రైల్వే వంతెనకు పగుళ్లు

ABN , First Publish Date - 2021-12-25T14:00:25+05:30 IST

వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని తిరువలం ప్రాంతంలోని పెన్నారు నదిపై నిర్మించిన రైల్వే వంతెనకు రెండు స్తంభాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. రైల్వే సిబ్బంది దీనిని సకాలంలో గుర్తించడంతో పెనుప్రమాదం

రైల్వే వంతెనకు పగుళ్లు

- సుమారు 50 రైళ్లు రద్దు

- నేడు, రేపు కూడా రాకపోకలకు అంతరాయం


వేలూరు/ప్యారీస్‌(చెన్నై): వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని తిరువలం ప్రాంతంలోని పెన్నారు నదిపై నిర్మించిన రైల్వే వంతెనకు రెండు స్తంభాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. రైల్వే సిబ్బంది దీనిని సకాలంలో గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ కారణంగా ఈ మార్గంలో  సుమారు 50 రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ రైళ్లలో ప్రయాణం చేసేందుకు ముందుగానే టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకున్న వారికి నగదు వాపసు చేయనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శని, ఆదివారాల్లో కూడా పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణరైల్వే పేర్కొంది. కాట్పాడి- తిరువలం మధ్య ఉన్నపాలారు రైల్వే వంతెన మార్గంలో రైల్వే గ్యాంగ్‌మెన్‌లు గురువారం మధ్యాహ్నం పరిశీలిస్తుండగా పెన్నారు నదిపై బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన వంతెన కింద ఉన్న 38-39 స్తంభాలపై ఏర్పడిన పగుళ్లను గుర్తించారు. వెంటనే వారు కాట్పాడి రైల్వే అధికారులకు తెలియజేయడంతో ఆ మార్గం మీదుగా నడిపే రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. అధికారులు, ఇంజనీర్లు హుటాహుటిన అక్కడకు చేరుకొని పగుళ్లను పరిశీలించారు. అనంతరం ఒక ట్రాక్‌పై మాత్రమే రైళ్లు వెళ్లేందుకు అనుమతించడంతో రైళ్లన్నీ సుమారు 4 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. దీంతో, సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికెళ్లాల్సిన ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తొలివిడతగా వంతెన కింద ప్రవహిస్తున్న నీటిని రైల్వే ఇంజనీర్లు, సిబ్బంది దారి మళ్లించారు. ఆ తర్వాత అందులో ఉన్న కాంక్రీట్‌ పిల్లర్లకు మరమ్మతులు ప్రారంభించారు. దీనికారణంగా తిరువలం రైల్వే వంతెనపై ఒక ట్రాక్‌పై మాత్రమే అది కొద్ది రైళ్లను నడుపుతున్నారు. 



Updated Date - 2021-12-25T14:00:25+05:30 IST