rains: ఆంధ్రప్రదేశ్‌కు వర్షసూచన

ABN , First Publish Date - 2022-10-01T02:52:31+05:30 IST

శ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని నుంచి రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి విస్తరించింది.

rains: ఆంధ్రప్రదేశ్‌కు వర్షసూచన

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని నుంచి రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల శుక్రవారం ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల ఒక మోస్తరుగా, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదు కానున్నది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు సాగే ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో దీర్ఘకాల సగటులో 88 నుంచి 112 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణాదిలోని కోస్తా, రాయలసీమ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో ఏడాదిలో కురిసే వర్షాల్లో సగటున 30 శాతం, తమిళనాడులో 48 శాతం  ఈ సీజన్‌లోనే కురుస్తాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అంతగా ఉండదు.


ఈ సీజన్‌లో దక్షిణాదిలోని ఐదు వాతావరణ సబ్‌ డివిజన్‌లు...కోస్తా, రాయలసీమ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో 334.13 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ సమయంలోనే బంగాళాఖాతంలో తుఫాన్‌లు సంభవిస్తాయి. అక్టోబరులో కోస్తా/ఒడిశా, నవంబరులో దక్షిణ కోస్తా, తమిళనాడు, డిసెంబరులో తమిళనాడులో తుఫాన్‌ల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. కాగా ఈ ఏడాది అక్టోబరు నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం పసిఫిక్‌ మహా సముద్రంలో వున్న లానినా పరిస్థితులు ఈ ఏడాది చివరివరకు కొనసాగుతాయని అంచనా వేసింది. అయితే వచ్చే నైరుతి సీజన్‌ వరకు లానినా వుంటుందని అంతర్జాతీయ మోడల్స్‌ కొన్ని అంచనా వేస్తున్నాయి.

Updated Date - 2022-10-01T02:52:31+05:30 IST