మోదీ గారూ, క్షమాపణలు చెప్పవలసిన సమయం మరోసారి వచ్చింది : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-12-14T20:44:46+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాన మంత్రి

మోదీ గారూ, క్షమాపణలు చెప్పవలసిన సమయం మరోసారి వచ్చింది : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాగు చట్టాలను రద్దు చేస్తూ క్షమాపణలు చెప్పిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న జరిగిన హింసాకాండ కేసులో క్షమాపణలు చెప్పవలసిన సమయం వచ్చిందని అన్నారు. అంతకుముందు ఈ కేసులో నిందితుడైన ఆశిశ్ మిశ్రా తండ్రిని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సత్యం కళ్ళకు ఎదురుగా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి ఓ కారు దూసుకెళ్ళింది. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాతోపాటు 13 మంది నిందితులు. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు జరుపుతోంది. తాజాగా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం)ను సిట్ ఆశ్రయించింది. ఈ కేసులో ఆశిశ్ మిశ్రాతో సహా, నిందితులందరూ హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేయాలని, హత్యాయత్నం చేసినందుకు వీరిని  శిక్షించేందుకు వీలుగా ప్రస్తుత కేసులో అదనపు సెక్షన్లను చేర్చాలని కోరింది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 279, 338, 304ఏలను మార్చాలని కోరింది. ఈ మేరకు సిట్ దర్యాప్తు అధికారి విద్యారామ్ దివాకర్ సీజేఎంకు దరఖాస్తు సమర్పించారు. ఈ సంఘటన ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలిపారు. 


ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘మోదీ గారూ, క్షమాపణ చెప్పవలసిన సమయం మళ్ళీ వచ్చింది. కానీ ముందుగా నిందితుని తండ్రిని మంత్రి పదవి నుంచి తొలగించండి. సత్యం కళ్ల ఎదురుగా ఉంది’’ అని పేర్కొన్నారు. 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఈ సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని తెలిపారు. చెప్పినట్లుగానే పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజునే ఈ చట్టాలను రద్దు చేశారు. 


Updated Date - 2021-12-14T20:44:46+05:30 IST