TNCC: రాహుల్‌కు మద్దతుగా టీఎన్‌సీసీ తీర్మానం

ABN , First Publish Date - 2022-09-20T14:16:34+05:30 IST

ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi)ని ఎంపిక చేయాలంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ఏకగ్రీవంగా

TNCC: రాహుల్‌కు మద్దతుగా టీఎన్‌సీసీ తీర్మానం

                              - సోనియాకే తమిళ నేత ఎంపిక అధికారం


చెన్నై, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi)ని ఎంపిక చేయాలంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వేప్పేరిలోని వైఎంసీఏ హాలులో సోమవారం ఉదయం జరిగిన టీఎన్‌సీసీ(TNCC) సర్వసభ్యమండలి సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించారు. ఏఐసీసీ అధ్యక్షపదవికి అక్టోబర్‌ 17న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీలన్నీ సర్వసభ్యమండలి సమావేశాలను ఈ నెల 20 లోగా నిర్వహించి ఏఐసీసీ సభ్యులను, రాష్ట్ర కమిటీ అధ్యక్షులను నియమించే అధికారాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగించేలా తీర్మానాలు చేసి పంపాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ను ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించాలంటూ చత్తీస్‏ఘడ్‌, అసోం, ఒడిశా, పుదుచ్చేరి(Chhattisgarh, Assam, Odisha, Puducherry) రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీలు పార్టీ అధిష్టానానికి ప్రతిపాదనలు పంపాయి. ఈ నేపథ్యంలో టీఎన్‌సీసీ సర్వసభ్యమండలి సమావేశం ఆ కమిటీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ సౌరవ్‌ గొగాయ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దినేష్‌ గుండూరావు, సిరివళ్ల ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షులు కేవీ తంగబాలు, ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌, ఎస్‌.తిరునావుక్కరసర్‌తో పాటు పార్టీకి చెందిన 76 జిల్లా శాఖల నాయకులు, సర్వసభ్యమండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి ప్రవేశపెట్టిన తీర్మానానికి 600 మందికి పైగా సభ్యులు మద్దతు ప్రకటించారు. దీంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సౌరవ్‌ గొగాయ్‌ ప్రకటించారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిని ఎంపిక చేసే అధికారాన్ని ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీకి అప్పగిస్తూ మరో తీర్మానం చేసి, దానిని కూడా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కేఎస్‌ అళగిరి ప్రకటించారు. ఈ సమావేశానికి టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షులు కుమరి అనంతన్‌, కృష్ణసామి, ఎంపీలు జయకుమార్‌, విజయ్‌వసంత్‌, పార్టీ ప్రచార కార్యదర్శి గోపన్నా, మాజీ ఎంపీలు పీటర్‌ అల్ఫోన్స్‌, సుదర్శన్‌ నాచ్చియప్పన్‌, నాసే రామచంద్రన్‌, హసీనా సయ్యద్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు. గంటకు పైగా జరిగిన ఈ సమావేశం పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై కూడా నాయకులు సమగ్రంగా చర్చించారు.

Updated Date - 2022-09-20T14:16:34+05:30 IST