వైర్‌లెస్‌ కాలనీలో రైల్వే జోన్‌ కార్యాలయం?

ABN , First Publish Date - 2022-05-25T06:41:27+05:30 IST

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త రైల్వే జోన్‌ (దక్షిణ కోస్తా) కార్యాలయానికి ప్రాథమికంగా స్థలం ఎంపిక జరిగింది.

వైర్‌లెస్‌ కాలనీలో రైల్వే జోన్‌ కార్యాలయం?
వైర్‌లెస్‌ కాలనీలో ఖాళీగా ఉన్న స్థలం

ప్రాథమికంగా 40 ఎకరాలు గుర్తింపు

త్వరలో ఆర్కిటెక్ట్‌ నియామకం

డీపీఆర్‌కు త్వరలో గ్రీన్‌సిగ్నల్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త రైల్వే జోన్‌ (దక్షిణ కోస్తా) కార్యాలయానికి ప్రాథమికంగా స్థలం ఎంపిక జరిగింది. ప్రధాన రైల్వే స్టేషన్‌కు సమీపానున్న వైర్‌లెస్‌ కాలనీలో భారీ భవనాల నిర్మాణానికి నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఆర్కిటెక్ట్‌ను కూడా త్వరలో నియమించనున్నట్టు సమాచారం. మరోవైపు జోన్‌ ఏర్పాటుకు రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కూడా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఖరారు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. 

కొత్త జోన్‌ ప్రకటించి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడల్లా డీపీఆర్‌ పరిశీలిస్తున్నామనే రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. జోన్‌ ప్రకటించామంటే...వచ్చేసినట్టేనని అందులో మరో ఆలోచన లేదని వాదిస్తోంది. 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు ప్రకటించారు. అయితే అందులో కేవలం రూ.3.5 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో అందరిలోను అనుమానాలు వ్యక్తమయ్యాయి. జోన్‌ కార్యకలాపాలు ముందుకు తీసుకువెళ్లడానికి నియమించిన ఓఎస్‌డీలు కూడా ఖాళీగానే ఉంటున్నారు. జోన్‌ ఏర్పాటుకు అవసరమైన భూములపై ఇంకా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎడతెగని సంప్రతింపులు నడుస్తున్నాయి. ముడసర్లోవ సమీపాన ఇచ్చిన 52 ఎకరాల్లో కొంత భూమి వివాదంలో ఉంది. అక్కడి నుంచి రైతులు కదలడం లేదు. వాస్తవానికి అక్కడే జోన్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించారు. ఆ భూమి ఎంత కాలమైనా చేతికి రాకపోవడంతో తమ దగ్గరున్న భూములనే వినియోగించుకుంటామని ఉన్నతాధికారులకు తెలియజేశారు. స్టేషన్‌కు ఎదురుగా ఉన్న వైర్‌లెస్‌ కాలనీలోకి పాత క్వార్టర్లను గతంలోనే కూల్చేశారు. అక్కడ 40 ఎకరాల వరకు అందుబాటులో ఉంది. వాస్తవానికి ముందు జోన్‌కు 150 ఎకరాల వరకు అవసరమని లెక్కలు వేశారు. ఆ తరువాత అందుబాటులో ఉన్నవాటిని ముందు ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మేరకు వైర్‌లెస్‌ కాలనీలో కొత్త జోన్‌ కార్యాలయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

Updated Date - 2022-05-25T06:41:27+05:30 IST