ఓటు రాజకీయాల సుడిలో రైల్వే జోన్

ABN , First Publish Date - 2022-05-26T05:58:27+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన కీలకమైన ఒప్పందాలలో రైల్వే జోన్‌ ఏర్పాటు ఒకటి. నిజానికి రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నా రాష్ట్రానికి చెందిన ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం...

ఓటు రాజకీయాల సుడిలో రైల్వే జోన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన కీలకమైన ఒప్పందాలలో రైల్వే జోన్‌ ఏర్పాటు ఒకటి. నిజానికి రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నా రాష్ట్రానికి చెందిన ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఆడుతున్న నాటకాలకు రైల్వేజోన్‌ బలవుతోంది. విధానపరంగా రైల్వేలో చోటుచేసుకొన్న మార్పుల కారణంగా దేశంలో ఇంచుమించు ప్రతి రాష్ట్రంలో ఒక రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో రెండేసి రైల్వే జోన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేరళ, మిజోరం, గోవా వంటి చిన్న రాష్ట్రాలు మినహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో సహా మిగిలిన అన్ని పెద్ద రాష్ట్రాలలో 16 రైల్వే జోనల్‌ కేంద్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రలలో రెండేసి రైల్వే జోన్లు ఉన్నాయి. రైల్వే డివిజన్ల సంఖ్య, డివిజన్ల ఆదాయం ప్రాతిపదికన కొత్త జోన్లు ఏర్పాటు చేసేవారు. ఆదాయపరంగా భారతదేశంలో న్యూఢిల్లీ జోన్‌ ప్రథమ స్థానంలో ఉంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. ఉదాహరణకి 2015–16 సంవత్సరంలో న్యూఢిల్లీ జోన్‌ ఆదాయం రూ.15,700 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం రూ.15,131 కోట్లుగా నమోదైంది. అయితే ఆదాయాలతో నిమిత్తం లేకుండా ఏ రాష్ట్రానికి చెందిన నాయకులు రైల్వే మంత్రిగా అధికారంలో ఉంటే ఆ రాష్ట్రాలలో తమ చిత్తం వచ్చినట్టు కొత్త రైల్వే డివిజన్లు, జోన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ జోన్‌ కంటే తక్కువ ఆదాయం కలిగిన పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లలో కొత్తగా ఏడు రైల్వేజోన్‌లు, ఎనిమిది రైల్వే డివిజన్లు ఏర్పడ్డాయి. నిజానికి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న జోన్‌తో పాటు అదనంగా విజయవాడ కేంద్రంగా మరో జోన్‌ ఏర్పాటు కావలసి ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్‌ కావడంతోపాటు ఆదాయంలోనూ విజయవాడ డివిజన్‌ ప్రథమ స్థానంలో ఉంది. అంతేకాకుండా విజయవాడలో జోనల్‌ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం కూడా ఉంది.


ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు పెద్దగా ఒత్తిడి లేకుండానే కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోనల్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌, మౌలిక సదుపాయాల విభాగంలో 80వ అంశంగా కూడా పొందుపర్చారు. సంప్రదాయంగా ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని కేంద్రాలలోనే రైల్వే జోన్లు పనిచేస్తున్నాయి. ఈ సంప్రదాయానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొత్తగా ఏర్పడే రైల్వేజోన్‌ రాష్ట్రరాజధాని అమరావతికి బదులుగా విశాఖపట్నంలో ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఇది సాంకేతికంగా ఏమాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే విశాఖపట్నం రైల్వే డివిజన్‌ ఒడిషాలోని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలో ఉంది. ప్రస్తుతం మంచి ఆదాయ వనరుగా వున్న విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను వదులుకోవడానికి ఒడిషా నాయకులు సిద్ధంగా లేరు. సాంకేతికంగా కూడా ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేకు ఇబ్బంది కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులకు సాంకేతికపరమైన ఇటువంటి ఇబ్బందుల గురించి తెలిసినా కేవలం ఉత్తరాంధ్ర ఓట్ల రాజకీయాల కోసం విశాఖపట్నంలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలనే ప్రస్తావన ముందుకు తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే వార్తలు వస్తున్నప్పటికీ రాష్ట్రానికి చెందిన నేతలు విభజన చట్టంలోని కీలక అంశాల పట్ల శ్రద్ధ వహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి ఏ విధంగా అన్యాయం చేయాలా? అని ఎదురు చూస్తున్న కేంద్రంలోని కొంతమంది నాయకులు కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు.


రైల్వే పరంగా జరుగుతున్న మరో అన్యాయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేక రైల్వేస్టేషన్లు ఇతర రాష్ట్రాలకు చెందిన రైల్వే డివిజన్లలో కొనసాగుతున్నాయి. తడ–గూడూరు (68 కి.మీ.) మధ్య ఉన్న రైల్వేస్టేషన్లు ప్రస్తుతం దక్షిణ రైల్వేకు చెందిన చెన్నై డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. అదే విధంగా హిందూపురం–ధర్మవరం(107 కి.మీ.) మధ్యనున్న రైల్వేస్టేషన్లు సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన బెంగుళూరు డివిజన్‌ పరిధిలో, పెనుకొండ వయా ప్రశాంతి నిలయం, ధర్మవరం (53 కి.మీ.), రేణిగుంట రైల్వేస్టేషన్‌ (68 కి.మీ.) చెన్నై డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులు తమ తమ ప్రాంతాలలో కొత్త డివిజన్లు ఏర్పాటు చేయించుకుంటుంటే మన రాష్ట్రానికి చెందిన నాయకులు మాత్రం కనీసం మనకు చెందాల్సిన ప్రాంతాలను కూడా మన రైల్వే డివిజన్లలో విలీనం చేయించలేకపోతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులు తమ సొంతప్రయోజనాలు లేదా పార్టీ అధినేతల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం మినహా, రాష్ట్రంలో రైల్వే సదుపాయాల అభివృద్ధి గురించి ఆలోచించేవారే కనిపించడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికంగా విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ, ఓడల తయారీ పరిశ్రమ, బిహెచ్‌ఇఎల్‌ వంటి భారీ పరిశ్రమలే కాకుండా భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు ప్రారంభించడానికి కూడా విశాఖపట్నం అనుకూలంగా ఉంది. రైల్వే జోన్‌ కేంద్రం ఏర్పాటు చేసినా, చేయకపోయినా విశాఖపట్నం అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. కాని విజయవాడ పారిశ్రామికంగా అత్యంత వెనుకబడి ఉంది, రైల్వేజోన్‌ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ స్థితిలో రాజకీయపార్టీలు తమ ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రంలో తక్షణం రైల్వే జోన్‌ ఏర్పడే విధంగా కృషిచేయాల్సి ఉంది. లేదంటే ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో స్వార్ధపరనేతలుగా నిలిచిపోతారు. 

అన్నవరపు బ్రహ్మయ్య

సీనియర్‌ పాత్రికేయలు

Updated Date - 2022-05-26T05:58:27+05:30 IST