రాహుల్ గాంధీ మనసులో ఏముంది?

ABN , First Publish Date - 2022-08-23T22:59:16+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్న సమయంలో రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ మనసులో ఏముంది?

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్న సమయంలో రాహుల్ గాంధీ మనసులో ఏముందో ఎవరికీ అంతుబట్టడం లేదు. 2017 డిసెంబరు 16 నుంచి 2019 జూలై 3 వరకు కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేసిన ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పదవి నుంచి వైదొలగారు.  ఆయనను మళ్లీ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా చూడటం కోసం ఆ పార్టీ నేతలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన ఆసక్తి చూపడం లేదు. తాను మళ్ళీ ఆ పదవిని చేపట్టేది లేదని కరాఖండీగా చెప్తున్నారు. వచ్చే నెల 20నాటికి అధ్యక్ష ఎన్నికలు పూర్తి కావలసి ఉంది. దీని కోసం షెడ్యూలును రెండు, మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన గురించి పరిశీలించినపుడు ఆసక్తికరమైన విషయాలు గుర్తుకొస్తాయి. 


రాహుల్ గాంధీ వ్యవహార శైలి ఆయనను ఓ బలమైన రాజకీయ నేతగా నిలపలేకపోతోంది. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజా ఉదాహరణ ఏమిటంటే, తెలంగాణాలోని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. దీంతో ఆ స్థానానికి అనుకోకుండా ఉప ఎన్నిక అవసరమైంది. ఇది కాంగ్రెస్ సిటింగ్ స్థానం కావడంతో దానిని నిలబెట్టుకోవడానికి వ్యూహాలు రచించవలసి ఉంది. కానీ రాహుల్ గాంధీ ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా చొరవ తీసుకోవలసి వచ్చింది.  ఆమె కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ తెలంగాణా  రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్,  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి ఇతర ముఖ్య నేతలతో సమావేశమై, అన్ని పరిస్థితులను సమీక్షించారు. 


మునుగోడులో మొనగాడవడం తప్పనిసరి

తెలంగాణా శాసన సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా ప్రచారమవుతున్న ఈ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకం కానుంది. ఈ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు గట్టి సందేశాన్ని పంపించాలని బీజేపీ, టీఆర్ఎస్ రకరకాల వ్యూహాలతో దూసుకెళ్తుంటే, కాంగ్రెస్ ఇప్పటికీ వర్గ పోరు నుంచి బయటపడలేకపోతోంది. రాజగోపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డిని కట్టడి చేయలేకపోతోంది. 


ఈ నేపథ్యంలో రాహుల్ తీరును మరింత లోతుగా పరిశీలిస్తే...


భారత దేశ ప్రథమ రాజకీయ కుటుంబంలో 1970 జూన్ 19న జన్మించిన రాహుల్ గాంధీ తాను ఎంతో ప్రేమించిన, తనను అత్యంత ఆత్మీయంగా చూసుకున్న నాన్నమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీలను కోల్పోయారు. వారిద్దరి హత్యలు ఆయన జీవితంపై చెరగని ముద్ర వేశాయి. ఎల్లప్పుడూ భద్రత నడుమ గడపడం ఆయనకు సుతరామూ ఇష్టం ఉండేది కాదు. బాల్యంలో ఆయన అనేక పాఠశాలలు మారడానికి కూడా ఇదొక కారణం. రాజకీయాలంటే విపరీతమైన అనాసక్తి ఉండేది. 


కేంబ్రిడ్జ్ ట్రినిటీ కళాశాలలో 1995లో ఎంఫిల్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ లండన్‌లో ఓ సంవత్సరంపాటు మానిటర్ గ్రూప్ అనే మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగం చేశారు. 2002లో టెక్నాలజీ ఔట్‌సోర్సింగ్ సంస్థ బాకప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా చేశారు. 1991లో తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో తన తల్లి సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావడం ఆయనకు ఇష్టం లేదు. 


విదేశాల్లో స్వేచ్ఛా విహంగం

ఉన్నత చదువుల కోసం ఆయన విదేశాలకు వెళ్లినపుడు ఎంతో స్వేచ్ఛను అనుభవించారు. ఈ విషయాన్ని ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారత దేశంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండవలసి వచ్చేదని, విదేశాల్లో అటువంటి భద్రతకు దూరంగా ఉండటం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు. స్వేచ్ఛగా తన స్నేహితులతో కలిసి విహరించడం గొప్ప అనుభూతినిచ్చినట్లు తెలిపారు. 

 

గర్ల్‌ప్రెండ్‌తో కలిసి మీడియా కంటపడి..

2004లో ఆయన స్పానిష్ జాతీయురాలు వెరోనిక్ కార్టెల్లితో కలిసి మీడియాకు చిక్కారు. వీరిద్దరూ అండమాన్స్‌లో విహరిస్తూ మీడియా కంటపడటంతో ఆయన ప్రైవేటు జీవితం వెలుగులోకి వచ్చింది. అయితే పెళ్లి చేసుకోవాలని తాను అనుకోవడం లేదని 2013లో ఆయన ప్రకటించారు. 


1998 నుంచి రాజకీయాల్లోకి...

రాహుల్ ఎంత వద్దనుకున్నా రాజకీయాల్లోకి రావలసిన పరిస్థితులు 1998లో ప్రారంభమయ్యాయి. సీనియర్ కాంగ్రెస్ నేతలు పట్టుబట్టి మరీ సోనియా గాంధీని ఒప్పించి, కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను ఆమెకు అప్పగించారు. సోనియా గాంధీ 1999 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా రాహుల్ గాంధీ వెళ్ళేవారు. ఆ తర్వాత రాజకీయాల్లో కనిపించలేదు. తిరిగి మళ్ళీ 2002లోనే దర్శనమిచ్చారు. ఆయనను సేవాదళ్ సారథిగా నియమించాలని సోనియాపై ఒత్తిడి వచ్చినప్పటికీ, ఆయన అందుకు అంగీకరించలేదు.  చివరికి 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో సోనియా గాంధీకి రాజకీయ సహాయకుడి అవసరం ఏర్పడింది. ఆ పరిస్థితిలో రాహుల్ గాంధీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ప్రవేశించారు. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 


యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా...

2007లో 37 ఏళ్ళ వయసులో రాహుల్ గాంధీ ఇండియన్ యూత్ కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. దీనిని తాను కాంగ్రెస్ పార్టీ యువజన రాజకీయాల్లో క్షేత్ర స్థాయి సంస్కరణల కోసం వినియోగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 2008లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) కార్యకర్తలతో నేరుగా మాట్లాడి, 40 మందిని ఎంపిక చేశారు. వీరిని ఈ సంస్థ థింక్ ట్యాంక్‌గా అభివర్ణించారు. దీంతో కార్యకర్తల్లో ఆయన నాయకత్వంపై సదభిప్రాయం ఏర్పడింది. ఆయన ఈ పదవిని చేపట్టే సమయంలో 3 లక్షల మంది సభ్యులుగా ఉండేవారు, 2010నాటికి ఈ సంఖ్య 25 లక్షలకు చేరింది. 2017నాటికి IYC సభ్యుల సంఖ్య 1 కోటికి సమీపించింది. యువజన కాంగ్రెస్‌కు ఎన్నికలు నిర్వహించాలనేది ఆయన మదిలో నుంచి వచ్చిన సంస్కరణే. పారదర్శకతతో కూడిన ప్రజాస్వామిక ప్రాతినిధ్యాన్ని తీసుకురావడానికి ఆయన కృషి చేశారు. పార్టీ నిర్మాణంపైనే తాను దృష్టి సారిస్తానని చెప్తూ 2004, 2009 సంవత్సరాల్లో అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆయన చేరలేదు. 


ఆదర్శాలు చెప్తూ ఆకట్టుకున్న తొలి ప్రసంగం

కాంగ్రెస్‌ పార్టీలో అధికార మార్పిడి 2013 నుంచి ప్రారంభమైంది. రాహుల్ గాంధీ ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాకతో పార్టీ నూతనోత్సాహంతో దూసుకెళ్తుందని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్ష హోదాలో ఆయన మొదటిసారి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ వ్యవస్థ అని, అయితే దీనిలో ఎటువంటి నిబంధనలు, సూత్రాలు లేవని అన్నారు. పాత నిబంధనను కప్పిపుచ్చడానికి ప్రతి రెండు నిమిషాలకు ఓ కొత్త నిబంధనను తీసుకొస్తున్నామని అన్నారు. ఈ పార్టీ రూల్స్ ఏమిటో బహుశా పార్టీలో ఎవరికీ తెలియదన్నారు. 


నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం

అయితే ముఖ్యమైన సమయాల్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కాలం గడుపుతారనే విమర్శలు ఉన్నాయి. 2015లో భూ సంస్కరణల ఆర్డినెన్స్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికినపుడు ఆయన 53 రోజులపాటు సెలవు తీసుకున్నారు. ఢిల్లీలో ‘నిర్భయ’ సామూహిక అత్యాచారం కేసుపై ఆయన మౌనంగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఓసారి మాట్లాడుతూ, తాము రాహుల్ ఆకర్షణీయమైన ఆలోచనలను మాత్రమే చూస్తున్నామని, సైద్ధాంతిక నిర్దేశకత్వం కనిపించడం లేదని అన్నారు. విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థ, అంతర్గత సమస్యలు వంటివాటిపై ఆయన ఆలోచనలేమిటో తమకు ఏమాత్రం తెలియదన్నారు. 


సొంత ప్రభుత్వంపై ఆగ్రహం

దోషులుగా నిర్థరణ అయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభల సభ్యత్వానికి అనర్హులు కాకుండా కాపాడేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2013లో జారీ చేసిన ఆర్డినెన్స్‌ను పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ చింపేశారు. ఆయన ఈ పని చేసిన సమయంలో మన్మోహన్ సింగ్, అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వాషింగ్టన్‌లో సమావేశం కాబోతున్నారు. ఇది డాక్టర్ సింగ్ ప్రభుత్వాన్ని అవమానించడమేనని విమర్శలు వచ్చాయి. 


పార్టీ కష్టాల్లో ఉన్నపుడు రహస్య యాత్రలు

కాంగ్రెస్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేయవలసిన సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లిపోతూ ఉంటారు. ఆయన ఫుల్‌టైమ్ రాజకీయ నేతగా కన్నా ఫుల్‌టైమ్ ట్రావలర్‌గా కనిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయనను సమర్థించడానికి ఆ పార్టీ నేతలు తంటాలు పడుతూ ఉంటారు. ఆయన తరచూ ఇలా చేయడం వల్ల ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించలేకపోతున్నట్లు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022 జూలైలో కాంగ్రెస్‌ గోవా విభాగం సంక్షోభంలో ఉండగా ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. గోవా ప్రతిపక్ష నేత పదవి నుంచి మైకేల్ లోబోను గోవా కాంగ్రెస్ యూనిట్ తొలగించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సరైన నిర్ణయం తీసుకోవడానికి అందుబాటులో లేకుండా పోయారు. 2022లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా శాసన సభ ఎన్నికల ముందు కూడా ఆయన ఇటలీ వెళ్లిపోయారు. 2021 నవంబరులో ఆయన లండన్ వెళ్లి, ఓ నెల రోజులు గడిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవడానికి ముందు తిరిగి వచ్చారు. దీంతో బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పించింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో పంజాబ్‌ కాంగ్రెస్ సంక్షోభంలో పడినపుడు ఆయన కుటుంబ సభ్యులతోపాటు సిమ్లాలో విహరించారు. 2020 డిసెంబరులో కాంగ్రెస్ 136వ వ్యవస్థాపక దినోత్సవంనాడు ఇటలీ వెళ్లారు. ఆ పర్యటనపై ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా చెప్పడంతో వారిని మీడియా టార్గెట్ చేసింది. 2019లో హర్యానా, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ముందు విదేశీ పర్యటనకు (బ్యాంకాక్ అని చెప్తూ ఉంటారు) వెళ్ళారు. 


పత్రికా సమావేశాలకూ డుమ్మా

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను విమర్శించేందుకు దేశవ్యాప్తంగా 35 పత్రికా సమావేశాలను ఏర్పాటు చేయాలని 2019 నవంబరులో రాహుల్ గాంధీ ఆదేశించారు. కానీ వాటికి ఆయనే డుమ్మా కొట్టారు. 2019 మే నెలలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు సోనియా గాంధీ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరయ్యారు. ప్రధాన మంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించారు. కానీ ఆయన లండన్ వెళ్లిపోయారు. 2018 బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. 2015లో థాయ్‌లాండ్, కాంబోడియా, మయన్మార్, వియత్నాంలలో పర్యటించారు. విదేశాల్లో పర్యటించేటపుడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్  భద్రతను కూడా ఆయన వదులుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. 


యూత్ బ్రిగేడ్ 

రాహుల్ గాంధీ యూత్ బ్రిగేడ్‌లో ఆరుగురు అత్యంత ప్రముఖ యువ నేతలు జ్యోతిరాదిత్య సింథియా, జితిన్ ప్రసాద, సచిన్ పైలట్, మిలింద్ దేవరా, గౌరవ్ గొగోయ్, దీపేందర్ సింగ్ హుడా ఉండేవారు. వీరిలో జ్యోతిరాదిత్య, జితిన్ బీజేపీలో చేరిపోయారు. సచిన్ పైలట్ కొంత కాలం అసమ్మతి నేతగా ఎదురు తిరిగి, ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంలో ఉన్నారు. దక్షిణ ముంబై మాజీ ఎంపీ మిలింద్ దేవరా రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దును సమర్థించి కాంగ్రెస్‌కు తలనొప్పి తెచ్చారు. హూస్టన్‌లో ‘హౌడీ, మోడీ’ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రశంసించారు. 


సమూల ప్రక్షాళనకు డిమాండ్లు

ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు చెందిన 23 మంది నేతలు 2020 ఆగస్టులో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ లేఖ రాసినవారిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, సిటింగ్ ఎంపీలు శశి థరూర్, మనీశ్ తివారీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు ఉన్నారు. అయితే వీరి సూచనలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో జమ్మూ-కశ్మీరు, హిమాచల్ ప్రదేశ్‌లలో పార్టీ పదవులకు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ రాజీనామాలు సమర్పించారు. ఈ లేఖ రాసినవారిలో ఒకరైన కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేసి, సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 


ఆయన బీజేపీకి బీమా పాలసీ

రాహుల్ గాంధీ ఆదర్శవాద సంస్కరణాభిలాష కలిగిన రాజకీయాలు అధికారంలో ఉన్న బీజేపీకి అత్యుత్తమమైన బీమా పాలసీగా ఉపయోగపడుతున్నాయనే విమర్శ ఉంది. దీనికి ఉదాహరణగా ఆయన 2022 ఫిబ్రవరి 2న లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై చేసిన ప్రసంగాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తారు. ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో పార్టీలోనూ, బయట ఆయన సమర్థుడైన రాజకీయ నేతగా గుర్తింపు పొందలేకపోతున్నారు. చైనా, పాకిస్థాన్, పెగాసస్ వంటి అంశాలపై ఆయన వ్యాఖ్యలు కూడా విమర్శలకు గురవుతుంటాయి. 


2018లో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా సభలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కౌగిలించుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. మోదీ తన వాదనను వినిపించేందుకు మనలో కొందరి మనసుల్లో విద్వేషం, భయం, ఆగ్రహం నింపుతున్నారని, దేశాన్ని నిర్మించాలంటే భారతీయుల మనసుల్లో ప్రేమ, కారుణ్యాలను నింపడమే మార్గమని తాను రుజువు చేయాలనుకున్నానని ఆయన పేర్కొన్నారు.


వైరాగ్యమా? 

రాహుల్ గాంధీ ముఖ్యమైన సమయాల్లో తప్పించుకు తిరుగుతున్నప్పటికీ, పార్టీని పూర్తిగా వీడటం లేదు. రోజూ అనేక సమస్యలపై ట్వీట్ల యుద్ధం చేస్తూ, పార్టీకి నాయకత్వం వహిస్తున్నట్లే కనిపిస్తారు. అయితే బాధ్యతయుతంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లోక్‌సభ సభ్యునిగా అమేథీ నుంచి ఓడిపోయే ప్రమాదాన్ని ఊహించి, కేరళలోని వయనాద్ నుంచి కూడా పోటీ చేశారు. వీటన్నిటినీ బట్టి చూస్తే ఆయన మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. ఆయన వ్యవహార శైలి ఎవరికీ అంతుబట్టడం లేదు. మొత్తం మీద ఆయన రాజకీయ చాణక్యం, చతురత, సమర్థత బయటి ప్రపంచానికి వెల్లడికావడం లేదు.


                                                       - యెనుములపల్లి వేంకట రమణమూర్తి


Updated Date - 2022-08-23T22:59:16+05:30 IST