
న్యూఢిల్లీ : ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. ప్రజలు, కార్మికులు లేదా కోవిడ్-19 రోగుల పట్ల మోదీకి శ్రద్ధ లేదన్నారు. కోవిడ్ రోగులకు ఉచిత చికిత్స అందలేదని, గడచిన రెండేళ్ళలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని చెప్తున్న వార్తా కథనాలను ప్రస్తావించారు.
రాహుల్ గాంధీ గురువారం ఇచ్చిన ట్వీట్లో, ‘‘కోవిడ్ బాధితులకు ఉచితంగా చికిత్స చేశారా? లేదు. పేదలకు, కార్మికులకు కనీస ఆదాయం ఉందా? లేదు. చిన్న తరహా పరిశ్రమలు మునిగిపోకుండా కాపాడారా? లేదు. పీఎం పట్టించుకోరు!’’ అని పేర్కొన్నారు. గడచిన రెండేళ్ళలో ఆర్థిక ఒడుదొడుకుల వల్ల ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని, ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద కోవిడ్ రోగులకు ఉచిత చికిత్స అందలేదని చెప్తున్న వార్తా కథనాలను జత చేశారు.
రాహుల్ ట్వీట్ చేసిన వార్తా కథనాల్లో తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారత దేశంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక ఒడుదొడుకుల వల్ల ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ఎంతో గొప్పగా ప్రచారమవుతున్న ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ పేదల ఆసుపత్రి బిల్లుల చెల్లింపుల్లో విఫలమైంది. కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరినవారిలో కేవలం సుమారు 12 శాతం మందికి మాత్రమే ఈ పథకం క్రింద ఉచిత వైద్యం అందింది.
ఇవి కూడా చదవండి