Congress` Presidential Election: రాహుల్ గాంధీ నిరాసక్తత... సందిగ్ధంలో కాంగ్రెస్...

ABN , First Publish Date - 2022-08-20T20:51:52+05:30 IST

కాంగ్రెస్ (Congress) అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

Congress` Presidential Election: రాహుల్ గాంధీ నిరాసక్తత... సందిగ్ధంలో కాంగ్రెస్...

న్యూఢిల్లీ : కాంగ్రెస్ (Congress) అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నప్పటికీ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిరాసక్తంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితులను కారణంగా చూపుతూ మరోసారి ఆ పదవిని చేపట్టడానికి సోనియా గాంధీ  (Sonia Gandhi) విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించలేకపోవడంతో ప్రియాంక గాంధీ వాద్రా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆ పార్టీకి తదుపరి సారధి ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 


కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ (CEA) మధుసూదన్ మిస్త్రీ (Madhusudan Mistry) ఆగస్టు 10న ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 9,100 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఆగస్టు 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్ల దాఖలుకు  తుది గడువు ఆగస్టు 28 అని పేర్కొన్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ సెప్టెంబరునాటికి పూర్తవుతుందని తెలిపారు. 


విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని రాహుల్ గాంధీకి సోనియా గాంధీ నచ్చజెప్తున్నారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం ఎదురైన తర్వాత తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్తున్నారు. తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోమని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 


రాహుల్ గాంధీ నిర్ణయం అనంతరం పార్టీ అధ్యక్ష పదవిని తాత్కాలికంగా చేపట్టే విధంగా సోనియా గాంధీని ఆ పార్టీ సీనియర్ నేతలు ఒప్పించగలిగారు. రాహుల్ మనసు మారకపోవడంతో ఆమె పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. 


ధరల పెరుగుదలపై ఈ నెల ఐదున కాంగ్రెస్ ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన నేతలు కూడా రాహుల్ గాంధీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన పట్టువీడటం లేదు. 


మరోవైపు ఆయన అత్యంత ముఖ్యమైన నిర్ణయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఏర్పాటులో కూడా ఆయన జోక్యం చేసుకోలేదు. జమ్మూ-కశ్మీరు కాంగ్రెస్ కమిటీని పునర్నిర్మించే నిర్ణయానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. 


ఈ నేపథ్యంలో ఎవరూ నామినేషన్లు దాఖలు చేయని పరిస్థితి వస్తుందేమోనని ఆ పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. 


విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ చానల్ తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ శనివారం నాటికి కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. నేతల విజ్ఞప్తులను ఆయన తిరస్కరిస్తున్నారు. సోనియా గాంధీ కూడా తన ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపుతూ మరోసారి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడానికి తిరస్కరిస్తున్నారు. దీంతో సీనియర్లు ఎంతో ఆశతో ప్రియాంక గాంధీ వాద్రా పేరును పరిశీలిస్తున్నారు. కానీ ఇటీవలి ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్న విషయం చాలా మంది నేతల మదిలో మెదులుతోంది. 


కాంగ్రెస్ సీనియర్ నేత భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్ష పదవిపై రాహుల్ గాంధీ ఆసక్తి చూపడం లేదన్నారు. కానీ తాము ఆయనకు అనేక విజ్ఞప్తులు చేస్తున్నామని తెలిపారు. ఆ పదవిని ఎలా భర్తీ చేయాలో ఆయన చెప్పాలన్నారు. 


ఇదిలావుండగా, రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తున్నారు. సెప్టెంబరులో ఓ బహిరంగ సభలో పాల్గొంటారు. కన్యా కుమారి నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తారు. 


Updated Date - 2022-08-20T20:51:52+05:30 IST