అమరీందర్‌ను తప్పించిన కారణం రాహుల్ చెప్పారు: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2021-12-13T02:32:01+05:30 IST

కాంగ్రెస్‌లోని సీనియర్ నేతల్లో అసంతృప్తులు బాగానే ఉన్నాయని నేను అడిగినప్పుడు, పార్టీలో సినియర్లకు తగిన గౌరవమే ఉందని సమాధానం ఇచ్చారు. అసంతృప్తిగా ఉన్న ఇద్దరు నేతల పేర్లు చెప్పమని రాహుల్ నన్ను అడిగారు. నేను అమరీందర్ పేరు చెప్పాను...

అమరీందర్‌ను తప్పించిన కారణం రాహుల్ చెప్పారు: సంజయ్ రౌత్

ముంబై: కాంగ్రెస్ పార్టీలో సినియర్లకు చాలా గౌరవమిస్తున్నారని, అయితే సీనియర్లే పరిస్థితులను అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తనతో చెప్పినట్లు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. శివసేన పత్రిక ‘సామ్నా’లో తాజాగా తన కాలం ‘రోక్‌తక్’లో ఢిల్లీలో రాహుల్, ప్రియాంకలను కలిసినప్పుడు తనతో పంచుకున్న అనుభవాలను చెప్పుకొచ్చారు.


‘‘కాంగ్రెస్‌లోని సీనియర్ నేతల్లో అసంతృప్తులు బాగానే ఉన్నాయని నేను అడిగినప్పుడు, పార్టీలో సినియర్లకు తగిన గౌరవమే ఉందని సమాధానం ఇచ్చారు. అసంతృప్తిగా ఉన్న ఇద్దరు నేతల పేర్లు చెప్పమని రాహుల్ నన్ను అడిగారు. నేను అమరీందర్ పేరు చెప్పాను. పంజాబ్‌లో అమరీందర్ వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పడిపోయిందని, అమరీందర్ కంటే సీఎం రేసులో లేని వ్యక్తులను సీఎంగా ఆమోదించేందుకు ఎక్కువ మంది ప్రజలు సముఖంగా ఉన్నట్లు తాము చేసిన సర్వేలో తెలిసిందని, అందుకే అమరీందర్‌ను పిలిచి పరిస్థితి వివరించి తప్పించాల్సి వచ్చిందని రాహుల్ నాతో అన్నారు’’ అని రౌత్ రాసుకొచ్చారు.


ఇక గులాంనబీ ఆజాద్ గురించి రాహుల్‌ని అడిగినప్పుడు.. ఆజాద్ పార్టీలో అనేక కీలక పదువులు చేపట్టారని, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌ వెళ్లి అక్కడ పార్టీ బాధ్యతలు తీసుకుని మళ్లీ సీఎం అవ్వమని ఆజాద్‌కు రాహుల్ చెప్పినట్లు రాహుల్ తనతో చెప్పాడని రౌత్ రాసుకొచ్చారు. అయితే జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ పడిపోయిందని, తాను అక్కడికి వెళ్లలేనని రాహుల్‌తో చెప్పారట. ‘‘జమ్మూ కశ్మీర్‌లో ఆజాద్ నిర్వహించే ర్యాలీలకు జనాలు బాగానే వస్తున్నారు. మరి కశ్మీర్‌లో కాంగ్రెస్ లేదనడం కరెక్ట్ కాదు. రాహుల్ చెప్పినట్లు ఇది సీనియర్ల లోపమే. దీనికి రాహుల్ కూడా ఏమీ చేయలేకపోవచ్చు’’ అని రౌత్ తన కాలంలో రాసుకొచ్చారు.

Updated Date - 2021-12-13T02:32:01+05:30 IST