టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. ధ్రువీకరించిన జే షా

ABN , First Publish Date - 2021-06-16T01:12:29+05:30 IST

శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత జట్టుకు టీమిండియా మాజీ స్కిప్పర్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్ ఇవ్వనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ

టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. ధ్రువీకరించిన జే షా

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత జట్టుకు టీమిండియా మాజీ స్కిప్పర్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్ ఇవ్వనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జే షా ధ్రువీకరించారు. శిఖర్ ధవన్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. కొలంబోలని ఆర్ ప్రేమదాస ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ‘‘శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు’’ అని జే షా పేర్కొన్నారు. 


సోమవారం రోజు జట్టు సభ్యులు ఒక చోట చేరుతారని, ఆ తర్వాత ఏడు రోజులపాటు క్వారంటైన్‌కు వెళ్తారని జే షా తెలిపారు. ఆ తర్వాత మరో వారం రోజులపాటు ఇండోర్ ట్రైనింగ్‌తో సాఫ్ట్ క్వారంటైన్‌లో ఉంటారని వివరించారు. టీమిండియా కోచ్‌లైన రవిశాస్త్రి, భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్ ఇంగ్లండ్‌లో టెస్టు జట్టుతో ఉండడంతో రాహుల్ కోచ్‌గా వ్యవహరిస్తాడని ఇటీవలే వార్తలు వచ్చాయి. కాగా, 2014 ఇంగ్లండ్ టూర్‌లో ద్రవిడ్ భారత జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ రెండోసారి కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు. 


ఈ నెల 28న భారత జట్టు కొలంబోకు పయనమవుతుంది. అక్కడ మూడు రోజులపాటు జట్టు సభ్యులు క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత వారిని ట్రైనింగ్‌కు అనుమతిస్తారు. జులై 13 నుంచి కొలంబోలో సిరీస్ ప్రారంభమవుతుంది.  వైట్ బాల్ జట్టులోకి మొత్తానికి పృథ్వీషాకు పిలుపు వచ్చింది. ఓపెనింగ్ బ్యాట్స్‌‌మన్ డేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు కూడా జట్టులో స్థానం లభించింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కె. గౌతమ్‌లను స్పిన్నర్లుగా తీసుకోగా, ఐపీఎల్‌లో ఆకట్టుకున్న యంగ్ స్పీడ్‌స్టర్ చేతన్ సకారియాకు బీసీసీఐ నుంచి పిలుపు అందింది.  జులై 13, 16, 18లలో మూడు వన్డేలు జరగనుండగా, జులై 21, 23, 25న టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. 


Updated Date - 2021-06-16T01:12:29+05:30 IST