Indian Railways : రైలు ఛార్జీల్లో రాయితీల పునరుద్ధరణ ఇప్పట్లో ఉండదు : ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-07-21T01:14:07+05:30 IST

రైలు ఛార్జీల్లో రాయితీల వల్ల పెను భారం పడుతోందని, అందువల్ల గతంలో

Indian Railways : రైలు ఛార్జీల్లో రాయితీల పునరుద్ధరణ ఇప్పట్లో ఉండదు : ప్రభుత్వం

న్యూఢిల్లీ : రైలు ఛార్జీల్లో రాయితీల వల్ల పెను భారం పడుతోందని, అందువల్ల గతంలో ఉపసంహరించిన రాయితీల పునరుద్ధరణ జరుగుతుందని ఇప్పట్లో ఆశించవద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా వయోవృద్ధులు (Senior Citizens), క్రీడాకారులు (sportspersons) ఈ రాయితీల పునరుద్ధరణను సమీప భవిష్యత్తులో ఆశించవద్దని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ నుంచి ఈ రాయితీలను ఉపసంహరించిన సంగతి తెలిసిందే. వయోవృద్ధులకు టికెట్ ధరలో 40 శాతం రాయితీ ఉండేది. 


రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) పార్లమెంటు (Parliament)కు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో, రైల్వే ఛార్జీల్లో రాయితీల వల్ల సంస్థపై పెను భారం పడుతోందన్నారు. ఈ రాయితీల పునరుద్ధరణ త్వరలో జరుగుతుందని ఆశించవద్దని కోరారు. పెను సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, శారీరక సామర్థ్య లోపాలుగల నాలుగు వర్గాల వారికి, 11 వర్గాల్లోకి వచ్చే రోగులకు, విద్యార్థులకు రాయితీలను కొనసాగిస్తున్నామన్నారు. అయితే మిగిలినవారికి రాయితీలను పునరుద్ధరించడం వాంఛనీయం కాదన్నారు. 


2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో రిజర్వుడు, అన్ రిజర్వుడు కేటగిరీలలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు ఇవ్వడం వల్ల రైల్వేలు రూ.4,794 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలిపారు. రైలు టికెట్ ధరలు తక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికే ప్రయాణ వ్యయంలో 50 శాతం కన్నా ఎక్కువ మొత్తాన్ని రైల్వేలు భరిస్తున్నాయన్నారు. ఇది అందరు ప్రయాణికులకు వర్తిస్తుందన్నారు. 


కోవిడ్-19 (COVID-19) మహమ్మారి కారణంగా గడచిన రెండేళ్ళలో ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని 2019-20 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంతో పోల్చినపుడు తగ్గిపోయిందన్నారు. దీని ప్రభావం రైల్వేల ఆర్థిక పరిస్థితిపై దీర్ఘకాలం ఉంటుందన్నారు. రాయితీల మంజూరు ప్రభావం రైల్వేలపై భారీగా ఉంటుందని, అందువల్ల అన్ని వర్గాల ప్రయాణికులకు రాయితీలను వర్తింపజేయాలని కోరడం వాంఛనీయం కాదని అన్నారు. రైళ్లు, బెర్త్‌లలో అనేక రకాలు, వేర్వేరు టికెట్ ధరలు ఉన్నాయని, రాయితీలు లేకుండా కూడా తమకు నచ్చినవాటిని సీనియర్ సిటిజన్లు ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు. 


Updated Date - 2022-07-21T01:14:07+05:30 IST