రూ.1000 కోట్లతో రాష్ట్రంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ

ABN , First Publish Date - 2022-05-26T08:47:20+05:30 IST

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌ రైల్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర

రూ.1000 కోట్లతో రాష్ట్రంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ

స్టాడ్లర్‌ రైల్‌, మేధో సర్వో కలిసి ఏర్పాటు.. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం 

2500 మందికి ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్‌.. దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో భేటీ 

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌ రైల్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో ఉన్న మంత్రి కే తారకరామారావు తెలిపారు. మేధా సర్వో డ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో కలిసి స్టాడ్లర్‌ రైల్‌ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందం మేరకు వచ్చే రెండేళ్లలో తెలంగాణలో రూ.1000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు వివరించారు. ఈ కంపెనీ ఫ్యాక్టరీ స్థాపన తర్వాత తయారు చేసే రైల్వే కోచ్‌లను కేవలం భారతదేశం కోసం మాత్రమే కాకుండా ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ సైతం ఎగుమతి చేయనున్నట్లు సంస్థ తెలిపిందని మంత్రి వెల్లడించారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన స్టాడ్లర్‌ రైల్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ పెడుతున్న పెట్టుబడి ద్వారా 2500 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని తెలిపారు. తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న తమ యూనిట్‌ కంపెనీకి అత్యంత ప్రాధాన్యతగా మారబోతున్నదని కంపెనీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్స్‌ గార్డ్‌ బ్రోక్‌ మెయ్‌ తెలిపారు. తమ కంపెనీ ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అభివృద్థిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. 

ఫెర్రింగ్‌ ఫార్మా 60 మిలియన్ల యూరోల పెట్టుబడి

భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్‌ ఫార్మా ప్రకటించింది. క్రోన్‌, అల్సారేటివ్‌ కోలైటిస్‌ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే తన ట్రేడ్‌ మార్క్‌ పెంటసాను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేసేందుకు ఈ నూతన ప్లాంట్‌ను వినియోగించుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. బుధవారం మంత్రి కే. తారకరామారావు దావో్‌సలోని తెలంగాణ పెవిలియన్‌లో ఫెర్రింగ్‌ ఫార్మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అల్లేసండ్రో గీలియో, ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఫెర్రింగ్‌ ఫార్మా హైదరాబాద్‌లో తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కేవలం నెలరోజుల క్రితమే కంపెనీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభమైందని, ఇంత త్వరగా కంపెనీ అదనంగా మరో 60 మిలియన్ల యూరోల పెట్టుబడి పెట్టడం తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలకు నిదర్శనమన్నారు. 

రాష్ట్రంలో ష్నైడర్‌ ఎలెక్ర్టిక్‌ మరో యూనిట్‌ 

తెలంగాణలో మరో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ష్నైడర్‌ ఎలెక్ర్టిక్‌ బుధవారం ప్రకటించింది. మంత్రి కే తారక రామారావుతో దావో్‌సలో సమావేశమైన ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లుక్‌ రిమోంట్‌ ఈ మేరకు కంపెనీ తరఫున ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణలో తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోందని అన్నారు. ఈ కొత్త యూనిట్‌ ఏర్పాటుతో అదనంగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో భాగంగా బుధవారం మంత్రి కేటీఆర్‌ వివిధ కంపెనీల పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. 

Updated Date - 2022-05-26T08:47:20+05:30 IST