ముంచెత్తిన వర్షం

ABN , First Publish Date - 2020-12-04T03:42:44+05:30 IST

వాయుగుండం ప్రభావంతో గురువారం ఎడతెరపి లేకుండా వర్షం ముంచెత్తింది.

ముంచెత్తిన వర్షం
జలమయమైన ముత్తుకూరు ప్రాథమికోన్నత పాఠశాల

ముత్తుకూరు, డిసెంబరు 3: వాయుగుండం ప్రభావంతో  గురువారం ఎడతెరపి లేకుండా వర్షం ముంచెత్తింది. ఇటీవల నివర్‌ తుఫాన్‌తో కురిసిన వర్షాల నుంచి తేరుకునేంతలోనే మళ్లీ వర్షాలు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  గురువారం ఉదయం నుంచి సాయంత్రానికి మండలంలో 43 మి.మీల వర్షపాతం నమోదయ్యింది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో ముత్తుకూరు ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణం జలమయమైంది. స్థానిక పీహెచ్‌సీ ఆవరణలోనూ నీరు నిలిచి, మడుగులా తయారయ్యింది. నివర్‌ తుఫాన్‌ కారణంగా నీటమునిగిన నారుమళ్లు, వరినాట్లు కాపాడుకునేందుకు రైతులు ఒకవైపు ప్రయత్నాలు చేస్తుండగా, గురువారం కురిసిన వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది. భారీ వర్షంతో పొలాల్లో నీరు నిలబడి, నారుమళ్లు, వరినాట్లు మళ్లీ నీటమునిగాయి. ఇప్పటికే ఐదు రోజులగా నీళ్లలో నానిపోవడంతో ఇక నారుమళ్లు పనికి రావని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.  

టీపీగూడూరులో..

టీపీగూడూరు: మండలంలో గురువారం కురిసిన భారీ వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  ఇటీవల ‘నివర్‌’ తుఫాన్‌ తాకిడికి తట్టుకుని తేరుకుంటున్న సమయంలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో పంటలు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొల్లాలోని నీళ్లు తొలగించేలోపే మళ్లీ నారుమళ్లు, వరినాట్లు ముంపునకు గురయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జలమయమైన కాలనీలు, దళితవాడల్లో గురువారం వర్షం ధాటికి మళ్లీ నీరు చేరింది. గ్రామాల అంతర్గత రహదారులు బురదమయంగా మారాయి. 

 మనుబోలులో..

మనుబోలు: ‘బురేవి’ తుఫాన్‌ ప్రభావంతో గురువారం మండలంలో చిరుజల్లులు కురిశాయి. వేకువజాము నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా జల్లులు పడుతుండడంతో పల్లపు ప్రాంతాల్లో ఉండే గిరిజన కాలనీలోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీవాసులు అవస్థలు పడ్డారు. ‘నివర్‌’ తుఫాను ప్రభావంలానే పొలాల్లో మళ్లీ వర్షపునీరు చేరింది. నార్లు కనిపించకుండా మునిగిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందారు. 46.8మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఏఎస్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు.  

 కోవూరులో..

కోవూరు : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు.. గురువారం నుంచి కురుస్తున్న వర్షానికి జనం అతలాకుతలమవుతున్నారు. బురేవి తుఫాన్‌ ప్రభావంతో వేకువజాము నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న కుండపోత వర్షానికి  కోవూరులోని వీధులు,  కాలువలు,  ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు  నీటితో నిండిపోయాయి. పట్టణంలోని  ప్రభుత్వ వైద్యశాల, పశువైద్యశాలల్లో వర్షపునీరు చేరుకున్నాయి. రెండేళ్ల క్రితం నిర్మించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణం మోకాలులోతు నీటితో నిండింది. జడ్పీ బాలికోన్నత పాఠశాల, ప్రత్యేక అవసరాల బాలల పాఠశాలల్లో నీరు చేరాయి. పట్టణంలోని బజారు కూడలి, పీఆర్‌ఆర్‌ కాలనీల్లోని వీధులన్నీ జలమయమయ్యాయి. సత్రంవీధి ప్రారంభంలో నడిరోడ్డులో గుంత పడింది. దీంతో వాహనదారులు నానాఅవస్థలు పడుతున్నారు.

 ఇందుకూరుపేటలో..

ఇందుకూరుపేట : తుఫాను ప్రభావంతో గురువారం మండలంలో కురిసిన వర్షాలకు అనేక దళిత, గిరిజన కాలనీలు జలమయమయ్యాయి. గత వారం రోజులుగా కురిసిన వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గ్రామాలు, తిరిగి గురువారం కురిసిన వర్షానికి నీట మునిగాయి. దీంతో తీర గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అలాగే ఈ వర్షాలకు నిడిముసలి, నాగరాజుతోపు, కొత్తూరు గ్రామ వాడలు నీట మునిగాయి.  






 

Updated Date - 2020-12-04T03:42:44+05:30 IST