అకాల వర్షం.. తడిసిన ధాన్యం

ABN , First Publish Date - 2021-05-11T05:23:25+05:30 IST

అకాల వర్షం మరోసారి అన్నదాతను ఆగం చేసింది. ఆరబోసి అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం వాననీటి పాలయింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వచేసిన వడ్లు తడిసిపోయాయి.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం
కోహెడ మండలం ఆరేపల్లిలో వర్షానికి కొట్టుకుపోతున్న ధాన్యం

అకస్మాత్తుగా వచ్చిపడిన వాన  

తూకం వేయడం కోసం ఆరబోసిన వడ్లు నీటిపాలు


కోహెడ, మే  10: అకాల వర్షం మరోసారి అన్నదాతను ఆగం చేసింది. ఆరబోసి అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం వాననీటి పాలయింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద  నిల్వచేసిన వడ్లు తడిసిపోయాయి.కోహెడ మండలంలోని పలు గ్రామల్లో సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బస్వాపూర్‌, ఆరపెల్లి, పోరెడ్డిపల్లి, వెంకటేశ్వరపల్లి, గుండారెడ్డిపల్లి గ్రామాల్లో కొనుగోలుకేంద్రాల వద్ద నిల్వచేసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కేంద్రాల్లో సరిపడా టర్పాలిన్లు లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని తడువకుండా కాపాడుకోలేకపోయారు. కొన్నిచోట్ల వడగళ్లు పడడంతో కోతకువచ్చిన వరి దెబ్బతిన్నది. వడ్లు రాలిపోయాయి. పొలాలు నెలకొరిగాయి. పెద్దమొత్తంలో రైతులు నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 


కొనుగోలు కేంద్రాల్లో..

బెజ్జంకి, మే 10: బెజ్జంకి మండలంలో సోమవారం అకస్మాత్తుగా విరుచుకుపడిన గాలివానకు పలు గ్రామాల్లో కొనుగోలుకేంద్రాల్లో ధాన్యం కుప్పలు వర్షానికి తడిసిపోయాయి. మండలంలోని చీలపూర్‌, పెరుకబండ గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎంపీపీ నిర్మల, ఎంపీడీవో రాఘవేందర్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు  పరిశీలించారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకొని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం  మద్దతుధరకు కొనాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చెప్యాల శ్రీనివాస్‌ గౌడ్‌, సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్‌ కోరారు.


తూకానికి సిద్ధం చేసిన ధాన్యం..

చిన్నకోడూరు, మే 10: చిన్నకోడూరులో సోమవారం అకాల వర్షం కురియడంతో ఐకేపీ కొనుగోలుకేంద్రం వద్ద తూకం కోసం నిల్వచేసిన ధాన్యం  తడిసింది. ఆరుగాలం కష్టం వృథా అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


వానకు కొట్టుకుపోయిన వడ్లు

తొగుట, మే 10: తొగుట మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి కొనుగోలుకేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. తొగుట, తుక్కాపూర్‌, వెంకట్రావ్‌పేట తదితర గ్రామాల్లోని రైతులు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. వడ్లు తడవకుండా కాపాడుకోవడానికి రైతులు అవస్థలుపడినా లాభం లేకుండాపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరారు.


ఉరుకులు.. పరుగులు..

నంగునూరు, మే 10: మండలవ్యాప్తంగా సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలుకేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసింది. రైతులు వడ్ల కుప్పలపై కప్పేందుకు టార్పాలిన్‌ కవర్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. కేంద్రాల్లో సరిపడాకవర్లు లేకపోవడంతో ధాన్యం తడిసింది. మండలంలోని నంగునూరు, ఆరేపల్లి, గట్లమల్యాల, సిద్దన్నపేట తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం వర్షానికి కొటుఒకుపోయింది. తూకం వేయడంలో జాప్యం కారణంగానే వడ్లు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నంగునూరు నల్లపోచమ్మ ఆలయ ఆవరణలో తాటిచెట్టుపై పిడుగు పడింది. కొండంరాజుపల్లిలో గాలులుకు రేకులషెడ్డు కొట్టుకుపోయింది. 


కొమురవెల్లి మండలంలో...

చేర్యాల, మే 10: కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట, అయినాపూర్‌, తపా్‌సపల్లి, పోసాన్‌పల్లి గ్రామాలలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి కొనుగోలుకేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఒక్కసారి వాన విరుచుకుపడడంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులకు అవకాశం లేకుండాపోయింది. కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

Updated Date - 2021-05-11T05:23:25+05:30 IST