స్వయంగృహాపరాధం

ABN , First Publish Date - 2020-10-24T10:15:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాలకు పట్టాల పథకాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, ఇళ్ల అవకాశాలను మినహాయించి ..

స్వయంగృహాపరాధం

జిల్లాలో 64వేల పట్టణ ఇళ్లకు మంగళం

నవశకం సర్వేలో పేదలు స్థలాలనే కోరుకున్నారట..

 సాకు చూపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

వాస్తవానికి.. ప్రభుత్వ వాటా భరించలేకే.. 

జూ ఇళ్లు ఇస్తే వద్దనే పేదలుంటారా?


ఇల్లు ముఖ్యమా?, ఇంటి స్థలం ముఖ్యమా? అంటే పేదలెవరైనా ఇల్లే ముఖ్యమంటారు. ఎందుకంటే స్థలంతో కూడిన ఇల్లు సమకూరుతుంది కాబట్టి. స్థలం ఇచ్చినా.. తర్వాత ఇల్లు కట్టుకోవాలి. అదేదో ఇల్లే వస్తే ఏ సమస్య ఉండదు కదా.. సాధారణంగా అందరూ అనుకునేదే ఇది. ఇదేం చిత్రమో తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి కంటే కూడా స్థలానికే ప్రాధాన్యతనిచ్చి పేదల ఇళ్ల అవకాశాన్ని దెబ్బతీసింది. ఈ కారణంగా జిల్లాలో 64,714 ఇళ్లు రద్దయ్యాయంటే నమ్మితీరాల్సిందే.


విజయవాడ, ఆంధ్రజ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాలకు పట్టాల పథకాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, ఇళ్ల అవకాశాలను మినహాయించి మిగిలిన వారికి పట్టాలు ఇస్తే బాగుండేది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకం కాబట్టి దీనిని కొనసాగించ కూడదు అనుకుందేమో తెలియదు కానీ.. ప్రభుత్వ నిర్వాకం కారణంగా జిల్లాలో 64వేల మందికి గృహయోగం తప్పింది. ఈ ఇళ్ల కోసం ముందుగా ఎంపికైన లబ్ధిదారులను తిరిగి ఇంటి స్థలాలకు ఎంపిక చేయటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 


ఎందుకిలా..

ఇంటి స్థలం ఇవ్వడం తమ ప్రభుత్వ ఘనతగా మార్చుకోవడం కోసమే.. ఇంత భారీసంఖ్యలో టిడ్కో ఇళ్లను తప్పించారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కేంద్రంలో మారలేదు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన్‌ (పీఎంఏవై) పథకం కొనసాగుతోంది. జిల్లాలో పట్టణ ప్రాంతాలకు మంజూరుచేసిన 96,138 ఇళ్లను పూర్తి చేయటానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇళ్లు రద్దు చేస్తున్నట్టు కేంద్రం ఎక్కడా ప్రకటించలేదు. మిగులు ఇళ్లను కట్టుకునే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే పట్టణ ఇళ్లను తగ్గించుకోవటం విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటానికే పేదల ఇళ్లను కాలదన్ను కుంటున్నారని తెలుస్తోంది.


ఆర్థిక భారమా..?

జిల్లాలో టైప్‌1, 2, 3 విధానాల్లో ఇళ్లను నిర్మించటానికి కిందటి ప్రభుత్వం నిర్ణయించింది. టైప్‌-1లో 300 చదరపు అడుగుల ఇంటిని నిర్మించటానికి యూనిట్‌ వ్యయం రూ.6.65 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 లక్షలు చెల్లించాలి. లబ్ధిదారుడు రూ.2.60 లక్షలు భరించాలి. టైప్‌-2లో 365 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటికి యూనిట్‌ వ్యయం రూ.7.65 లక్షలు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, లబ్ధిదారుడి వాటాగా రూ.3.65 లక్షలు చెల్లించాలి. టైప్‌-3లో 430 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటికి యూనిట్‌ వ్యయంగా రూ.8.65 లక్షలు నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 లక్షలు, లబ్ధిదారుడి వాటాగా రూ.4.65 లక్షలు చెల్లించాలి. లబ్ధిదారుడి వాటాను బ్యాంకుల నుంచి ఇప్పించేందుకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.2.50 లక్షలు పెట్టుకోవటం ఆర్థిక భారంగా భావించటం వల్ల ఇళ్లను వదులుకున్నారా? అన్నది  చర్చనీయాంశమైంది. 


నవశకం సర్వేలో తేలిన నిజమట..!

దీనికి గల కారణాన్ని కూడా లబ్ధిదారులపైనే వేస్తున్నారు. నవశకం సర్వేలో భాగంగా లబ్ధిదారులు ఇంటి స్థలానికే ఓటు వేశారనే వాదనలు తెచ్చారు. అసలు ఇల్లు వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఇంటి స్థలం కావాలని కోరుకుని ఉండొచ్చు. ఇల్లు నిర్మించి ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 


రద్దయిన పట్టణ ప్రాంత ఇళ్లు ఇవీ..

జిల్లావ్యాప్తంగా పట్టణ ప్రాంత ఇళ్లకు సంబంధించి చూస్తే.. జక్కంపూడిలో 55,800 ఇళ్లను మంజూరు చేస్తే, ఇందులో 10,624 ఇళ్లే గ్రౌండింగ్‌ అయ్యాయి. మిగిలిన వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. గుడివాడ డివిజన్‌లో 3వేల ఇళ్లను రద్దు చేసుకుంది. మచిలీపట్నంలో 5వేల ఇళ్లు రద్దయ్యాయి. 

Updated Date - 2020-10-24T10:15:37+05:30 IST