
న్యూఢిల్లీ : ప్రజల సమస్యలను పరిష్కరించాలని, విద్వేషాన్ని వ్యాపింపజేయవద్దని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీకి హితవు పలికారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజల సమస్యలపై బుల్డోజర్ను నడపాలన్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, భయోత్పాతం ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ సమస్యలపై నుంచి బుల్డోజర్ను నడపాలన్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, భయోత్పాతం ఉన్నాయన్నారు.
మధ్య ప్రదేశ్లోని ఖర్గోన్లో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హింసాకాండ చెలరేగింది. శోభాయాత్రపై కొందరు దుండగులు దాడి చేయడంతో విధ్వంసం జరిగింది. దాదాపు ఏడుగురు పోలీసులు సహా 20 మంది గాయపడ్డారు. ఇళ్లు, వాహనాలను తగులబెట్టారు. ఆది, సోమవారాల్లో ఈ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన నష్టాన్ని దుండగుల నుంచే వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంఘటనలో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది.
ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ బుల్డోజర్ను ఉపయోగించవలసిన తీరును ప్రభుత్వానికి తెలిపారు.
ఇవి కూడా చదవండి