జిల్లాలో ముసురు వర్షం

ABN , First Publish Date - 2022-08-10T05:55:18+05:30 IST

జిల్లాలో మళ్లీ ముసురేసింది. సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా చల్లటి గాలులతో ముసురు కమ్మేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ముసురుతో కూడిన వర్షం ఎడతెరపి లేకుండా పడుతూనే ఉంది. మంగళవారం రోజంతా చిరుజల్లులు పడడంతో పట్టణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.

జిల్లాలో ముసురు వర్షం
జిల్లా కేంద్రంలో కురుస్తున్న ముసురుతో కూడిన వర్షం

- జిల్లా వ్యాప్తంగా వర్షాలు

- చల్లటి ఈదురు గాలులతో కమ్మేసిన ముసురు

- నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

- జిల్లాలో 31.7మి.మీ వర్షపాతం నమోదు


కామారెడ్డి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ ముసురేసింది. సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా చల్లటి గాలులతో ముసురు కమ్మేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ముసురుతో కూడిన వర్షం ఎడతెరపి లేకుండా పడుతూనే ఉంది. మంగళవారం రోజంతా చిరుజల్లులు పడడంతో పట్టణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 31.7మి.మీ వర్షపాతం నమోదైంది. ముసురుతో గ్రామీణ రహదారులతో పాటు పట్టణాల్లోని పలు వీధుల్లో రోడ్లు చిత్తడిగా మారాయి. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రధాన ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగులు దూకుతున్నాయి. జిల్లాలో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

సాధారణానికి మించి వర్షం

ఈ వర్షాకాలం సీజన్‌ మొదలైనప్పటి నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షాపాతం సాధారణం కంటే 94 శాతం అదనంగా నమోదైంది. సీజన్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షాపాతం 508మి.మీ కాగా ఇప్పటి వరకు 859.7మి.మీ వర్షం కురిసిందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని 22 మండలాల్లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు ఆయా మండలాల్లో మద్నూర్‌ 755.4మి.మీ వర్షం కురువగా జుక్కల్‌లో 702.2 మి.మీ, పెద్దకొడప్‌గల్‌లో 668.5, బిచ్కుందలో 748.9, బీర్కూర్‌లో 768.1, నస్రుల్లాబాద్‌లో 932.1, బాన్సువాడలో 1103.5, పిట్లంలో 699.1, నిజాంసాగర్‌లో 873.1, నాగిరెడ్డిపేటలో 990.5, ఎల్లారెడ్డిలో 893.1, లింగంపేటలో 936.0, గాంధారిలో 1199.1, సదాశివనగర్‌లో 804.4, తాడ్వాయిలో 1028.3, రాజంపేటలో 1138.4, భిక్కనూర్‌లో 690.8, కామారెడ్డిలో 1071.6, రామారెడ్డిలో 630.6, మాచారెడ్డిలో 760.4, దోమకొండలో 764.6, బీబీపేటలో 754.4మి.మీ వర్షం కురిసింది.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటల్లోకి వరద వచ్చి చేరుతుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగులలో నీరు ఉంది. 17.802 టీఎంసీలకు గాను 16.357 టీఎంసీలకు నీరు చేరింది. ప్రాజెక్టులోకి 8వేల క్యుసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. పోచారం ప్రాజెక్టులోకి సైతం 12వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెకు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.

Updated Date - 2022-08-10T05:55:18+05:30 IST