అజయ్ మిశ్రా ఓ క్రిమినల్ : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-12-16T19:09:34+05:30 IST

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై కాంగ్రెస్ నేత రాహుల్

అజయ్ మిశ్రా ఓ క్రిమినల్ : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన ఓ క్రిమినల్ అని, ఆయన రాజీనామా చేయాలని లేదా ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని లోక్‌సభలో గురువారం డిమాండ్ చేశారు. అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అక్టోబరు 3న ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో జరిగిన హింసాకాండలో నిందితుడనే విషయం తెలిసిందే. 


రాహుల్ గాంధీ గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ, ‘‘ఈ మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాలి, ఆయన ఓ క్రిమినల్’’ అని అన్నారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండలో మిశ్రా ప్రమేయం ఉందన్నారు. రాహుల్ గాంధీ తన డిమాండ్‌ను కొనసాగిస్తుండగా, బీజేపీ ఎంపీలు లేచి నిల్చుని, నినాదాలు చేశారు. దీంతో సభను సభాపతి వాయిదా వేశారు. ఆయన బుధవారం కూడా ఇదే అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు. అజయ్ మిశ్రాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. లఖింపూర్ ఖేరీ దుర్ఘటనపై సభలో చర్చ జరగాలని, ప్రభుత్వం సాకులు చెప్తోందని అన్నారు.


అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు. వీరు (ప్రస్తుతం రద్దయిన) సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా ఓ కారు వారిపై నుంచి దూసుకెళ్ళింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రా సహా 13 మంది నిందితులు. వీరందరూ ఉద్దేశపూర్వకంగానే హింసకు పాల్పడ్డారని ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరోపించింది. వీరిపై నమోదైన ఆరోపణలను సవరించి, వీరు హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలను నమోదు చేయాలని కోర్టును కోరింది. 


Updated Date - 2021-12-16T19:09:34+05:30 IST