రాహుల్‌,కేటీఆర్‌ కలిసి నడవగా..

ABN , First Publish Date - 2022-06-28T07:53:07+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

రాహుల్‌,కేటీఆర్‌ కలిసి నడవగా..

రాష్ట్రపతి ఎన్నికలకు యశ్వంత్‌ నామినేషన్‌


శరద్‌ పవార్‌, అఖిలేశ్‌, ఏచూరి సహా

విపక్షాల అగ్ర నేతలంతా హాజరు

పార్టీ ఎంపీలతో కలిసి వచ్చిన కేటీఆర్‌

కేసీఆర్‌కు కృతజ్ఞతలన్న యశ్వంత్‌ మద్దతు వెనక మతలబు? కాంగ్రెస్‌తో కలవబోమన్న టీఆర్‌ఎస్‌

చివరికి నామినేషన్‌లో రాహుల్‌తో  వేదిక పంచుకున్న మంత్రి కేటీఆర్‌

తటస్థంగా ఉంటే బీజేపీకి సహకరించిందనే ఆరోపణలొస్తాయనే


న్యూఢిల్లీ, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి విపక్షాల అగ్ర నేతలు రాహుల్‌గాంధీ (కాంగ్రెస్‌), శరద్‌ పవార్‌ (ఎన్‌సీపీ), అఖిలేశ్‌ యాదవ్‌ (సమాజ్‌వాదీ), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌) హాజరయ్యారు. నిన్నటి వరకు తమ వైఖరి చెప్పని టీఆర్‌ఎస్‌ ఎట్టకేలకు సిన్హాకు మద్దతు ప్రకటించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కూడా నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన రాహుల్‌ వెంటే ఉన్నారు. అయితే తొలుత మద్దతు ప్రకటించిన ఝార్ఖండ్‌ పాలక పక్షం ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతలు డుమ్మా కొట్టడం గమనార్హం. గిరిజన నాయకురాలు, ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ అయిన ద్రౌపది ముర్మును ఎన్‌డీఏ తన అభ్యర్థిగా నిలపడం.. సీఎం-జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌ కూడా

 ఆమెలాగే సంతాలీ గిరిజన తెగకు చెందినవారు కావడం.. ఆమెకు మద్దతివ్వకుంటే గిరిజనులు తనకు దూరమవుతారన్న గుంజాటనతో ఆయన ఎవరికి మద్దతివ్వాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కూడా ఎవరినీ పంపలేదు. హాజరైన వారిలో మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ (కాంగ్రెస్‌), అభిషేక్‌ బెనర్జీ, సౌగతా రాయ్‌ (టీఎంసీ), ప్రఫుల్‌ పటేల్‌ (ఎన్‌సీపీ), తిరుచి శివ, ఎ.రాజా (డీఎంకే), సీతారాం ఏచూరి(సీపీఎం), డి.రాజా(సీపీఐ), జయంత్‌ చౌధరి (ఆర్‌ఎల్‌డీ), మీసా భారతి(ఆర్‌జేడీ), ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌(ఆర్‌ఎ్‌సపీ), మొహమ్మద్‌ బషీర్‌(ఐయూఎంఎల్‌), ఆర్జేడీ, ఆర్‌ఎ్‌సపీ, వీసీకే, శివసేన, ఏయూడీఎఫ్‌ పార్టీల నేతలు ఉన్నారు. రిటర్నింగ్‌ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి యశ్వంత్‌ నాలుగు సెట్ల పత్రాలను సమర్పించారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు నివాళులు అర్పించారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. బీజేపీలోని పాత మిత్రులను కలిసి మద్దతు కోరతానని చెప్పారు. ఎన్‌డీఏ అభ్యర్థిగా గిరిజనురాలైన ద్రౌపదిని ఖరారుచేశామని బీజేపీ గొప్పలు చెప్పుకొంటోందని.. కానీ మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఏం చేసిందని ప్రశ్నించారు. ‘‘ప్రస్తుత రాష్ట్రపతి కూడా ఒక వర్గానికి చెందినవారు. మరి ఆ వర్గం ప్రయోజనం పొందిందా? రాష్ట్రపతి ఎన్నికలు సంపూర్ణాధికార సిద్ధాంతానికి, స్వేచ్ఛా సిద్ధాంతానికి జరుగుతున్న పోరాటం. నేను ఉన్న బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండేది. మోదీ హయాంలో అది లేదు’’ అని విమర్శించారు. కాగా, మంగళవారం తమిళనాడు నుంచి యశ్వంత్‌ సిన్హా ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. తొలి విడతలో కేరళ, కర్ణాటకల్లో పర్యటిస్తారు.


అప్పుడు కాదని...

యశ్వంత్‌ సిన్హా నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో కలిసి టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ పాల్గొనడం విశేషం. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్‌ పాల్గొంటుందన్న కారణంగానే టీఆర్‌ఎస్‌ దానికి హాజరు కాలేదు. ఆ తర్వాత సిన్హా అభ్యర్థిత్వం ఖరారైన రోజు శరద్‌పవార్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలోనూ టీఆర్‌ఎస్‌ భాగం పంచుకోలేదు. అలాంటిది అకస్మాత్తుగా నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నేతలు హాజరవ్వడం పట్ల ఢిల్లీ రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి కేటీఆర్‌ పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. అప్పటికే ఇతర విపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) కార్యాలయంలో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ నేతలు సీపీపీకి వెళ్లకుండా నేరుగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్దకు వెళ్లి బయట వేచి ఉన్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ శుక్లా స్వయంగా వచ్చి సీపీపీలో జరుగుతున్న సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దాంతో కేటీఆర్‌ రాకుండా నామా నాగేశ్వరరావు, వెంకటేశ్‌ నేతలను పంపించారు. అనంతరం విపక్ష నేతలంతా కలిసి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చారు. నామినేషన్‌ దాఖలు తర్వాత పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సిన్హా నివాళులర్పించినప్పుడు ‘‘మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మద్ధతిచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పండి’’ అని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్‌ టీఆర్‌ఎస్‌ నేతలతో అన్నారు. కేటీఆర్‌ను సౌగతరాయ్‌కి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిచయం చేస్తూ...  ‘‘ఈయన కేటీఆర్‌... కేసీఆర్‌ కుమారుడు.


రైజింగ్‌ స్టార్‌’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించే సమయంలో ‘‘మద్ధతిచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు హాజరైనందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని కేటీఆర్‌తో కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌, సుధీంద్ర కులకర్ణి అన్నారు. ‘‘ఢిల్లీలో ఇంతటి ఎండ వేడిని ఎలా తట్టుకుంటున్నారు? చాలా వేడిగా ఉంది’’ అని జైరాం రమేశ్‌తో కేటీఆర్‌ అనగా... ‘‘ఢిల్లీలో కంటే తెలంగాణలో చాలా వేడి ఉంది(రాజకీయ వేడి అన్న ఉద్దేశం)’’ అని జైరాం నవ్వుతూ బదులిచ్చారు. కాగా, ముఖ్య నేతల ఆహ్వానం మేరకు ప్రచార కమిటీ కార్యాలయానికి వెళ్లి సిన్హాతో మంతనాలు జరిపిన కేటీఆర్‌.. హైదరాబాద్‌ రావాలని ఆహ్వానించారు. కాగా, యశ్వంత్‌ సిన్హాకు ఎంఐఎం మద్దతు పలికింది. ఆ పార్టీకి మూడు రాష్ట్రాల్లో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 


సిద్ధాంతాల పోరాటం

రాష్ట్రపతి ఎన్నికలు.. సిద్ధాంతాల మధ్య పోరాటమని రాహుల్‌గాంఽధీ వ్యాఖ్యానించారు. ఆర్‌ఎ్‌సఎస్‌ విద్వేష సిద్ధాంతానికి, విపక్షాల సహానుభూతి సిద్ధాంతానికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. విపక్షమంతా సిన్హాకు అండగా నిలబడుతోందని చెప్పారు. 


సిన్హా ప్రచార కమిటీ సభ్యుడిగా రంజిత్‌రెడ్డి 

దేశవ్యాప్తంగా రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ప్రచారం నిర్వహణకు విపక్షాలు కమిటీని ఏర్పాటు చేశాయి. 11 మంది నేతలతో ఏర్పాటు చేసిన కమిటీలో టీఆర్‌ఎస్‌ ఎంపీ రజింత్‌రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌, డీఎంకే నేత తిరుచ్చి శివ, టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ నేత రాంగోపాల్‌ యాదవ్‌, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, పౌర సమాజం నుంచి సుధీంద్ర కులకర్ణి, శివసేన నుంచి ఒక ప్రతినిధితో ప్రచార కమిటీ ఏర్పాటైంది. 

Updated Date - 2022-06-28T07:53:07+05:30 IST