్‌దేనని మాజీ క్రికెటర్లు వసీం జాఫర్‌, ఇంజమాముల్‌ హక్‌ తదితరులు అన్నారు. వీటిపై ద్రవిడ్‌ స్పందిస్తూ ‘అవును..ప్రశంసలకు ఆ క్రికెటర్లంతా అర్హులే. కానీ నన్ను మాత్రం అనవసరంగా పొగుడుతున్నారు’ అని అనడం అతడి గొప్ప వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. గిల్‌, సిరాజ్‌ అద్భుత నైపుణ్యాలకు ద్రవిడే కారణమని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ స్పష్టంజేశాడు. ‘అండర్‌-19 జట్టుతో ప్రారంభమైన ఆ ఇద్దరి పయనం ఇండియా ‘ఎ’కు, అక్కడ నుంచి జాతీయ జట్టు వరకు సాగింది. ద్రవిడ్‌ మార్గదర్శనంలోనే వారు పటిష్ట పునాది వేసుకున్నారు. తానాడిన రోజుల్లో ద్రవిడ్‌ ‘మిస్టర్‌ వాల్‌’గా ఖ్యాతినార్జించాడంటే అందుకు కారణం అతడి దుర్భేద్యమైన డిఫెన్సే’ అని హక్‌ కొనియాడాడు. ‘ఏ పరిస్థితుల్లోనైనా ఆడగల సమర్థత ద్రవిడ్‌ది. మానసికంగా దృఢంగా ఉంటే పరిస్థితులకు తగ్గట్టుగా తమ ఆటతీరును మార్చుకోగలుగుతారు. యువ క్రికెటర్లు మానసికంగా ఉన్నత స్థితిలో ఉండేలా అతడు తీర్చిదిద్దాడు’ అని తన యూట్యూబ్‌ చానెల్‌లో ద్రవిడ్‌కు ఇంజమామ్‌ కితాబిచ్చాడు.


Updated Date - 2021-01-25T09:39:11+05:30 IST