
లండన్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్‌లో జరిగిన Ideas for India సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్‌లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇతరులు చెప్పే మాటలను వినే దృక్పథాన్ని మోదీ అలవరచుకోవాలని హితవు పలికారు. భారత దేశాన్ని బీజేపీ, ఆరెస్సెస్ ఓ బంగారు బాతుగా భావిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
శుక్రవారం జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ, మాట్లాడే అవకాశం లేని దేశంగా భారత దేశం తయారుకాబోదని చెప్పారు. మోదీ (Narendra Modi) వైఖరి మారాలని చెప్పారు. ‘‘నేను వింటాను’’ అనే ధోరణిని ఆయన అలవరచుకోవాలని, అక్కడి నుంచే అన్నీ వస్తాయని అన్నారు. కానీ మన ప్రధాన మంత్రి ఎవరి మాట వినరన్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వని దేశం ఉండదన్నారు. స్వేచ్ఛగా మాట్లాడలేని పీఎంఓ (ప్రధాన మంత్రి కార్యాలయం -PMO) ఉండదన్నారు.
బీజేపీ (BJP), ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-RSS)లపై విరుచుకుపడ్డారు. ప్రజల మధ్య చర్చలు జరిగి, అభిప్రాయాలు పంచుకుని, తద్వారా నిర్ణయాలు తీసుకునే దేశం భారత దేశమని మనం విశ్వసిస్తామన్నారు. కానీ బీజేపీ, ఆరెస్సెస్ మాత్రం భారత దేశమంటే ఓ భౌగోళిక ప్రాంతంగా, ఓ బంగారు బాతుగా భావిస్తున్నాయని, దాని ఫలాలు కర్మ ప్రకారం కేవలం కొద్ది మందికి మాత్రమే అందాలని కోరుకుంటున్నాయని అన్నారు. దళితుడికైనా, బ్రాహ్మణుడికైనా అందరికీ సమానంగా అందాలని తాము విశ్వసిస్తామని తెలిపారు.
బహుళ వర్గాల పరస్పర సామరస్య పరిస్థితికి భారత దేశం మళ్ళీ రావాలా? అని అడిగినపుడు రాహుల్ మాట్లాడుతూ, ‘‘మీరు ఉన్న పరిస్థితుల్లో ఆచరణయోగ్యంగా, వాస్తవాలకు అనుగుణంగా ప్రవర్తించాలి. పరిస్థితిని చూడండి. మీ దేశం, దాని అవసరాలు, సౌభాగ్యం, సంభాషణలను పరిగణనలోకి తీసుకోవాలి; ఆ మౌలికాంశాల మార్గదర్శకత్వంలో పని చేయాలి’’ అని చెప్పారు.
భారతీయ ప్రజాస్వామ్యం ఈ భూ మండలానికి ప్రధాన తెడ్డు వంటిదని చెప్పారు. భారత దేశంలో ప్రజాస్వామ్యం (Decmocracy) ప్రపంచ ప్రజా శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. ఇది ఈ భూమండలానికి ప్రధాన తెడ్డు (Central Anchor) వంటిదన్నారు. ప్రమాణాలకు తగినట్లుగా ప్రజాస్వామ్యాన్ని నిర్వహించినది మనం మాత్రమేనని చెప్పారు. దానికి పగుళ్ళు వస్తే, ఈ భూ మండలానికి సమస్య తలెత్తుతుందన్నారు. ఆ విషయాన్ని అమెరికా గ్రహిస్తోందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, ‘‘నేడు జరుగుతున్నది ఏమిటంటే, అభిప్రాయాలను పంచుకోవడానికి, సంభాషించుకోవడానికి అవకాశం కల్పిస్తున్న వ్యవస్థలపై పద్ధతి ప్రకారం దాడి జరుగుతోంది’’ అని ఆరోపించారు. భారత రాజ్యాంగం (Indian Constitution)పై దాడి జరుగుతోందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వైఖరి మారాలని, తాను వినాలనే ధోరణిని అలవాటు చేసుకోవాలని చెప్పారు. అక్కడి నుంచే అన్నీ వస్తాయన్నారు. కానీ మన ప్రధాన మంత్రి వినబోరన్నారు.
ప్రజలను విభజించి, కొందరిని ఓ వైపునకు ఆకర్షించడం, మీడియాపై పూర్తి ఆధిపత్యం చలాయించడం ద్వారా RSS ఓ వ్యవస్థను నిర్మించిందని, అది సామాన్య ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిందని చెప్పారు. బీజేపీని ఎదుర్కొనడానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మరింత దూకుడుగా ప్రజల వద్దకు వెళ్ళాలన్నారు. ప్రజల్లో దాదాపు 60 నుంచి 70 శాతం మంది బీజేపీకి ఓటు వేయరన్నారు. వారి వద్దకు ప్రతిపక్షాలు కలిసికట్టుగా వెళ్ళాలన్నారు.
ఇవి కూడా చదవండి