మోదీ ప్రభుత్వంలో ఒక సిలిండర్ ధరకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సిలిండర్లు ఇచ్చింది : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-05-08T18:30:03+05:30 IST

వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వంలో ఒక సిలిండర్ ధరకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సిలిండర్లు ఇచ్చింది : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పేద, మధ్య తరగతి భారతీయ కుటుంబాల సంక్షేమం కోసం పరిపాలించే సత్తా కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. గృహ వినియోగ LPG సిలిండర్ ధర రూ.50 పెరిగిన నేపథ్యంలో ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. 


గృహ వినియోగ వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ ధర శనివారం రూ.50 పెరిగిన సంగతి తెలిసిందే. ఈ పెరుగుదలతో దాదాపు 28.9 కోట్ల కుటుంబాలు ఒక్కొక్క సిలిండర్‌ కోసం రూ.1,000కి పైగానే ఖర్చు చేయవలసి ఉంటుంది. సుమారు రెండు నెలల్లో రెండోసారి ఈ ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధనం ధరలు పెరుగుతున్నాయని చమురు సంస్థలు చెప్తున్నాయి. 


రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూపీఏ (UPA) ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలను, ప్రస్తుత బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వ హయాంలో ధరలతో పోల్చి చూపించారు. వంట గ్యాస్‌కు రాయితీ ఇవ్వడంలో ఈ ప్రభుత్వాల మధ్య తేడాను వివరించారు. 


14.2 కేజీల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర 2014 మే నెలలో రూ.410 ఉండేదన్నారు. దీని ధర ప్రస్తుతం రూ.999కి చేరిందన్నారు. అంటే సుమారు రూ.585.50 పెరిగిందన్నారు. కాంగ్రెస్ నేత‌‌ృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఒక్కొక్క సిలిండర్‌పై రూ.827 రాయితీ ఇచ్చిందని, ప్రస్తుత మోదీ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదని చెప్పారు. అప్పటి ధర ప్రకారం రెండు సిలిండర్లను కొనగలిగే సొమ్ముకు ఇప్పుడు కేవలం ఒక సిలిండర్ మాత్రమే వస్తోందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే భారతీయ పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసం పరిపాలిస్తుందన్నారు. ఇదే తమ ఆర్థిక విధానానికి మూలమని వివరించారు. 


కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా శనివారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను రెండున్నర రెట్లు పెంచారన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వంట గ్యాస్ అందనంత దూరానికి వెళ్లిపోయిందన్నారు. ఈ ధరలను 2014నాటి స్థాయికి తగ్గించాలని డిమాండ్ చేశారు. 




Read more