రాహుల్ మంచిబాలుడు

ABN , First Publish Date - 2020-08-21T06:05:53+05:30 IST

రాజీవ్ గాంధీ సంతానాన్ని చూస్తే జాలి కలుగుతుంది. జవహర్ లాల్ నెహ్రూలో పుత్రికా ప్రేమ ఎంత ఉన్నదో, ఇందిరాగాంధీ ఎదుగుదలలో ఆయన అందించిన అనుచిత సహాయం ఎంతున్నదో తెలియదు...

రాహుల్ మంచిబాలుడు

రాజీవ్ గాంధీ సంతానాన్ని చూస్తే జాలి కలుగుతుంది. జవహర్ లాల్ నెహ్రూలో పుత్రికా ప్రేమ ఎంత ఉన్నదో, ఇందిరాగాంధీ ఎదుగుదలలో ఆయన అందించిన అనుచిత సహాయం ఎంతున్నదో తెలియదు కానీ, ఇందిరాగాంధీ పుత్రప్రేమ మాత్రం అందరికీ తెలుసు. ఆ ప్రేమ వల్ల ఆమె ఎంతో నష్టపోయింది కూడా. తన నియంతృత్వ ధోరణి వల్లనే కాక, చిన్న కొడుకు చర్యల వల్ల కూడా ఆమె ప్రతిష్ఠకు మచ్చ వచ్చింది. సంజయ్ గాంధీ అకాల మరణం అనంతరం ఇందిర ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాజీవ్ గాంధీని రాజకీయాలలోకి రప్పించారు. ఆ తరువాతి చరిత్ర తెలిసిందే. రాజీవ్ గాంధీ హత్యానంతరం కానీ, ఆ తరువాతి కాలంలో కానీ సోనియాగాంధీ భర్త వారసత్వాన్ని అందుకోవడానికి ప్రయత్నించలేదు. కొడుకు కోసం అవకాశాలను పదిలం చేయడానికి ప్రయత్నించలేదని అనలేము కానీ, ఆ ప్రయత్నాలేమంత ఉధృతమైనవి కావు. తనకు వడ్డించిన విస్తరి లాంటి అధికార రాజకీయాలలోకి రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రవేశించలేదు. ఆయన ప్రవర్తనలో ఎక్కడా ఆ లాలస పెద్దగా కనిపించలేదు. వంశపారంపర్య ‘హక్కు’తో పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ స్వీకరించడానికి ఆయన మొహమాట పడుతూ వచ్చారు. గతంలో, నెహ్రూ వంశీకులు కాని ఉద్దండులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వారెవరికీ అవకాశాలు లభించలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ పుత్రుడు, పుత్రిక ఇద్దరూ కూడా గాంధీ అన్న పేరు లేని వారు కాంగ్రెస్ పగ్గాలు చేపడితే బాగుంటుందని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే, ముళ్లకిరీటాన్ని ధరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. 


ఈ సందర్భంలో మరొక విషాదం ఏమిటంటే, రాహుల్ గాంధీ మాట తీరు, ఆలోచన- ఇప్పుడున్న రాజకీయ వాతావరణానికి, సంస్కారానికి భిన్నంగా, మెరుగుగా ఉంటున్నాయి. అతని రాజకీయ అభిప్రాయాలు సమాజంలోను, రాజకీయాలలోను పెద్దమార్పులు తెచ్చేటంతటి తీవ్రమైనవేమీ కావు. కానీ, ఇప్పుడు సర్వే సర్వత్రా లోపించిన హుందాతనం, నిగ్రహవచనం, సామాజిక అవగాహన వంటివి రాహుల్ గాంధీ సరళిలో కొంత మాత్రమైనా కనిపిస్తుంటాయి. అతని తరం వారంటూ, రాహుల్‌తో కలిపి వినిపించే పేర్ల నాయకులను చూడండి, అధికార పీఠానికి కాస్త ఎడంగా నిరీక్షించవలసి వచ్చేసరికి పార్టీ మారడానికే సిద్ధపడుతున్నారు. దురదృష్టవశాత్తూ, ప్రత్యర్థి రాజకీయ పక్షాలు రాహుల్‌ను విమర్శించడానికి అపరిపక్వత అన్న గుణాన్ని ఆపాదిస్తూ వస్తున్నాయి. మీడియా కూడా అదే కోవలో రాహుల్ గాంధీని ఇంకా సిద్ధం కాని నాయకుడిగానే చూస్తుంటుంది, వ్యాఖ్యానిస్తుంటుంది. ఆ ప్రచారం ఎంతగా బలపడిపోయిందంటే, రాహుల్ గాంధీ మాట్లాడే మంచిమాటలు కూడా ఏ గుర్తింపునకూ నోచుకోవు.


రాజీవ్ గాంధీ మరణించి ఇప్పటికి 29 సంవత్సరాలు. శుక్రవారంనాడు ఆయన 76వ జయంతి. రాజకీయాల్లో సుమారు పదేళ్లు, ప్రధానిగా ఐదేళ్లు మాత్రమే ఉన్న రాజీవ్ గాంధీ, నెహ్రూ, ఇందిర వలె గాఢమైన ప్రభావాన్ని భారతీయ సమాజం మీద వేయలేదు. ఇంగువ కట్టిన గుడ్డ వంటి గాంధీ-నెహ్రూ వంశ ప్రతిష్ఠ తప్ప, ఆ కుదురు నుంచి వచ్చిన నేత అయితేనే ఏకతాటి మీద నడపగలడనుకునే విధేయ అనుచర గణం తప్ప రాహుల్ గాంధీ దగ్గర ఏమీ లేదు. తక్కినదంతా అలవరచుకోవలసిందే, నేర్చుకోవలసిందే, మెప్పించవలసిందే. దురదృష్టవశాత్తు, రాహుల్ గాంధీ ఆశ్రయించిన పద్ధతులు ప్రజలను రంజింపజేయలేకపోతున్నాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ప్రజలలో కూడా రకరకాల మార్పులు వస్తాయి. తమకు తగ్గ నేతను వారు ఎంపిక చేసుకుంటారు. ఆ నేత, ఆ జనత- కలిసి ఒక కాలంలోని సభ్యతను, ప్రజాస్వామ్యాన్ని సూచిస్తారు. 


తాజాగా, రాహుల్ గాంధీ ఒక విడియో ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభ కాలం తేగల ప్రమాదాలను తాను ముందే హెచ్చరించానని, మీడియా తనను హేళన చేసిందని, తన మాటలే నిజం కానున్నాయని ఆయన ఆ ట్వీట్లో వ్యాఖ్యానించారు. నిజమే. వైరస్, దాని వ్యాప్తి, దాని వల్ల కలిగే తక్షణ ప్రమాదాల గురించి కాకుండా, ఇదంతా కలిసి ఒక ఉపాధి సంక్షోభానికి దారితీస్తుందని దానిని దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేయాలని ఆయన అప్పట్లో హెచ్చరించారు. జాతీయ స్థాయిలో ఒక పెద్ద పార్టీ నాయకుడు ఇటువంటి హెచ్చరిక చేసినప్పుడు ప్రభుత్వం దానిని తీవ్రంగా పరిగణించాలి. దేశవ్యాప్తంగా వైరస్ కట్టడి వ్యూహం మొదట్లో సవ్యంగానే నడిచినట్టు అనిపించినా, రెండు దఫాల లాక్‌డౌన్‌్‌ తరువాత, చెదిరిపోయింది. కేంద్రం అవసరమైన సాయాన్ని రాష్ట్రాలకు చేయకపోవడంతో, రాష్ట్రాలు తమ వనరులకు లోబడి, తమకు తోచిన పద్ధతులు అనుసరించడం మొదలుపెట్టాయి. లెక్కలను మాయ చేయడం దేశవ్యాప్తంగా, కేంద్రస్థాయిలో కూడా సాగుతోంది. పూర్తి లాక్‌డౌన్‌్‌ల ఘట్టం ముగిసినప్పటికీ, అనంతర దశలో కూడా అనేక ఉపాధులు తిరిగి ప్రారంభం కాలేదు. అనేక వ్యాపారాలు కోలుకోలేదు. బ్యాంకులు ఇచ్చే మారటోరియం ముగిసిపోతే, ఎటువంటి పరిణామాలను చూడవలసి వస్తుందో తెలియదు. ఎన్ని కోట్ల ఉద్యోగాలు, ఎన్ని భవిష్యత్తులు.. ఇదే విషయాన్ని రాహుల్‌ గాంధీ తాజా ట్వీట్లో ప్రస్తావించారు. దేశానికి సంబంధించిన అసలైన సమస్యలను ప్రస్తావించే గుణం వామపక్షాలలో ఉండేది. ఇప్పటికీ వారు ఆ పని చేస్తారు కానీ, వారి గొంతు పీలగా మారింది, వారికి మీడియాలో స్థలం కుంచించుకుపోయింది. 


వంశపారంపర్యం, కుటుంబసంస్థ- వంటి విమర్శల నుంచి బయటపడాలని వృథా ప్రయత్నం చేయడం కంటె, కష్టమో నష్టమో పార్టీ సారథ్య భారాన్ని స్వీకరించడమే రాహుల్ కానీ, ప్రియాంకకు కానీ శ్రేయస్కరం. విచిత్రమూ విషాదమూ ఏమిటంటే, దేశానికి కూడా అదే వాంఛనీయం కావడం. కేవలం సారథ్యాన్ని స్వీకరించడమే కాదు, తాను తెచ్చుకున్న కొత్త తెలివిడులను పార్టీలో కొంతవరకైనా ప్రసరింపజేసి, దృఢమైన, అదే సమయంలో మృదువైన వ్యక్తిత్వంతో నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తే, పార్టీకి కొంత మేరకు జవసత్వాలను తేవడం కష్టం కాకపోవచ్చు. ఏకపక్షంగా, దాదాపు ఏకస్వామ్యం వలె సాగుతున్న పాలనలో మరోమాటకు ఆస్కారం లేకపోవడం అన్యాయంగా ఉన్నది. మంచి అధికారపక్షం లేకున్నా, మంచి ప్రతిపక్షమైనా ఉండాలి కదా?

Updated Date - 2020-08-21T06:05:53+05:30 IST