తత్కాల్‌.. తంటా

ABN , First Publish Date - 2022-06-26T05:41:58+05:30 IST

గుంటూరు రైల్వే జంక్షన్‌ మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో ఇక్కడి ప్రయాణికులకు తత్కాల్‌ కోటా అందుబాటులో లేకుండా పోయింది.

తత్కాల్‌.. తంటా

ప్రధాన రైళ్లలో గుంటూరుకి తత్కాల్‌ కోటా ఇవ్వని రైల్వే శాఖ

మూడు ఎక్స్‌ప్రెస్‌లకు ఎగువ స్టేషన్ల నుంచి బుకింగ్‌ చేసుకోవాల్సిందే

పల్నాడులో 2ఎస్‌కి అసలు తత్కాల్‌ కోటానే లేదు

కోటా పెంచాలని కోరుతున్న రైల్వే ప్రయాణికులు


గుంటూరు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): గుంటూరు రైల్వే జంక్షన్‌ మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో ఇక్కడి ప్రయాణికులకు తత్కాల్‌ కోటా అందుబాటులో లేకుండా పోయింది. సికింద్రాబాద్‌ నుంచే బయలుదేరే కొన్ని రైళ్లకు సత్తెనపల్లి వరకే తత్కాల్‌ కోటా ఉంది. అక్కడి నుంచి దిగువకు లేకపోవడంతో ప్రయాణికులు ఎగువ స్టేషన్లలో బుకింగ్‌ చేసుకొని రైలు ఎక్కే స్టేషన్‌ పేరు మార్చుకోవాల్సి వస్తోంది.  ఇంటర్‌ సిటీ, జన్మభూమి వంటి ఎక్స్‌ప్రెస్‌లలో సెకండ్‌ సిట్టింగ్‌కి తత్కాల్‌ కోటా ఉండగా ఆ సౌకర్యం పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో లేకపోవడం  అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

గుంటూరు నుంచి తిరువనంతపురం సెంట్రల్‌కి నిత్యం నడిచే ఏకైక రైలు శబరి ఎక్స్‌ప్రెస్‌. ఈ రైలు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. తిరువనంతపురానికి గుంటూరు నుంచి తత్కాల్‌ కోటా లేదు. ఎవరైనా బుకింగ్‌ చేసుకోవాలంటే సత్తెనపల్లి కంటే ఎగువ స్టేషన్ల నుంచి ప్రయత్నించుకోవాలి. అలానే సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు మీదగా హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కి కూడా ఇదే పరిస్థితి. ఈ రైలుకు సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్లలో మాత్రమే తత్కాల్‌ కోటా ఉంది. రాయగడ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరుకు వచ్చినా తత్కాల్‌ కోటా మాత్రం సింహభాగం విజయవాడ డివిజన్‌కే పరిమితమైంది. నిబంధనల ప్రకారం ఏ రైలులోనైనా 30 శాతం టిక్కెట్‌లు తత్కాల్‌ కోటాలో అట్టిపెట్టాలి. అలాంటిది రాయగడ ఎక్స్‌ప్రెస్‌కి గుంటూరు నుంచి కేవలం 22 స్లీపర్‌క్లాస్‌ బెర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిత్యం సాయంత్రం వేళ కాచిగూడ బయలుదేరే ఎక్స్‌ప్రెస్‌ రైలులోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వారానికి రెండుసార్లు గుంటూరు మీదగా నాగర్‌సోల్‌ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లోనూ గుంటూరుకి తత్కాల్‌ కోటా లేదు. ఈ రైలుకు టిక్కెట్లను మంగళగిరి, దాని ఎగువ స్టేషన్ల నుంచి బుకింగ్‌ చేసుకోవాల్సిందే. 

పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కి ఉండేది 2ఎస్‌, సీసీ రిజర్వుడ్‌ భోగీలు మాత్రమే. ఇందులో సీసీ బోగీకి తత్కాల్‌ కోటా పెట్టి 2ఎస్‌కి లేకుండా చేశారు. డివిజన్‌ మీదగా రాకపోకలు సాగించే జన్మభూమి, ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు తత్కాల్‌ కోటా ఉన్నప్పుడు పల్నాడుకు ఎందుకు ఉంచరని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వీటన్నింటిపై డివిజనల్‌ రైల్వే యూజర్స్‌ అసోసియేషన్‌ నాయకులు సికింద్రాబాద్‌ హెడ్‌ క్వార్టర్స్‌ అధికారులకు నివేదించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పులు జరగలేదు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే జెడ్‌ఆర్‌యూసీసీ సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించారు. 

 

Updated Date - 2022-06-26T05:41:58+05:30 IST