ఎడతెగని వాన

ABN , First Publish Date - 2021-07-23T05:36:47+05:30 IST

జిల్లాలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఎడతెగని వాన
దుగ్గిరాలలో పొలంలో వర్షపునీటిని బయటకు పంపేందుకు అవస్థలు పడుతున్న రైతు

జిల్లాలో విస్తారంగా వర్షాలు

మెట్టపంటలకు జీవం

వెద పద్ధతిలో వరిసాగు చేసిన పొల్లాలో నిలిచిన నీరు

ఆందోళన చెందుతున్న వెదసాగు రైతులు 

పట్టణాల్లో శివారు కాలనీలు జలమయం

పలుచోట్ల రోడ్లపై విరిగిన భారీ వృక్షాలు

రాకపోకలకు అంతరాయం

  

జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. మెట్ట పంటలకు ఈ వర్షం జీవం ఇస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఇప్పటికే వెద పద్ధతిలో వరిసాగు చేసిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు విత్తనాలు ఒకచోట చేరి మురిగిపోతాయని అంటున్నారు. దీంతో పొల్లాలో నీరు బయటకు పంపే యత్నాలు చేస్తున్నారు. వర్షాల కారణంగా శివారు కాలనీలు జలమయం అయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

 

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూలై 22: జిల్లాలో రెండు రోజులుగా  విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ముసురు వర్షం పడుతూనే ఉంది. ఖరీఫ్‌ ప్రారంభమైన తరుణంలో డెల్టాలో విద్యుత్‌ బోర్ల కింద కొంతమంది నారుమళ్లు పోసుకోగా, ఎక్కువమంది రైతులు వెద పద్ధతి వరి సాగును ఎంచుకున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ పద్ధతి వేసిన వరి పొలాల్లో వర్షం నీరు నిలిచాయి. పంట కాల్వల్లో సైతం నీటితో పరవళ్లు తొక్కడంతో పొలాల్లో నుంచి నీరు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. లేత, ముదురు నారుమళ్లుకు ప్రస్తుతం కురిసిన వర్షం వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ అల్పపీడన ప్రభావంతో భారీవర్షాలు కురిస్తే మాత్రం అవి కూడా ముంపు బారిన పడతాయి. రేపల్లె నియోజకవర్గంలోనూ ఎక్కువమంది రైతులు వెద పద్ధతిలో విత్తనాలు చల్లారు. వర్షాల కారణంగా పొలాల్లో నీరు చేరి వరి విత్తనాలు ఒక చోట చేరి మురిగిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొన్నూరు మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుగ్గిరాల మండలంలో వెదపెట్టిన పొలాల్లో నీరు నిండి మొలకెత్తిన వరినీట నానిపోయింది. వేరుతో సహాపైకి వచ్చి వర్షంలో తేలియాడుతుండటంతో రైతులు నిరాశ చెందుతున్నారు. రెండు వారాల లోపు వెదపెట్టిన పొలాలన్నీ దెబ్బతిన్నాయని అన్నదాతలు వాపోతున్నారు. ఎకరానికి రూ.10వేల వరకూ ఖర్చుపెట్టామని, మరోమారు వెద పెట్టాలంటే సమయం మించిపోతోందని అంటున్నారు.  


మెట్ట పంటలకు మేలు

 పల్నాడు ప్రాంతంలో  గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతున్నాయి. దీతో ఇప్పటికే సాగు చేసిన మెట్టపంటలకు జీవం పోసినట్లయింది. మాగాణి సాగు చేసే రైతులు వరి నారుమళ్లు పసేందుకు సిద్ధమవుతున్నారు. పొన్నూరు ప్రాంతంలో మెట్ట పంటలైన కూరగాయలు, పండ్ల తోటలు, తమలపాకు పంటల సాగుకు ప్రస్తుతం కురుస్తున్న వర్షం మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు. 


రాకపోకలకు అంతరాయం

 రొంపిచర్ల మండలం తుంగపాడు వద్ద బ్రిడ్జి నిర్మాణం కారణంగా ఏర్పాటు చేసిన డైవర్షన్‌ రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వడ్లమూడివారిపాలెం మీదుగా నరసరావుపేటకు వాహన రాకపోకలు సాగాయి. దుగ్గిరాలలో నిర్మించిన మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా వర్షపునీరు నిలిచిపోయాయి. రోడ్డు పక్కనే వేసిన బెరమ్స్‌ వర్షానికి కుంగి, వాహనాలు దిగబడిపోతున్నాయి. దీంతో గ్రామంలోకి రావలసిన ఆర్టీసీ సర్వీసులను తెనాలి- విజయవాడ మెయిన్‌రోడ్డు మీదుగా  నడుస్తున్నాయి.  డోలాస్‌నగర్‌లో పాత జాతీయ రహదారిపై ఓ భారీ వృక్షం నేలకొరిగింది. తెనాలి నుంచి గుంటూరు వెళ్ల్లే ప్రధాన మార్గంలో చెంచుపేట  వద్ద చెట్టు నేలకొరిగింది. ట్రాఫిక్‌ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని నేలకొరిగిన చెట్టును తొలగింపు చర్యలు చేపట్టారు. గుంటూరు నగరంలోని బ్రాడీపేట, ఉమెన్స్‌ కాలేజీ వద్ద చెట్లు నేలకొరిగాయి. నూజెండ్ల మండలం తెల్లబాడు వెళ్లే ప్రధాన రహదారిపై నీరు నిల్వ ఉండటంతో కంభంపాడు, పమిడిపాడు గ్రామాలకు చెందిన ప్రజలు వినుకొండకు రావాలంటే అవస్థలు పడుతున్నారు. వినుకొండ నుంచి ఈదరకు వెళ్లే రహదారి దెబ్బతింది. 

 

ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తం

రాష్ట్రమంతటా వర్షాలు పడుతుండడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం మంగళగిరిలోని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని గురువారం వివిధ ముంపు ప్రాంతాలకు తరలించారు. విశాఖపట్నంకు రెండు బృందాలు, పోలవరం, దేవీపట్నానికి రెండేసి బృందాలు, భద్రాచలానికి ఒక బృందాన్ని సహాయక చర్యల నిమిత్తం ఇక్కడినుంచి పంపించారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో కర్నాటక రాష్ట్రానికి కూడ మరో నాలుగు బృందాలను గురువారం పంపించారు. మరికొద్ది రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల నేపధ్యంలో మరిన్ని బృందాలను ఇతర ప్రాంతాలకు పంపించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.


 25.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం

జిల్లాలో గురువారం ఉదయం 8 గంటల వరకు 57 మండలాల్లో 25.9 మిల్లీమీటర్ల వర ్షపాతం నమోదై నట్లు అధికారులు తెలిపారు. అధికంగా కారంపూడి మండలంలో 62.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, తక్కువగా కర్లపాలెం మండలంలో 8.2 మిల్లీమీటరు వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 100.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సివుండగా 173.1 మిల్లీమీటర్లు కురిసి 72 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

  

 వర్షాలతో స్తంభించిన జనజీవనం 

 నరసరావుపేట పట్టణంలో వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చిరు వ్యాపారులు, కూలీలు, చేతివృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాడేపల్లిలో తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ నీరు చేరుకుని రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. తాడికొండలోని గొడుగు కంపెనీ సమీపంలోని వ్యవసాయ డొంకల్లోకి వర్షం నీరు పొంగిపొర్లాయి. గురుకుల పాఠశాల వెనుక పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలలోకి వెళ్లడానికి వీలులేకుండా నీళ్లు ప్రవహించాయి.  రేపల్లె పట్టణంలో డ్రెయినేజీలో వర్షపునీరు పారుదలలేక పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. బెల్లంకొండలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వర్షపు నీరు నిలబడింది. 

Updated Date - 2021-07-23T05:36:47+05:30 IST