Karnataka High Court జడ్జికి బెదిరింపులు... భయం వద్దంటున్న రాహుల్ గాంధీ...

ABN , First Publish Date - 2022-07-06T01:21:53+05:30 IST

కర్ణాటక అవినీతి నిరోధక శాఖ (ACB)పై వ్యాఖ్యలు చేసిన హైకోర్టు న్యాయమూర్తికి

Karnataka High Court జడ్జికి బెదిరింపులు... భయం వద్దంటున్న రాహుల్ గాంధీ...

న్యూఢిల్లీ : కర్ణాటక అవినీతి నిరోధక శాఖ (ACB)పై వ్యాఖ్యలు చేసిన హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు వస్తుండటాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ప్రతి వ్యవస్థనూ బీజేపీ అణగదొక్కుతోందని దుయ్యబట్టారు. నిర్భయంగా విధులను నిర్వహించేవారికి మనలో ప్రతి ఒక్కరం మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘భయపడవద్దు’ అని ఆ న్యాయమూర్తికి భరోసా ఇచ్చారు. 


ఓ భూ వివాదంలో డిప్యూటీ తహశీల్దారు పీఎస్ మహేశ్ రూ.5 లక్షలు లంచం తీసుకున్నట్లు కేసు నమోదైంది. దీనిపై మహేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు  జస్టిస్ హెచ్‌పీ సందేశ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా సందేశ్ మాట్లాడుతూ, అవినీతిని కేన్సర్‌తో పోల్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడతానని భరోసా ఇచ్చారు. 


జూన్ 29న ఏసీబీకి ఇచ్చిన ఆదేశాల్లో, 2016 నుంచి ‘బీ’ (Closure) రిపోర్టులను దాఖలు చేసిన అన్ని కేసుల వివరాలను సమర్పించాలని కోరారు. ఈ కేసు మళ్ళీ విచారణకు వచ్చినపుడు సందేశ్ మాట్లాడుతూ, ‘‘మీ ఏసీబీ ఏడీజీపీ చాలా శక్తిమంతుడిలా కనిపిస్తున్నారు. నా సహోద్యోగికి ఎవరో ఈ విషయం చెప్పారు. ఈ విషయాన్ని నాకు ఓ జడ్జి చెప్పారు. నన్ను బదిలీ చేయిస్తానని బెదిరించిన విషయాన్ని ఆర్డర్‌లో నమోదు చేస్తాను’’ అని అన్నారు. ‘‘నేను ఎవరికీ భయపడను. పిల్లి మెడలో గంట కట్టడానికి నేను సిద్ధం. నేను న్యాయమూర్తిని అయిన తర్వాత డబ్బు కూడబెట్టుకోలేదు. నా ఉద్యోగం పోయినా నేను పట్టించుకోను. నేను ఓ రైతు బిడ్డని. నేను దుక్కి దున్నుకోవడానికి సిద్ధం. నేను ఏ రాజకీయ పార్టీకీ చెందినవాడిని కాదు. నేను ఏ రాజకీయ భావజాలానికీ కట్టుబడినవాడిని కాదు’’ అన్నారు. 


ఏసీబీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది మాట్లాడుతూ, క్లోజర్ రిపోర్టులకు సంబంధించిన అంశంపై మరొక ధర్మాసనం విచారణ జరుపుతోందన్నారు. దీనిపై సందేశ్ స్పందిస్తూ, ‘‘రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినవారికి సంబంధించిన కేసుల్లో మీరు బీ-రిపోర్టులు దాఖలు చేస్తున్నారు. డివిజన్ బెంచ్‌కి ఇప్పటికే సమాచారాన్ని ఇచ్చినపుడు ఆ వివరాలను నాకు ఎందుకు సమర్పించడం లేదు?’’ అని ప్రశ్నించారు. 


‘‘మీరు ఎవరిని కాపాడుతున్నారు? ప్రజలనా? కళంకితులనా? అవినీతిపరులను కాపాడటానికి కాదు నల్లకోటు. సెర్చ్ వారంట్స్‌తో బెదిరించి అధికారులను దోచుకుంటున్నారు’’ అన్నారు. 


జస్టిస్ సందేశ్ సోమవారం మాట్లాడుతూ, ఏసీబీని కలెక్షన్ సెంటర్ అని విమర్శించినందుకు తనను బదిలీ చేస్తామని పరోక్షంగా బెదిరింపులు వచ్చాయన్నారు. ఏసీబీ ఏడీజీపీ సీమంత్ కుమార్ కళంకిత అధికారి అని పేర్కొన్నారు. 


ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలోని అవినీతి ప్రభుత్వాన్ని బాహాటంగా బయటపెట్టినందుకు ఓ హైకోర్టు జడ్జిని బెదిరించారు. ఓ వ్యవస్థ తర్వాత మరో వ్యవస్థను బీజేపీ బుల్డోజ్ చేస్తోంది. తమ కర్తవ్యాన్ని నిర్భయంగా నిర్వహిస్తున్నవారికి మనలో ప్రతి ఒక్కరమూ మద్దతుగా నిలవాలి. భయం వద్దు’’ అని భరోసా ఇచ్చారు. 


Updated Date - 2022-07-06T01:21:53+05:30 IST