అతలాకుతలం

ABN , First Publish Date - 2021-07-24T06:07:08+05:30 IST

అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా కురిసిన వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లాను అతలా కుతలం చేశాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గెరువివ్వడంతో ప్రజలు రోజు వారీ కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. సాయంత్రం మళ్లీ వర్షపు చినుకులు మొదలయ్యాయి. మబ్బులు కమ్ముకొని వర్షం కురిసింది. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్డులను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జిల్లా సమీకృత కలెక్టరేట్‌ జలమయం కావడంతో పరిస్థితులను ఆర్డీవో శ్రీనివాసరావు, అర్‌ఆండ్‌బీ ఈఈ కిషన్‌రావు పరిశీలించారు.

అతలాకుతలం
రుద్రంగిలో రోడ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

- మూడు రోజులు కురిసిన వర్షం 

- పొంగుతున్న వాగులు

- నిండిన చెరువులు 

- మిడ్‌ మానేరుకు జలకళ

- దిగువకు కొనసాగుతున్న నీటి ప్రవాహం

-  నష్టాన్ని పరిశీలించిన కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా కురిసిన వర్షాలు రాజన్న సిరిసిల్ల జిల్లాను అతలా కుతలం చేశాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గెరువివ్వడంతో ప్రజలు రోజు వారీ కార్యక్రమాల వైపు దృష్టి సారించారు. సాయంత్రం మళ్లీ వర్షపు చినుకులు మొదలయ్యాయి. మబ్బులు కమ్ముకొని వర్షం కురిసింది. వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్డులను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జిల్లా సమీకృత కలెక్టరేట్‌ జలమయం కావడంతో పరిస్థితులను ఆర్డీవో శ్రీనివాసరావు, అర్‌ఆండ్‌బీ ఈఈ కిషన్‌రావు పరిశీలించారు. కలెక్టరేట్‌ వద్ద నీరు తొలగిపోవడంతో యథావిధిగా పరిపాలన కార్యక్రమాలు కొనసాగాయి. భారీ వర్షాలకు రుద్రంగి కొచ్చగుట్ట దారిలో సూరమ్మ చెరువు ప్రవాహంలో కల్వర్టు కొట్టుకుపోయింది. దీనిని పరిశీలించిన కలెక్టర్‌ మరొక రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో గొల్లపల్లిలోని సంగం చెరువుకు గండి పడింది. చెరువు మత్తడిని రైతులు తొలగించారు. చందుర్తి మండలం దేవుని తండా వద్ద చెరువు నీళ్లు పెరిగి రోడ్డుపైకి రావడంతో కోనరావుపేటకు వెళ్లే రహదారిని మూసివేశారు. పదిర శివారులోని చిట్టివాగు ఉధృతికి రోడ్డు కోట్టుకుపోయింది. ముస్తాబాద్‌, కోనరావుపేట, వేములవాడ, చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పంట పొలాల్లోకి నీరు చేరింది. అనేక పొలాలు నీట మునిగాయి. మొలకల దశలోనే పత్తి దెబ్బతింది. ఎల్లారెడ్డిపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో పలు ఇళ్లు వర్షానికి కూలిపోయాయి. జిల్లాలోని మానేరు, మూలవాగులు పొంగిపోర్లుతున్నాయి. జిల్లాలోని అనేక చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎగువ మానేరు మత్తడి దూకుతోంది. చందుర్తి మండలం ఎన్గల్‌, మర్రిగడ్డ రోడ్డు కోట్టుకుపోయింది. తంగళ్లపల్లి లక్ష్మీపూర్‌ మధ్య తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు వరదనీరుకు కొట్టుకుపోయింది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో రోడ్డు చిత్తడిగా మారింది. నడవడానికి ఇబ్బందిగా మారింది. వాగుల ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక వాడల్లో  ఇళ్లలోకి నీళ్లు చేరాయి.    


మిడ్‌ మానేరు నుంచి దిగువకు నీళ్లు 

జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ నుంచి కరీంనగర్‌ లోయర్‌ మానేరు డ్యాంకు ఆరు గేట్ల ద్వారా నీటి ప్రవాహం కొనసాగుతోంది. 27.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో 24 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10,018 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండడంతో ఆరు గేట్లద్వారా 23,906 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 


జిల్లాలో 63.4 మిల్లీమీటర్ల వర్షం 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు 63.4 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. పొద్దంతా వర్షం కురవకపోయినా సాయంత్రం మళ్లీ   మొదలైంది. జిల్లాలో అత్యధికంగా బోయినపల్లి మండలంలో 73.9 మిల్లీమీటర్ల వర్షం కురవగా అతి తక్కువగా ఇల్లంతకుంట మండలంలో 47 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రుద్రంగిలో 73.1 మిల్లీమీటర్లు, చందుర్తి 70.9, వేములవాడ రూరల్‌ 61.1, వేములవాడ 70.7, సిరిసిల్ల 64.3, కోనరావుపేట 63.7, వీర్నపల్లి 56, ఎల్లారెడ్డిపేట 55.9, ముస్తాబాద్‌ 72.6, తంగళ్లపల్లిలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ప్రస్తుతం 323.5  మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి   676.2మిల్లీమీటర్లు నమోదైంది.


Updated Date - 2021-07-24T06:07:08+05:30 IST