Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ 150 రోజులపాటు నిద్రపోయేది అక్కడే!

ABN , First Publish Date - 2022-09-07T18:03:17+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ 150 రోజులపాటు నిద్రపోయేది అక్కడే!

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర  (Bharat Jodo Yatra) బుధవారం ప్రారంభం కాబోతోంది. ఆయన దాదాపు 150 రోజులపాటు కన్యాకుమారి (Kanya Kumari) నుంచి కశ్మీరు (Kashmir) వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సమయంలో ఆయన హోటళ్ళలో బస చేయరు. నిజాయితీగా యాత్ర చేయాలనే లక్ష్యంతో ఆయన ఓ కంటెయినర్‌లో బస చేయబోతున్నారు. దీనిలో నిద్రపోవడానికి తగిన సదుపాయాలు, మరుగుదొడ్లు, ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. వాతావరణానికి తగినట్లుగా దీనిలోని పరిస్థితులు మారే విధంగా ఏర్పాట్లు చేశారు. 


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత దేశ రాజకీయాలకు ఇది ఓ నిర్ణయాత్మక మార్పును తీసుకొచ్చే సమయమని తెలిపారు. పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రజలతో తిరిగి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది మంచి అవకాశమని చెప్పారు. 


ఇదిలావుండగా, రాహుల్ గాంధీ బుధవారం ఉదయం తన తండ్రి, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో రాజీవ్ స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, విద్వేషపూరిత, విభజన రాజకీయాల వల్ల తన తండ్రి (Rajiv Gandhi)ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి రాజకీయాలకు తన ప్రియమైన దేశాన్ని కోల్పోబోనని చెప్పారు. విద్వేషంపై ప్రేమ విజయం సాధిస్తుందని తెలిపారు. భయాన్ని ఆశావాదం ఓడిస్తుందన్నారు. మనమంతా కలిసికట్టుగా వీటిని అధిగమిద్దామని పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-09-07T18:03:17+05:30 IST