రాహుల్‌కే పార్టీ పగ్గాలు... ఇండియన్ యూత్ కాంగ్రెస్ తీర్మానం

ABN , First Publish Date - 2021-09-07T01:48:09+05:30 IST

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఒక ..

రాహుల్‌కే పార్టీ పగ్గాలు... ఇండియన్ యూత్ కాంగ్రెస్ తీర్మానం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని సోమవారంనాడు ఆమోదించింది. ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఈ తీర్మానం ఆమోదం పొందింది. 2017లో సోనియాగాంధీ నుంచి పార్టీ అధ్యక్ష పగ్గాలను రాహుల్ తీసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల వరకూ పార్టీకి ఆయన సారథ్యం వహించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లతో దారుణమైన ఫలితాలను చవిచూసింది. పార్లమెంటులో పది శాతం కూడా సీట్లు పొందలేకపోవడంతో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేసారు. దీంతో తిరిగి అధ్యక్ష పగ్గాలు సోనియాగాంధీ చేపట్టారు.


కాగా, పార్టీ అధ్యక్షుడి విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ వచ్చాయి. మెజారిటీ నేతలు రాహుల్ గాంధీకే అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని అంటుండగా, సీనియర్ లీడర్ల గ్రూప్ ఒకటి గాంధీయేతర అధ్యక్షుడిని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ కే అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలంటూ తాజాగా నేషనల్ యూత్ కాంగ్రెస్ తీర్మానం ఆమోదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే వారం జమ్మూకశ్మీర్‌లో రాహుల్ రెండు రోజుల పాటు పర్యటించనున్న తరుణంలో ఈ తీర్మానం జరగడం విశేషం. గత నెలలో కశ్మీర్‌లో రాహుల్ పర్యటించగా, ఈసారి జమ్మూలో పర్యటించనున్నారు. వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించడంతో పాటు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు.

Updated Date - 2021-09-07T01:48:09+05:30 IST