Ideas for India : మీ ధోరణి విధ్వంసకరం : రాహుల్‌తో ఓ భారతీయ అధికారి

ABN , First Publish Date - 2022-05-25T16:21:19+05:30 IST

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఐడియాస్ ఫర్ ఇండియా

Ideas for India : మీ ధోరణి విధ్వంసకరం : రాహుల్‌తో ఓ భారతీయ అధికారి

లండన్ : కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఐడియాస్ ఫర్ ఇండియా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ భారతీయ అధికారి నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘‘భారత దేశం పట్ల మీ భావం కేవలం లోపభూయిష్టం, సరైనది కాకపోవడం మాత్రమే కాకుండా, విధ్వంసకరమని, ఎందుకంటే, అది వేలాది సంవత్సరాల చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఓ రాజకీయ నేతగా మీకు అనిపించడం లేదా?’’ అని ఆ అధికారి అడిగారు. 


ఈ ప్రశ్నను సంధించిన అధికారి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. ఆయన పేరు సిద్ధార్థ వర్మ (Siddhartha Verma). ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (Cambridge University)లో పబ్లిక్ పోలీస్‌లో కామన్వెల్త్ స్కాలర్. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కార్పస్ క్రిస్టి కాలేజీలో సోమవారం 'India at 75' పేరుతో జరిగిన కార్యక్రమంలో రాహుల్, వర్మ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. హిందూ జాతీయవాదం, కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం పాత్ర వంటి అనేక అంశాలపై రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ ఓ వీడియోను ట్వీట్ చేశారు. తాను రాహుల్ గాంధీని ఏ విధంగా ప్రశ్నించినదీ వివరించారు. 


‘‘రాజ్యాంగం ప్రకారం ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్ అని చెప్తూ రాజ్యాంగంలోని అధికరణ 1ని మీరు పేర్కొన్నారు. మీరు ఓ పేజీ వెనుకకు తిప్పితే, ప్రవేశికను ఓసారి చూస్తే, అందులో ఇండియా అంటే ఓ దేశం (Natioin) అని ఉంటుంది. ప్రపంచంలో మనుగడలో ఉన్న అత్యంత ప్రాచీన నాగరికతల్లో భారత్ ఒకటి, ఈ పదానికి మూలం వేదాలలో ఉంది, మనది అత్యంత ప్రాచీన నాగరికత. చాణక్యుడు తక్షశిలలో విద్యార్థులతో మాట్లాడినపుడు కూడా వారు వేర్వేరు జనపదాలకు చెందినవారు అయి ఉండవచ్చునని, అయితే అంతిమంగా వారు ఓ దేశానికి అంటే భారత్‌కు చెందినవారని వారికి స్పష్టంగా వివరించారు’’ అని రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి వర్మ చెప్పినట్లు ఈ వీడియోలో కనిపించింది. 


దీంతో రాహుల్ స్పందిస్తూ, ‘‘ఆయన (Chanakya) దేశం అనే పదాన్ని ఉపయోగించారా?’’ అని అడిగారు. 


వర్మ : ఆయన రాష్ట్ర అనే పదాన్ని వాడారు.


రాహుల్ : రాష్ట్ర అంటే రాజ్యం (Kingdom) 


వర్మ : కాదు, రాష్ట్ర అనేది దేశ సంస్కృతి.


రాహుల్ : దేశం అనేది పాశ్చాత్య భావన (Western Concept).


వర్మ : నేను దేశం గురించి మాట్లాడినపుడు, నేను కేవలం రాజకీయంగా మాట్లాడటం లేదు. ఎందుకంటే మనకు ఈ ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దేశాలకు బలమైన సాంఘిక, సాంస్కృతిక, భావోద్వేగపరమైన బంధం లేనట్లయితే, రాజ్యాంగం ఓ దేశాన్ని తయారు చేయజాలదు. భారత దేశం గురించి మీ భావం లోపభూయిష్టమైనదని, సరైనది కాదని, అంతేకాకుండా విధ్వంసకరమైనదని, ఎందుకంటే, అది వేలాది సంవత్సరాల చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఓ రాజకీయ నాయకుడిగా మీకు అనిపించడం లేదా?


రాహుల్ : లేదు, నేను అలా అనుకోవడం లేదు. 


ఈ వీడియో వైరల్ అవడంతో వర్మ ధన్యవాదాలు తెలిపారు. భారతీయుల్లో అత్యధికులకు భారత్ అంటే కేవలం ఈ 75 ఏళ్ళ రాజకీయ అస్థిత్వం మాత్రమే కాదని ఈ మద్దతు వెల్లడిస్తోందన్నారు. భారత్ వర్ష్ (Bharatvarsh) వేలాది సంవత్సరాల నుంచి ఉందన్నారు. అది శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. 


వర్మ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, భారత దేశంలోని రాష్ట్రాలు అమెరికా (United States)లోని రాష్ట్రాల వంటివి కాదన్నారు. భారత దేశం చాలా ప్రాచీనమైన నాగరికతగల దేశమని, దీనిలోని రాష్ట్రాలను కలిపి ఉంచేది కేవలం లీగల్ డాక్యుమెంట్ కాదని, అంతకన్నా ఎక్కువ అని వివరించారు. 




Updated Date - 2022-05-25T16:21:19+05:30 IST