Rahul Gandhi: నేడే భారత్ జోడో యాత్ర

ABN , First Publish Date - 2022-09-07T13:08:17+05:30 IST

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ను సమాయత్తం చేసేలా పార్టీకి పూర్వవైభవం కల్పించే దిశగా అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు,

Rahul Gandhi: నేడే భారత్ జోడో యాత్ర

- కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నేటినుంచి రాహుల్‌ పాదయాత్ర

- 2500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు


చెన్నై, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ను సమాయత్తం చేసేలా పార్టీకి పూర్వవైభవం కల్పించే దిశగా అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ‘భారత్‌ జోడో యాత్ర’(Bharat Jodo Yatra) పేరుతో బుధవారం సాయంత్రం పాదయాత్రను ప్రారంభించనున్నారు. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ముఖ్య అతిథిగా హాజరై రాహుల్‌కు జాతీయ పతాకాన్ని అందించి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 12 రాష్ట్రాల మీదుగా 3500 కి.మీ.ల పొడవునా ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో పాల్గొనే నిమిత్తం రాహుల్‌గాంధీ మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి విమానంలో నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద పార్టీ ప్రముఖులు వందలాదిమంది కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక రాహుల్‌ పాదయాత్రకు ఏడీజీపీ తామరైకన్నన్‌ స్వీయపర్యవేక్షణలో 2500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత కల్పిస్తున్నారు. రాహుల్‌ పాదయాత్ర ఏర్పాట్లను టీఎన్‌సీసీ నేత కేఎస్‌ అళగిరి తదితర నాయకులు గత మూడు రోజులుగా కన్నియాకుమారిలోనే బసచేసి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఉదయం రాహుల్‌, కాంగ్రెస్ పార్టీ(Congress party) ప్రముఖులు శ్రీపెరుంబుదూరులోని రాజీవ్‌ స్మారక స్థలానికి చేరుకుని నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి ఆయన చెన్నై చేరుకుంటారు. ఆ సందర్భంగా పార్టీ రాష్ట్రశాఖ సీనియర్‌ నాయకులతో సమావేశమవుతారు. తర్వాత బుధవారం ఉదయం 11.45 గంటలకు ఆయన విమానంలో తిరువనంతపురం చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌ కన్నియాకుమారి చేరుకుని వివేకానంద స్మారక మండపం, తిరువళ్లువర్‌(Tiruvalluvar) విగ్రహ ప్రాంతం, కామరాజర్‌ స్మారక మండపం, గాంధీ స్మారక మండపాలను ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందించే జాతీయ పతాకం పట్టుకుని రాహుల్‌ పాదయాత్రకు శ్రీకారం చుడతారు. కన్నియాకుమారి సముద్రతీరంలోని రహదారిలో పాదయాత్రగా వెళ్లి బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. ఆ సభలో రాహుల్‌ పాదయాత్ర లక్ష్యాలు పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ పథకాలు తెలిపేలా ప్రసంగించనున్నారు. ఈ సభలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, చత్తీ్‌సఘడ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌పాగల్‌, పార్టీ జాతీయ నాయకులు, ఎంపీలు, శాసనసభ్యులు పాల్గొంటారు. బహిరంగ సభ పూర్తయిన తరువాత రాహుల్‌ అగస్తీశ్వరం వివేకానంద కళాశాలకు చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. మరుసటి రోజు పాదయాత్ర ప్రారంభించి నాలుగు రోజులపాటు కన్నియాకుమారి జిల్లాలోనే సుమారు 56 కి.మీ.ల వరకూ ఆయన పాదయాత్ర కొనసాగిస్తారు. తమిళనాట పాదయాత్ర ముగించుకుని ఆయన కేరళకు బయలుదేరివెళతారు. 


రాహుల్‌ వెంట 119 మంది...

రాహుల్‌ వెంట పాదయాత్రలో పార్టీ జాతీయ నాయకులు, పార్టీ ప్రముఖులు, సేవాదళ్‌ నాయకులు 119 మంది పాల్గొంటారు.  రాహుల్‌తోపాటు రాజస్థాన్‌కు చెందిన 58 యేళ్ల సీనియర్‌ నాయకుడు విజేంద్రసింగ్‌ కూడా పాదయాత్రలో పాల్గొనటం విశేషం. ఇక రాహుల్‌ పాదయాత్రలో పాల్గొనేవారికి భోజన, బస సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. దానికోసం 60 కారావ్యాన్లు కూడా సిద్ధం చేశారు. ఈ పాదయాత్ర 150 రోజులపాటు కొనసాగుతుంది.


ప్రత్యేక భద్రతా వాహనం...

రాహుల్‌ పాదయాత్ర(Rahul Padayatra)లో ప్రత్యేక భద్రతాదళం ఓ ప్రత్యేక వాహనంలో కశ్మీర్‌ వరకు వెళ్తారు. రాహుల్‌ ఆగే ప్రతిచోట ఈ బృందం రాహుల్‌ చుట్టూ రక్షణవలయంగా నిలిచి భద్రత కల్పించనున్నారు. ఇక పాదయాత్రలో పాల్గొనేవారు అస్వస్థతకు గురైతే చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యుల బృందం ఓ వ్యాన్‌లో అనుసరిస్తుంది. పాదయాత్రలో పాల్గొనేవారి నడక వేగాన్ని బట్టి రోజూ 22 నుంచి 25 కి.మీ.ల దూరం వరకూ రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. దారిలో పలుచోట్ల రాహుల్‌ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.



Updated Date - 2022-09-07T13:08:17+05:30 IST