నల్లపాడు - పేరేచర్ల సెక్షన్‌.. రైల్వే డబ్లింగ్‌ పూర్తి

ABN , First Publish Date - 2020-12-04T05:15:35+05:30 IST

గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టులో భాగమైన నల్లపాడు - పేరేచర్ల సెక్షన్‌ పనులు పూర్తి అయ్యాయి.

నల్లపాడు - పేరేచర్ల సెక్షన్‌.. రైల్వే డబ్లింగ్‌ పూర్తి

  క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన సీఆర్‌ఎస్‌


గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టులో భాగమైన నల్లపాడు - పేరేచర్ల సెక్షన్‌ పనులు పూర్తి అయ్యాయి. ఈ మార్గంలో గుంటూరు నుంచి సాతులూరు వరకు డబ్లింగ్‌ ప్రాజెక్టు పూర్తి అ యింది. అలానే డోన్‌ - పెండేకల్లు సెక్షన్‌ కూడా పూర్తి అయింది. ఇలా దశ లవారీగా ప్రాజెక్టు మొత్తం త్వరితగతిన పూర్తి చేసి రన్నింగ్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రైల్వేవర్గాలు తెలిపాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌మాల్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నాయి. దక్షిణ మధ్య రైల్వేలోనే గుంటూరు - గుంతకల్లు మార్గం పురాతనమైనది. మొదట్లో సరుకు రవాణాకు, ఆ తర్వాత ప్యాసింజర్‌ సర్వీసులకు ఈ మార్గాన్ని వినియోగిస్తూ వస్తున్నారు. అలానే ప్రశాంతి, అమరావతి, కొండవీడు తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు పలు ప్యాసింజర్‌ సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ మార్గాన్ని 2018-19 సంవత్సరంలో విద్యుద్ధీకరణ పూర్తి చేశారు. క్రాసింగ్స్‌ వల్ల రైళ్ల సమయపాలన దెబ్బతింటుండటంతో డబ్లింగ్‌ ప్రాజెక్టుని రైల్వే శాఖ మంజూరు చేసింది. మొత్తం 404 కిలోమీటర్ల పొడవునా రెండో మార్గం నిర్మించేందుకు 3,887 కోట్ల నిధులు మంజూరు చేసింది.

 

మార్చిలో 28 కిలోమీటర్ల పూర్తి

తొలి దశలో పేరేచర్ల - సాతులూరు మధ్యన 24 కిలోమీటర్లు, డోన్‌ - పెండేకల్లు సెక్షన్‌ 28 కిలోమీటర్ల డబ్లింగ్‌ని ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. నల్లపాడు - పేరేచర్ల మధ్యన 7.8 కిలోమీటర్ల పొడవునా పనులను లాక్‌డౌన్‌ సమయంలో వేగవంతం చేసి పూర్తి చేశారు. తాజాగా ఈ మార్గంలో రైళ్లని మళ్లించి సీఆర్‌ఎస్‌ ఇన్‌స్పెక్షన్‌ పూర్తి చేయించారు. దాదాపుగా 120 కిలోమీటర్ల వేగంతో రైలుని నడిపి స్పీడ్‌ టెస్టు కూడా చేసి సీఆర్‌ఎస్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. ఈ మార్గం ద్వారా కర్ణాటక రాష్ట్రంతో పాటు రాజధాని బెంగళూరుతో నేరుగా అనుసంధానం కావడం వల్ల గుంటూరు/విజయవాడ ప్రాంతంలో రైళ్ల రాకపోకల సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా జీటీ లైనులో రైళ్ల రద్దీని తగ్గించి ఇటువైపునకు మళ్లించవచ్చు. నల్లపాడు - పేరేచర్ల సెక్షన్‌ పూర్తి అయినందుకు గుంటూరు రైల్వే డివిజనల్‌ వర్గాలను జీఎం మాల్య ప్రత్యేకించి అభినందించారు. 


Updated Date - 2020-12-04T05:15:35+05:30 IST