ఆరోగ్య శాఖకు కొత్త మంత్రి రాకతో రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రం

ABN , First Publish Date - 2021-07-08T20:30:53+05:30 IST

ఆరోగ్య శాఖ మంత్రిగా మన్‌సుఖ్ మాండవీయ పదవీ బాధ్యతలు

ఆరోగ్య శాఖకు కొత్త మంత్రి రాకతో రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రం

న్యూఢిల్లీ : ఆరోగ్య శాఖ మంత్రిగా మన్‌సుఖ్ మాండవీయ పదవీ బాధ్యతలు చేపట్టిన కాసేపటికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. ఛేంజ్ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టి, ఈ మార్పు వల్ల ఇకపై కోవిడ్-19 వ్యాక్సిన్ల కొరత ఉండబోదని అర్థం చేసుకోవాలా? అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో భాగంగా హర్షవర్ధన్‌ను ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆ శాఖ బాధ్యతలను మన్‌సుఖ్ మాండవీయకు అప్పగించారు. 


రాహుల్ గాంధీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘దీని అర్థం ఇకపై వ్యాక్సిన్ కొరత ఉండబోదు అనా?’’ అని ప్రశ్నించారు. 


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ విధానాన్ని కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబడుతోంది. టీకాకరణ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని, దీనిని వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తోంది. కొన్ని రాష్ట్రాలు తీవ్ర వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయని, దీనిని కొత్త ఆరోగ్య శాఖ మంత్రి పరిష్కరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం డిమాండ్ చేశారు. 


ఈ విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందించారు. రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేవలం విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. 


Updated Date - 2021-07-08T20:30:53+05:30 IST