Rahul Gandhi: అధ్యక్ష ఎన్నికకు దూరంగా రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-09-21T02:59:12+05:30 IST

భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) అధ్యక్ష ఎన్నికకు దూరంగా

Rahul Gandhi: అధ్యక్ష ఎన్నికకు దూరంగా రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) అధ్యక్ష ఎన్నికకు దూరంగా ఉంటున్నారా? అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)ను విడిచిపెట్టి ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్లబోరని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 7న కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ యాత్ర 150 రోజులుపాటు కొనసాగి మొత్తం 3,700 కిలోమీటర్లు పూర్తిచేసుకుని కశ్మీర్‌లో ముగుస్తుంది. ప్రస్తుతం కేరళలో నడుస్తున్న ఆయన ఈ నెల 29న కర్ణాటకలో అడుగుపెడతారు.


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ నెల 30 చివరి రోజు. అక్టోబరు 17న ఎన్నిక జరుగుతుంది. ఈ ఉదయం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియగాంధీ(sonia gandhi)ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(K.C. Venugopal) కలిశారు. ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికపై పలు అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే, రాహుల్ గాంధీ పోటీపైనా ఇరువురు నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, అధ్యక్ష ఎన్నికల బరిలోకి రాహుల్ దిగుతారా? లేదా? అన్న విషయాన్ని ఆయన మాత్రమే ధ్రువీకరించగలుగుతారని వేణుగోపాల్‌తో సోనియా చెప్పినట్టు సమాచారం. 


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చని, ఇది స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతుందని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగేదీ, లేనిదీ ఆయన మాత్రమే నిర్ణయించగలరు, చెప్పగలరని వేణుగోపాల్ చెప్పారు. మరోవైపు, ఝార్ఖండ్(Jharkhand) కాంగ్రెస్ యూనిట్ ఓ కీలక తీర్మానం చేసింది. రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిని చేయాలని తీర్మానించింది. ఆ వెంటనే కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ (Jai Ram Ramesh) మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC)లు చేసే తీర్మానాలు చెల్లవని స్పష్టం చేశారు. 


శశిథరూర్-అశోక్ గెహ్లాట్ మధ్యే పోటీ

మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ శశిథరూర్ (Shashi Tharoor)- రాజస్థాన్ ముఖ్యమంత్రి అకోశ్ గెహ్లాట్(Ashok Gehlot) మధ్యే ఉంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ కనుక పోటీ చేయకుంటే వీరిద్దరే ప్రధాన పోటీదారులు అవుతారని చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే నిజమయ్యేలా అనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికలపై సోనియాగాంధీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె తటస్థంగా ఉండనున్నారు. అధ్యక్ష ఎన్నికలపై పార్టీలో ఆసక్తి రేకెత్తిందని, ఇది పార్టీ బలోపేతానికి కారణమవుతుందని భావిస్తున్నారు. 


Updated Date - 2022-09-21T02:59:12+05:30 IST