Congress Vs BJP : ప్రజాస్వామ్యం కళ్ళెదుట చచ్చిపోతోంది : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-08-05T17:29:16+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi)

Congress Vs BJP : ప్రజాస్వామ్యం కళ్ళెదుట చచ్చిపోతోంది : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) శుక్రవారం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కళ్ళెదుట ప్రజాస్వామ్యం చచ్చిపోతుండటాన్ని భారత దేశం చూస్తోందన్నారు. కేవలం నలుగురు వ్యక్తులు నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, శత్రుత్వం పెరిగిపోతున్నాయన్నారు. 


ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుండటంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నివాసం వద్ద ఘెరావ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ నిరసన కార్యక్రమాల్లో  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. 


ధరల పెరుగుదల, నిరుద్యోగం సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తాము భావించామని రాహుల్ గాంధీ చెప్పారు. సమాజాన్ని ఏ విధంగా ముక్కలు చేస్తున్నారో చర్చించాలనుకున్నామన్నారు. పార్లమెంటులోనూ, వెలుపల ఈ అంశాలను లేవనెత్తాలనుకున్నామని, పార్లమెంటులో వీటిపై చర్చించేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. తమను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది నేటి భారత దేశ పరిస్థితి అని చెప్పారు. 


ప్రజా సమస్యలను లేవనెత్తకుండా నిరోధించడమే ప్రభుత్వ ఏకైక ఎజెండా అని ఆరోపించారు. కేవలం నలుగురు లేదా ఐదుగురి ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యాపార దిగ్గజాల ప్రయోజనాలను కాపాడటం కోసం ఇద్దరు వ్యక్తులు నియంతృత్వాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ, మీడియా వంటి ముఖ్యమైన వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం  తన సొంత మనుషులతో నింపుతోందన్నారు. దేశంలోని వ్యవస్థలు స్వతంత్రంగా లేవన్నారు. అన్ని వ్యవస్థలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నియంత్రణలో ఉన్నాయన్నారు. ప్రతి వ్యవస్థలోనూ కనీసం ఒక ఆరెస్సెస్ వ్యక్తి ఉన్నారన్నారు. 


Updated Date - 2022-08-05T17:29:16+05:30 IST