వ్యక్తిగత పర్యటన నుంచి రాహుల్ ఎప్పుడు తిరిగి వస్తారంటే....

ABN , First Publish Date - 2022-01-06T18:26:24+05:30 IST

వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్ళిన కాంగ్రెస్

వ్యక్తిగత పర్యటన నుంచి రాహుల్ ఎప్పుడు తిరిగి వస్తారంటే....

న్యూఢిల్లీ : వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్ళిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జనవరి రెండో వారంలో తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ వార్తా సంస్థ గురువారం తెలిపింది. ఆయన ఎక్కడికి వెళ్ళారో ఆ పార్టీ స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, ఆయన డిసెంబరులో ఇటలీకి వెళ్ళినట్లు కొందరు చెప్తున్నారు. 


గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగుతాయి. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించవలసి ఉంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైనవి. బీజేపీని కట్టడి చేయడంతోపాటు, కేంద్రంలో అధికారాన్ని చేపట్టడానికి ఈ రాష్ట్రాల్లో గెలుపు దోహదపడుతుంది. 


పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇటీవల ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ నేతలు అంతర్గత కుమ్ములాటల్లో నిమగ్నమయ్యారని చెప్తున్నారు. ఇటువంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరమని అంటున్నారు. 


ఇదిలావుండగా, కాంగ్రెస్ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ వచ్చే వారం విదేశాల నుంచి స్వదేశానికి వస్తారు. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తారు. ఇప్పటికే ఆయన పార్టీ సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. 


Updated Date - 2022-01-06T18:26:24+05:30 IST