రహదారులకు వర్షం దెబ్బ

ABN , First Publish Date - 2020-09-23T06:51:10+05:30 IST

ఉమ్మడి జిల్లాలో అంచనాకు మించి వర్షం నమోదు కావడంతో ఓ వైపు పంటలు మరో వైపు రహదారులు

రహదారులకు వర్షం దెబ్బ

ఉమ్మడి జిల్లాలో రూ.100కోట్ల భారం

తక్షణ మరమ్మతులకు రూ.8కోట్లు

మంజూరుకు ఎదురుచూపులు

కుంగిన కోదాడ-జడర్చ జాతీయ రహదారి

సర్వీసు రోడ్లు గల్లంతు


నల్లగొండ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), సెప్టెంబరు 22: ఉమ్మడి జిల్లాలో అంచనాకు మించి వర్షం నమోదు కావడంతో ఓ వైపు పంటలు మరో వైపు రహదారులు దెబ్బతిన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో గత కొన్నేళ్లుగా రోడ్ల నిర్వహణకు నిఽఽధులు లేకపోగా వర్షం తీవ్రతకు భారీగా నష్టం వాటిల్లింది. దెబ్బతిన్నవి పునర్‌నిర్మించాలంటే రూ.100 కోట్లు, తక్షణ మరమ్మతులకు రూ.8 కోట్లు కావాలంటూ ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. కోదాడ-జడ్చర్ల రహదారి నిర్మాణంలోనే ఇబ్బందులను ఎదుర్కొంటోంది. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి, నార్కెట్‌పల్లి-అద్దంకి రాష్ట్రీయ రహదారులు ప్రైవేటు సంస్థలు టోల్‌ వసూలు చేస్తూ ప్రధాన రహదారిని నిర్వహిస్తున్న సర్వీసు రోడ్లు గల్లంతు అయ్యాయి.


రూ.100 కోట్ల నష్టం

జిల్లాలో ఏ రోడ్డు చూసినా అద్ధాన్నంగా తయారయ్యాయి. కాసులు కురిపించే జాతీయ, రాష్ట్రీయ రహదారులు మినహా అన్ని రూపురేఖలు కోల్కోయాయి. ప్రధానంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రోడ్లకు ఏళ్ల తరబడి నిర్వహణ నిధులు లేవు. పూర్తిగా గుంతులు ఉండగా తాజాగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో కోతక గురయ్యాయి. పట్టణాల్లో సిమెంటు, మట్టితో ట్రాఫిక్‌, మున్సిపల్‌ సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా పల్లెల్లో పట్టించుకునే నాథుడే లేడు. రహదారులు తెగిపోగా పక్క గ్రామాల నుంచి తిరిగిపోయే పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో నెలకొంది. వర్షాలకు ప్రధానంగా రోడ్లు, భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) రహదారులు బాగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు ఎక్కడికి అక్కడ కోసుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. వర్షాల దెబ్బకు ఉమ్మడి జిల్లాలో 322 కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలు పడి వాహన ప్రయాణీకులకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. రూ.100 కోట్ల మేర తమ రోడ్లుకు నష్టం జరిగిందని ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదిక రూపొందించారు. పూర్తి స్థాయి నిర్మాణాలకు సంబంఽధించిన ప్రతిపాదనలు ఇంజనీర్‌ ఇన్‌ ఛీఫ్‌(ఈన్‌సీ)కి పంపారు. తక్షణ మరమ్మతులకు రూ.8 కోట్లు కావాలని నివేదించారు. 


నామరూపాలు లేకుండా పోయిన రోడ్డు

 ఈ ఫోటో చూడండి.. అనుముల మండలంలోని కాశవారిగూడెం నుంచి యాచారం వెళ్లే రహదారి. కల్వర్టు ముందు మొత్తం నామరూపాలు లేకుండా పోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలోని యాచారం వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. వర్షం దెబ్బకు కాశవారిగూడెం వారు అనుముల రోడ్డు మీదుగా రామడుగు నుంచి యాచారం చేరుకోవాల్సిన పరిస్థితి. చుట్టూ తిరిగి అదనంగా ఎనిమిదికిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి. ఈ మార్గం ఎప్పుడు మరమ్మతుకు నోచుకుంటుదో తెలియదు. 


కోదాడ- జడ్చర్ల రహదారిలో ఇబ్బందులు

కోదాడ- జడ్చర్ల మధ్య జాతీయరహదారి మంజూరైంది. ఈ 69వ జాతీయరహదారిని వేగంగా నిర్మించేందుకు మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టగా పలు చోట్ల సబ్‌ కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులకు ఇది ఉపయోగకరం. గతంలో ఉన్న రహదారిని విస్తరిస్తూ, మర్మతులు చేస్తున్నారు. కల్వర్టులు, బ్రిడ్జిలు పూర్తిగా కొత్తవి నిర్మిస్తున్నారు. అయితే వర్షాలతో ఇప్పటికే చేపట్టిన రోడ్లలో భారీగా గుంతులు ఏర్పడ్డాయి. రాత్రివేళ ఈ దారిలో ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. బ్రిడ్జి పనులు చేపడుతున్నా అవి నిలబడని పరిస్థితి. ఈ మార్గంలో నిడమనూరు మండల కేంద్రం వద్ద డైవర్షన్‌ రోడ్డు వర్షాలకు దెబ్బతినడంతో ప్రధాన రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తాత్కాలిక మరమ్మతులు చేసి రాకపోకలకు అనుమతించిన 24గంటల్లో  మళ్లీ అదే మార్గంలో పెద్ద గుంత ఏర్పడింది. పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని చిలకమర్రి స్జేజీ వద్ద రోడ్డు కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడటంతో వాహనాదురులు భయాందోళనలకు గురవుతున్నారు. 


సర్వీసు రోడ్లలో నరకం

టోల్‌గేట్ల ద్వారా కాసులు కురిపించే ప్రధాన రహదారిపైనే ప్రైవేటు కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. వాటి నిర్మాణానికి సహకరించిన గ్రామాల ఇబ్బందులను అవి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా బ్రిడ్జిలు, కల్వర్టులు అస్తవ్యస్తంగా నిర్మించారు. అండర్‌పా్‌సలు, రహదారులు సరైన ఎత్తు పెంచకుండానే నిర్మాణాలు పూర్తి చేశారు. వర్షం మూలంగా ఇప్పుడు వాటి ద్వారా తీవ్ర ఇబ్బందులు. వాహనదారులు వెళ్లే పరిస్థితి లేదు. ఈ రహదారులు నిర్మించి ఏడేళ్లు పూర్తయినా ఇప్పటికీ సర్వీసు రహదారుల నిర్మాణం జరగలేదు. దీంతో ప్రధాన రహదారికి అడ్డంగా ప్రయాణిస్తూ హైవే పరిసర గ్రామాల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అరకొరగా, నాణ్యత లేకుండా సర్వీసు రోడ్లు నిర్మించడంతో గతంలో అవి భారీ గుంతలు పడ్డాయి. తాజా వర్షాలకు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. మరమ్మతులు, శాశ్వతపనులకు ప్రతిపాదనల పంపాం: నర్సింహ. ఆర్‌అండ్‌బీ, ఎస్‌.ఇ. మరమ్మతులు చేపడితేనే రాకపోకలకు రహదారులు అనుకూలంగా ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో 322 కిలోమీటర్ల మేర తక్షణ మరమ్మతులకు రూ.8 కోట్లు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం.

Updated Date - 2020-09-23T06:51:10+05:30 IST