Bharat Jodo Yatra : కాంగ్రెస్‌కు ఎన్నికలు జరిగితే ఆ విషయం తెలుస్తుంది : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-09-09T20:34:37+05:30 IST

ప్రజలతో మమేకమవడానికి భారత్ జోడో యాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్

Bharat Jodo Yatra : కాంగ్రెస్‌కు ఎన్నికలు జరిగితే ఆ విషయం తెలుస్తుంది : రాహుల్ గాంధీ

చెన్నై : ప్రజలతో మమేకమవడానికి భారత్ జోడో యాత్ర చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారు. బీజేపీ-ఆరెస్సెస్ (BJP-RSS) వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడం కూడా తమ లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే తాను ఆ పదవిని చేపట్టేది, లేనిది స్పష్టమవుతుందన్నారు. 


రాహుల్ గాంధీ శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.  ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ప్రజలతో మమేకమవడం కోసమే భారత్ జోడో యాత్ర జరుగుతోందని చెప్పారు. బీజేపీ-ఆరెస్సెస్ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని వ్యవస్థలు ఇప్పుడు బీజేపీ నియంత్రణలో ఉన్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యవస్థలను వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. పోరాటం రాజకీయ పార్టీల మధ్య కాదని చెప్పారు. 


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల గురించి ప్రస్తావించినపుడు గాంధీ మాట్లాడుతూ, తాను ఓ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఎన్నికలు జరిగితే తన నిర్ణయం స్పష్టమవుతుందన్నారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టేది, లేనిది స్పష్టంగా వెల్లడవుతుందన్నారు. అప్పటి వరకు వేచి చూడాలని కోరారు. ఈ విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నానని చెప్పారు. 


యాత్రలో భాగస్వామ్యం

కన్యా కుమారి నుంచి కశ్మీరు వరకు జరుగుతున్న భారత్ జోడో యాత్రకు తాను నాయకత్వం వహించడం లేదన్నారు. తాను కేవలం ఈ యాత్రలో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. ‘‘ఈ యాత్ర వల్ల నా గురించి, ఈ అందమైన దేశం గురించి కొంత అవగాహన చేసుకుంటాను, ఈ రెండు, మూడు నెలల్లో నేను మరింత అవగాహన పెంచుకుంటాను’’ అని తెలిపారు. 


పాకిస్థాన్ వరద బాధితులకు సానుభూతి

పాకిస్థాన్‌లో వరదల వల్ల దాదాపు 1,400 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల రాహుల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణమైన విషాదమని తెలిపారు. వరద ప్రభావితులందరికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మీయులను కోల్పోయినవారందరికీ సంతాపం తెలిపారు. 


రాహుల్ గాంధీ మూడో రోజు భారత్ జోడో యాత్రను  శుక్రవారం ఉదయం తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్న స్కాట్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి ప్రారంభించారు.  


Updated Date - 2022-09-09T20:34:37+05:30 IST