Bilkis Bano Case: మోదీ మాటలకు చేతలకు పొంతన ఉండదు: రాహుల్

ABN , First Publish Date - 2022-08-17T21:03:26+05:30 IST

బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసుకుని..

Bilkis Bano Case: మోదీ మాటలకు చేతలకు పొంతన ఉండదు: రాహుల్

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో (Bilkis Bano) కేసులో దోషులను విడుదల చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (Narendra Modi) టార్గెట్‌ చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) విమర్శలు గుప్పించారు. మోదీ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండదనే విషయం యావద్దేశం చూసిందని అన్నారు. దోషులను విడుదల చేసే ఇలాంటి నిర్ణయాల  ద్వారా ఈ దేశ మహిళలకు ప్రధాని ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారని ఆయన ప్రశ్నించారు. 2002లో గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై అత్యాచారం జరిపి, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన కేసులో దోషులుగా నిర్ధారించిన 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం శిక్షాకాలం తగ్గిస్తూ విడుదల చేసింది.


దీనిపై రాహుల్ ఓ ట్వీట్‌లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ''ఐదు నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, మూడేళ్ల ఆమె కుమార్తెను చంపిన వారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలో విడుదల చేశారు. నారీ శక్తి గురించి అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఈ చర్య ద్వారా మహిళలకు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నారు. మోదీజీ...మీ మాటలకు చేతలకు పొంతన ఉండదనే విషయం యావద్దేశం చూసింది'' అని హిందీలో ట్వీట్ చేశారు. బిల్కిస్ బానో కేసులో దోషులు 15 ఏళ్ల జైలుశిక్ష తర్వాత సోమవారం గుజరాత్‌లోని గోద్రా సబ్ జైలు నుంచి విడుదల కాగానే వారికి స్వీట్లు, పూలదండలతో స్వాగతం లభించింది.


Updated Date - 2022-08-17T21:03:26+05:30 IST