రాయితీ ఇక రాదా.. రైలు ప్రయాణికుల ఎదురుచూపులు..!

ABN , First Publish Date - 2021-11-23T14:18:28+05:30 IST

రైల్వేలో కన్సెషన్‌ (రాయితీ) టికెట్లు ఇవ్వడం లేదు. గతంలో టికెట్‌ మొత్తంలో ....

రాయితీ ఇక రాదా.. రైలు ప్రయాణికుల ఎదురుచూపులు..!

  • కొవిడ్‌ ట్రైన్లు ఎత్తివేసినా అమలులోకి రాని పరిస్థితి
  • అధిక చార్జీలతో ఇబ్బందులు పడుతున్న సీనియర్‌ సిటిజన్లు 
  • ప్రత్యేక అవసరాలు కలిగిన వారికీ తిప్పలు

రైల్వేలో కన్సెషన్‌ (రాయితీ) టికెట్లు ఇవ్వడం లేదు. గతంలో టికెట్‌ మొత్తంలో 40 నుంచి 75 శాతం వరకు రాయితీ పొందిన వేలాది మంది ప్రస్తుతం పూర్తి భారం మోస్తున్నారు. ప్రధానంగా నిరుపేద వృద్ధులు ప్రయాణాలు చేయలేకపోతున్నారు.


హైదరాబాద్‌ సిటీ : దక్షిణ మధ్య రైల్వే ఒక్కో సదుపాయాన్ని మెల్లిమెల్లిగా ఎత్తివేస్తోంది. ఇప్పటికే ప్రైవేటీకరణ బాట పట్టిన రైల్వే.. రాయితీ టికెట్లను పూర్తిగా ఎత్తివేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్‌ సిటిజన్లు (పురుషులు-60, స్ర్తీలు-58 ఏళ్లు పైబడిన), దివ్యాంగులు, అంధులు, స్వాతంత్య్ర సమరయోధులు, కేన్సర్‌, తలసీమియా, హృద్రోగ, కిడ్నీ, ఎయిడ్స్‌, రాష్ట్రపతి అవార్డు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, వార్‌ విడోస్‌ (యుద్ధ వితంతులు), మీడియా కరస్పాండెంట్లతోపాటు ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రయాణ సమయంలో టికెట్లపై రాయితీ ఇచ్చేవారు. అన్ని సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. 110 కేటగిరీలకు చెందిన వారు రాయితీ పొందేవారు.


కొవిడ్‌ నేపథ్యంలో తొలగింపు..

కొవిడ్‌ నేపథ్యంలో 2020 మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు నిలిచిపోవడంతో రైల్వేశాఖ నిర్వహణ భారాలను తగ్గించుకుంటూ వస్తోంది. 2020 జూన్‌ రెండో వారం నుంచి పరిమిత సంఖ్యలో ప్రారంభించిన రైళ్ల నంబర్లకు ముందు ‘‘0’’ తగిలించి కొవిడ్‌ స్పెషల్‌ పేరు పెట్టింది. దీంతో ఆయా రైళ్లకు రాయితీ సౌకర్యాన్ని తొలగించింది.


ప్రైవేటీకరణలో భాగంగానేనా..?

రైల్వేశాఖ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని కొంతకాలంగా వామపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌ స్టేషన్‌లాంటి పెద్ద స్టేషన్లను ఇండియన్‌ రైల్వే స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎ్‌సడీసీ)కి అప్పగించి నడిపిస్తున్నారు. స్టేషన్లలో పార్కింగ్‌ నుంచి టికెట్ల అమ్మకాల వరకు అన్ని పనులను ఐఆర్‌ఎ్‌సడీసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రాయితీ టికెట్ల ద్వారా ఆదాయం తగ్గిపోతుందనే భావనతో రైల్వే ఉన్నతాధికారులు వాటిని అమలులోకి తీసుకురావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాగూ సాధారణ రేట్లకు అలవాటుపడ్డారనే ఉద్దేశంతో రాయితీ ఇవ్వడం లేదని వామపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. రైల్వే ప్రైవేటీకరణ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. 


పరిస్థితులు మారినా..!

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైలు నంబర్‌కు ముందు ‘0’ పేరు తగిలించి నడిపిస్తున్న కొవిడ్‌ స్పెషల్‌ రైళ్లను నవంబర్‌ 15 నుంచి ఎత్తివేశారు. గతంలో ఏ నంబర్లతో నడిచాయో.. అలాగే అదనంగా వసూలు చేస్తున్న 30 శాతం చార్జీలనూ రద్దు చేసి కొవిడ్‌కు ముందున్న చార్జీలనే వసూలు చేస్తున్నారు. దీంతో రాయితీ టికెట్లు కూడా అమలులోకి వస్తాయని ఆశపడిన సీనియర్‌ సిటిజన్లు, తదితరులకు భంగపాటే ఎదురవుతోంది. ఇప్పటికీ రాయితీ ఇవ్వడం లేదు.


రాయితీ ఇవ్వడం లేదు..!

నాకు 79 ఏళ్లు, నా భార్య సరోజనకు 68 ఏళ్లు. మా చుట్టాలు వరంగల్‌, ఖమ్మంలో ఉండడంతో పండుగలు, శుభకార్యాలకు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటాం. తిరుపతి, భద్రాచలంకు ఏడాదిలో రెండు సార్లు వెళ్తాం. కరోనా లేక ముందు సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌కు గోల్కొండ, కృష్ణా ఎక్స్‌ప్రె్‌సల్లో వెళ్తే ఒక్కొక్కరికి రూ.50 టికెట్‌ అయ్యేది. ఇప్పుడు రూ.75 చొప్పున తీసుకుంటున్నారు. నాకు 79 ఏళ్లు అని ఆధార్‌కార్డు చూపిస్తున్నా స్టేషన్‌లో కన్సెషన్‌ ఇవ్వడం లేదు. రాయితీ టికెట్లను మళ్లీ ఇవ్వాలి. - గునికంటి కట్టయ్య, బోడుప్పల్‌

Updated Date - 2021-11-23T14:18:28+05:30 IST