‘భారత్ జోడో’ భవిష్యత్తును గెలుస్తుందా?

ABN , First Publish Date - 2022-05-20T10:31:28+05:30 IST

‘అవివేకత ఒకే రకమైన పనిని పదే పదే చేస్తూ, ప్రతీసారీ విభిన్న ఫలితాలను ఆశిస్తుంది’– భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ మాటగా సుప్రసిద్ధమైన ఈ సత్య వాక్యం గత పది సంవత్సరాల కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థితిని సూచించడం లేదూ?!

‘భారత్ జోడో’ భవిష్యత్తును గెలుస్తుందా?

‘అవివేకత ఒకే రకమైన పనిని పదే పదే చేస్తూ, ప్రతీసారీ విభిన్న ఫలితాలను ఆశిస్తుంది’– భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ మాటగా సుప్రసిద్ధమైన ఈ సత్య వాక్యం గత పది సంవత్సరాల కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థితిని సూచించడం లేదూ?! కనుకనే కాబోలు, ఈ మహోన్నత పురాతన రాజకీయ పక్షం కాలం దెబ్బల నుంచి కోలుకునేందుకు ‘చింతన్ శివిర్’ మేధో మథనానికి పూనుకోవడం పట్ల సంశయాలు వ్యక్తం చేసినవారే అత్యధికంగా ఉన్నారు. పరాజయం నుంచి ఘోర పరాజయానికి పయనిస్తూ కూడా పాఠాలు నేర్చుకోని ఒక రాజకీయ పార్టీ, హఠాత్తుగా పునరుజ్జీవ సంకల్పంతో మేధో మథనానికి పూనుకోవడం విస్మయం కలిగించకుండా ఎలా ఉంటుంది? పరిహాసానికి తావివ్వకపోవడమనేది ఆశ్చర్యకరమే అవుతుంది. ఎనిమిదేళ్ల అధికారరాహిత్యం నేర్పని పాఠాలను ఉదయ్‌పూర్ రాజహర్మ్యంలో మూడు రోజుల ‘చింతన్ శివిర్’ నేర్పగలదా? లక్ష్యసాధనకు పనికివచ్చే మార్గాలను ఆ మేధో మథనం చూపగలదా?


ఉదయ్‌పూర్ సదస్సుకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ యువ నేత ఒకరు ఈ కాలమిస్ట్‌తో జరిపిన మాటా మంతీలో ఇలా అన్నారు: ‘కాంగ్రెస్‌లో ఒక ‘విప్లవం’ రాబోతుంది. పరిస్థితులు ఇంకెంతమాత్రం యథాతథంగా ఉండబోవు’. గొప్ప ఆశాభావం, సందేహం లేదు. అయితే కాంగ్రెస్ ‘ఉదయ్‌పూర్ డిక్లరేషన్’లో ధర్మపరాయణ శ్లోకాలు, వచనాలు మెండుగా ఉన్నాయి కానీ సంభావ్య నవ పథ నిర్దేశక ఆలోచనలే కానరావడంలేదు. బీజేపీ హిందూత్వ భావజాలాన్ని ప్రతి ఘటించేందుకు ‘భారతీయత’ను స్వీకరించాలని, ‘వసుధైవ కుటుంబకం’ ఆదర్శాన్ని శిరసావహించాలని ఆ డిక్లరేషన్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ శ్రేణులు ఈ నిర్దేశాలను చిత్తశుద్ధితో పాటించాయనే అనుకుందాం. అయితే అది, ప్రస్తుత ‘కొత్త’ భారత దేశానికి ‘భారత జాతీయవాదం’ను ఎలా స్ఫూర్తిదాయకం చేయగలుగుతుంది?


అలాగే ‘ఒక కుటుంబం, ఒక టిక్కెట్’ అనే ‘విప్లవాత్మక’ నిర్ణయాన్ని కూడా చూడండి. ఆసేతు శీతాచలం ప్రతి ప్రాంతాన ‘కాంగ్రెస్ కుటుంబాలు’గా సుప్రసిద్ధమైనవి వేలకు వేలుగా ఉన్నాయి. మరి పై నిర్ణయాన్ని అమలుపరచడమంటే బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతంతో ఘనీభవించిన గతంతో తెగతెంపులు చేసుకోవడమే. అయితే ఆ ‘ఒక కుటుంబం, ఒక టిక్కెట్’ నిర్ణయాన్ని ఒక అనుబంధ షరతుతో ముడిపెట్టారు. ఒకే కుటుంబం నుంచి రెండోవారు ఎవరైనా ఎన్నికలలో పోటీచేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని అపేక్షిస్తే, అతడు కనీసం ఐదు సంవత్సరాల పాటు ఒక ‘ఆదర్శప్రాయమైన రీతి’లో పార్టీ బలోపేతానికి కృషిచేసివుండాలి. ఈ అనుబంధ సూత్రం ప్రస్తుత అధినేతలైన గాంధీ త్రయానికే కాకుండా మరెన్నో ఇతర కుటుంబాల వారు కూడా ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అంతిమ పర్యవసానమేమిటి? యథాతథ పరిస్థితే సుమా!


కాంగ్రెస్‌ను కొత్త పుంతలు తొక్కించేందుకు ఉద్దేశించిన మరో సిఫారసునే తీసుకోండి. కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం (సీడబ్ల్యుసీ)తో సహా అన్ని స్థాయిలలోనూ పార్టీ పదవులలో యాభై శాతాన్ని విధిగా 50 సంవత్సరాల వయసు లోపు వారికే ఇవ్వాలని, అలాగే అన్ని స్థాయిలలోనూ ఆయా పదవులను నిర్వహించేవారి పదవీ కాల పరిమితిని ఐదు సంవత్సరాలుగా నిర్ణయించాలని ఆ సిఫారసు నిర్దేశించింది. అన్ని ‘ఎన్నికైన పదవులకు’ ఒక ‘పదవీ విరమణ వయసు’ను నిర్ణయించాలని యువజన వ్యవహారాల కమిటీ ప్రతిపాదించింది. ప్రత్యర్థి బీజేపీ విజయవంతంగా అమలుపరుస్తోన్న ‘మార్గదర్శక్ మండల్’ భావనే, బహుశా, ఈ ప్రతిపాదనకు స్ఫూర్తి అయివుంటుంది. అయితే సదస్సు అంతిమ తీర్మానంలో ఏ పదవికీ ఎటువంటి వయో పరిమితిని నిర్దిష్టపరచలేదు. రాజ్యసభలో శాశ్వతంగా తిష్ఠ వేసిన నాయకులకు కూడా పదవీ కాల పరిమితులు వర్తిస్తాయా అనే విషయమై ఎటువంటి స్పష్టత లేదు. ఎందుకీ సందిగ్ధత? కాంగ్రెస్ వ్యవహారసరళి అంతే కదా అని అనుకోక తప్పదు.


అవును, కాంగ్రెస్‌ను ఇటీవలి కాలంలో మనం ఎలా అవగతం చేసుకున్నామో మరి చెప్పాలా? వయో వృద్ధ పార్టీగా అది మన గౌరవానికి కాకుండా పరిహాసానికే ఎక్కువగా పాత్రమవుతూ వస్తోంది. 1998 నుంచి సీడబ్ల్యూసీకి ఒక్కసారైనా ఎన్నికలు జరిగాయా? కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సరిగా పనిచేస్తుందా? సమాధానం స్పష్టమే. సంస్థాగత ఎన్నికలు పదే పదే వాయిదా పడడమేకానీ జరిగిందెప్పుడు? ఒకే పదవిని ఒకే నేత సంవత్సరాల తరబడి అంటిపెట్టుకుని ఉండిపోవడం మామూలై పోయింది. మరి పార్టీకి ఎడతెగని వైఫల్యాలు ఆనవాయితీ అయిపోవడంలో ఆశ్చర్యమేముంది? సరే, సోనియా గాంధీ ఇంచుమించు పాతికేళ్ల నుంచి పార్టీ అధినేత్రిగా ఉన్నారు. ఫ్రెంచ్ లోకోక్తి ఒకటి మన కాంగ్రెస్‌కు పూర్తిగా వర్తిస్తుంది: పరిస్థితులు ఎంతగా మారుతాయో అవి అంతగా యథాతథంగా ఉంటాయి.


మనుగడ సంక్షోభంలో ఉన్న పార్టీకి, క్రమానుగతమైన మెరుగుదల సాధించడమనే దృక్పథం ఏ విధంగా మేలు చేయగలుగుతుంది? ఈ విషయమై కాంగ్రెస్ సందిగ్థావస్థను రాహుల్‌ గాంధీ నిష్కపటంగా ఒప్పుకున్నారు. పార్టీ దుస్థితిపై ఆయన అంతర్ముఖుడయ్యారు. ప్రజలతో సంబంధాలు తెగిపోవడమే ప్రస్తుత విపత్కర పరిస్థితికి కారణమని ఆయన అంగీకరించారు. ఒక దశాబ్దానికి పైగా కాంగ్రెస్ ఓట్ల శాతంలో పెరుగుదల ఏ మాత్రం లేకపోవడానికి కూడా ప్రజలతో సంధానం లేకపోవడమేనని రాహుల్ గుర్తించారు.


మరి ప్రజలతో అనుబంధాన్ని పెంపొందించుకోవడమెలా? జనసందోహంతో సంధానాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలి? భారత్ జోడో యాత్ర. ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల చింతన్ శివర్ ముగింపు సమావేశంలో సోనియా గాంధీ ఇలా చెప్పారు: ‘‘మహాత్మా గాంధీ జయంతి రోజున కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర’ ప్రారంభమవుతుంది. మన మందరమూ ఆ యాత్రలో పాల్గొంటాం. ఒత్తిళ్లకు గురవుతోన్న సామాజిక సామరస్య సంబంధాలను సంరక్షించేందుకు, దాడులకు గురవుతున్న మన రాజ్యాంగ విలువలను కాపాడేందుకు, సామాన్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ఈ యాత్రను సంకల్పించాము’’.


మహాత్ముని స్ఫూర్తి ఆవాహనతో నిర్వహించే దేశవ్యాప్త యాత్రతో కాంగ్రెస్ మళ్లీ దేశ రాజకీయాలలో కీలక పాత్ర వహించగలుగుతుందా? సందేహించవలసిన అవసరముంది. లాల్ కృష్ణ ఆడ్వాణీ 1990లో నిర్వహించిన రామ జన్మభూమి యాత్ర సఫలమయిందంటే అందుకు కారణం హిందూ మత వైభవ పునరుద్ధరణ లక్ష్యంతో అది జరగడమే అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. మహాత్ముని శాంతి సామరస్యాల విలువల గురించి ‘కొత్త’ భారతదేశంలో గంభీరంగా ఉద్ఘాటించడం వల్ల ప్రయోజనముంటుందా? వాటిని ఎలా ఒక ప్రభావశీల కార్యాచరణగా మార్చనున్నదీ స్పష్టం చేయాలి. అంతేకాదు. కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరించాలి. లక్ష్య సాధనకు వారిని పురిగొల్పాలి. ఇందుకు సమర్థనాయకులు ఎంతైనా అవసరం. ఇదంతా ప్రజలను విశేషంగా ఆకట్టుకునేందుకు తప్పనిసరి. నిబద్ధ కార్యకర్తలు, దీక్షాదక్షులైన నాయకులు లేకుండా ఏ పార్టీ కూడా ఏమీ సాధించలేదు. మరి కాంగ్రెస్ ఇప్పుడు భావజాలపరమైన గందరగోళంలో ఉన్నది. ప్రేరణ లేని కార్యకర్తలు, ఉత్తేజపరచలేని నాయకులతో కాంగ్రెస్ తన నవ సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకోగలుగుతుంది? మాటలకు చేతలకు అవినాభావ సంబంధముంటేనే ప్రజలు ఆకర్షితులు అవుతారు. గత అక్టోబర్‌లో కాంగ్రెస్ ఏమి చెప్పిందో గుర్తుచేసుకోండి. ధరల పెరుగుదలపై ‘నిరంతర’ ఆందోళన ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. పాదయాత్రలు సైతం నిర్వహిస్తామని వాగ్దానం చేసింది. అంతిమంగా జరిగిందేమిటి? ట్విటర్ కిచకిచలు విన్పించాయి గానీ ప్రజాక్షేత్రంలో కార్యశీలురు ఎవరూ కానరాలేదు.


సరే, అసలు సమస్యకు వద్దాం. అది: నాయకత్వం. చింతన్ శివిర్‌లో కాంగ్రెస్ వాస్తవ నాయకుడు రాహుల్ గాంధీయేనని స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీయే తన ‘కుటుంబమని’ జవహర్ లాల్ నెహ్రూ మునిమనవడు చెప్పాడు. ఆరెస్సెస్–బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా సుదీర్ఘ రాజకీయ పోరాటం చేస్తానని ఆయన వాగ్దానం చేశారు. మరి తన సంస్కరణ భావాలతో, పార్టీలో పాదుకుపోయిన స్వార్థ ప్రయోజనాల బృందాలను తన లక్ష్య సాధనకు కలుపుకుపోగలరా? ఇందుకు ఆయన కార్యాచరణ ఏమిటి? అధికార రాజకీయాలను ఆచరించడానికి సంశయిస్తున్న రాహుల్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏదో అద్భుతం జరుగుతుందనే ఆశతో నిరీక్షించకుండా స్పష్టమైన దార్శనికత, పటిష్ఠ కార్యాచరణతో ఎప్పుడు రంగంలోకి దిగుతారు? 


కాంగ్రెస్ భావి వ్యవహారాలలో ప్రియాంకా గాంధీ వాద్రా ఎటువంటి పాత్ర వహించనున్నారు? ఇదీ అస్పష్టంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను విజయ పథాన నడిపించడంలో విఫలమయినప్పటికీ పార్టీ విధాన నిర్ణయాలలో ఆమె ఇప్పటికీ ప్రభావశీల పాత్ర నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక ముందూ నిర్ణయాత్మక పాత్ర వహిస్తారా లేక ప్రధాన నిర్ణయాలు అన్నిటినీ సోదరుడు రాహుల్‌కే వదిలి వేస్తారా? మరి సోనియా విషయమేమిటి? కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను పాక్షికంగా నిర్వహించడానికే ఆమె పరిమితమవుతారా? లేక వర్గాలు, ముఠాల మయమైన కాంగ్రెస్‌ను సమైక్యంగా నిలిపే శక్తిగా కొనసాగుతారా?


నిజం చెప్పాలంటే బీజేపీ సదా ‘విభజన’ రాజకీయాలకు పాల్పడుతుండగా కాంగ్రెస్‌లో తాత్కాలిక నాయకత్వ శైలి ఆ పార్టీని నిరంతర జడత్వంలోకి నెట్టివేసింది. కాంగ్రెస్‌ను అన్ని స్థాయిలలోనూ తక్షణమే సంస్కరించాల్సిన ఆవశ్యకతను ఉదయ్‌పూర్ డిక్లరేషన్ గుర్తించింది. మంచిదే. మరి ఏదైనా పాదయాత్రకు ఉపక్రమించే ముందు కాంగ్రెస్ తన ఆత్మవంచనాత్మక భ్రమల నుంచి బయటపడాలి. ‘ఆ ఒక్క కుటుంబం’ మాత్రమే భారత్‌ను కాపాడగలదనే నిశ్చిత వైఖరికి స్వస్తి చెప్పి తీరాలి. ఎందుకు? నాయకత్వం తమ స్వతస్సిద్ధ ప్రత్యేక హక్కు అన్న ఆలోచనా ధోరణి, వ్యవహార శైలికి రూపు కట్టిన ‘పాత’ కాంగ్రెస్‌ను ‘కొత్త’ భారతదేశం తిరస్కరించింది. భారత్‌ను ‘రక్షించడం’ అనే నవ సంకల్పాన్ని అటుంచి, మొట్ట మొదట పార్టీలో యథాతథ పరిస్థితులకు ముగింపు పలికి కాంగ్రెస్ తనను తాను కాపాడుకోవాల్సిన అగత్యం మిక్కుటంగా ఉంది.



రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Updated Date - 2022-05-20T10:31:28+05:30 IST